2028 నుంచి ఏటా 80 లక్షల యూనిట్ల ఉత్పత్తి లక్ష్యం
రాజస్థాన్, గుజరాత్ ప్లాంట్లలో ఉత్పత్తి పెంపు వ్యూహాలు
తద్వారా కొత్తగా 3,800 మందికి ఉద్యోగ అవకాశాల సృష్టి
హెచ్‌ఎంఎస్‌ఐ ప్రెసిడెంట్, సీఈవో సుత్సుము ఒటానీ వెల్లడి
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన దిగ్గజం ‘హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా’ (హెచ్‌ఎంఎస్‌ఐ) దేశంలో భారీ విస్తరణకు శ్రీకారం చుట్టింది. 2028 నాటికి తన వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 80 లక్షల యూనిట్లకు పెంచాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా దేశంలో కొత్తగా 3,800 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని హోండా ప్రెసిడెంట్, సీఈవో సుత్సుము ఒటానీ వెల్లడించారు.
‘‘అంతర్జాతీయ తయారీ, ఎగుమతుల వ్యూహంలో భారతదేశం అత్యంత కీలకమైన భాగస్వామిగా మారుతోంది. కేవలం దేశీయ అవసరాల కోసమే కాకుండా, పెరుగుతున్న అంతర్జాతీయ మార్కెట్ల డిమాండ్‌ను అందుకోవడానికి కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నాము’’ అని ఒటానీ తెలిపారు. హోండా దీర్ఘకాలిక విజన్‌లో ఎలక్ట్రిక్ వాహన రంగానికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ, భారతదేశంలో కేవలం ఈవీలపైనే కాకుండా ఐసీఈ, ప్రత్యామ్నాయ ఇంధన సాంకేతికతలతో కూడిన ‘సమతుల్య వ్యూహం’తో ముందుకు సాగుతామన్నారు. కస్టమర్లకు ఆచరణాత్మకమైన, సులభంగా అందుబాటులోకి వచ్చే, వినియోగదారు కేంద్రిత సొల్యూషన్లు అందించడంపైనే సంస్థ ప్రధానంగా దృష్టి సారించిందన్నారు.
ప్రతి ఏటా ఎగుమతుల్లో వృద్ధి
ప్రస్తుతం హెచ్‌ఎంఎస్‌ఐ సంస్థ జపాన్, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సహా మొత్తం 65 దేశాలకు వాహనాలను ఎగుమతి చేస్తోంది. కంపెనీ ఎగుమతుల గణాంకాలు ప్రతి ఏటా స్థిరంగా పెరుగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం 2024లో 3.6 లక్షల యూనిట్లు, ఆర్థిక సంవత్సరం 2025 లో 5.1 లక్షల యూనిట్లు ఉండగా, గత ఆర్థిక సంవత్సరం 2026లో అది 6.2 లక్షల యూనిట్లకు చేరింది. ఈ నిరంతర వృద్ధి భారత్‌ను హోండా అంతర్జాతీయ తయారీ హబ్‌గా మారుస్తోందని ఒటానీ తెలిపారు. ప్రస్తుతం మానేసర్ (హర్యానా), టపుకరా (రాజస్థాన్), నరసాపుర (కర్ణాటక), విఠలాపూర్ (గుజరాత్) ప్లాంట్ల ద్వారా హోండాకు ఏడాదికి 60 లక్షల యూనిట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యం ఉంది.
రూ.2,420 కోట్లతో ప్లాంట్ల విస్తరణ
రాజస్థాన్‌లోని టపుకరా ప్లాంట్‌లో రూ.1,500 కోట్ల పెట్టుబడితో మూడో ప్రొడక్షన్ లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది 2028 నాటికి అందుబాటులోకి రానుంది. తద్వారా అదనంగా 6.70 లక్షల యూనిట్ల సామర్థ్యం పెరిగి, ఈ ప్లాంట్ మొత్తం సామర్థ్యం 20.1 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. అలాగే, గతంలో ప్రకటించిన రూ.920 కోట్ల పెట్టుబడితో గుజరాత్‌లోని విఠలాపూర్ ప్లాంట్‌లో నాలుగో ప్రొడక్షన్ లైన్‌ను నిర్మిస్తున్నారు. ఇది 2027 నాటికి ప్రారంభం కానుంది. దీని ద్వారా వార్షిక సామర్థ్యం మరో 6.50 లక్షల యూనిట్లు పెరిగి, మొత్తం ప్లాంట్ కెపాసిటీ 26.1 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. తద్వారా ప్రపంచంలోనే హోండాకు చెందిన అతిపెద్ద మోటార్‌సైకిల్ అసెంబ్లీ ప్లాంట్‌గా గుజరాత్ ప్లాంట్ అవతరించనుంది
ఢిల్లీ ఈవీ విధానంపై స్పందన
ఢిల్లీలో ఏప్రిల్ 1, 2028 నుండి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలే రిజిస్టర్ అవ్వాలనే నిబంధనపై ఒటానీ సానుకూలంగా స్పందించారు. కాలుష్య నివారణకు ఇది మంచి అడుగు అని ప్రశంసించారు. అయితే, ‘ఈవీల వైపు మార్పు వేగం’ అనేది అంతిమంగా వినియోగదారుల చేతుల్లోనే ఉంటుందన్నారు. చార్జింగ్ మౌలిక వసతులు, బడ్జెట్, సౌకర్యం, రోజువారీ అవసరాల ఆధారంగానే కస్టమర్లు వాహనాలను ఎంచుకుంటారని అభిప్రాయపడ్డారు. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తి వ్యూహాన్ని అమలు చేస్తూనే.. దేశ రవాణా రంగ పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తామన్నారు.


