సాగుబడి
శాస్త్రీయ నిర్వహణతో సాగు
రొయ్యల సాగు రంగం ప్రస్తుతం అధిక ఉత్పత్తి వ్యయం, వ్యాధులు, నాణ్యత లేని సీడ్, మేత ధరలు, విద్యుత్ ఛార్జీల వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. ఇటువంటి సంక్షోభ సమయంలో పంట విరామం (క్రాప్ హాలిడే) ప్రకటించడం శాశ్వత పరిష్కారం కాదు. దీనివల్ల మౌలిక సదుపాయాల నష్టం, కార్మికుల కొరత, మార్కెట్ నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి, శాస్త్రీయ నిర్వహణతో సాగు విధానాన్ని మార్చడమే నిజమైన పరిష్కారం.
ఉత్పత్తి కాదు లాభమే లక్ష్యం
అధిక స్టాకింగ్ సాంద్రత వ్యాధులు, ఒత్తిడి, మరణాల రేటును పెంచుతుంది. 90% సర్వైవల్‌తో మధ్యస్థ దిగుబడి సాధించిన రైతు, 65% సర్వైవల్‌తో అధిక దిగుబడి సాధించిన రైతు కంటే ఎక్కువ లాభం పొందగలడు. కాబట్టి ‘తక్కువ సాంద్రత – ఎక్కువ సర్వైవల్’ విధానమే ఉత్తమం.
నాణ్యమైన సీడ్ – నీటి నిర్వహణ
నాణ్యత లేని చౌక సీడ్ చివరికి భారీ నష్టాలకు కారణమవుతుంది. విశ్వసనీయ హేచరీల నుంచి జన్యుపరంగా నాణ్యమైన సీడ్‌ను ఎంపిక చేయాలి. అలాగే వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే, మూడు దశల నీటి రిజర్వాయర్ వ్యవస్థ ద్వారా ముందస్తు నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలి. రైతులకు నచ్చిన లాబ్‌లలో నాణ్యతా పరీక్షలు చేయించుకొని సీడ్ చెక్ చేసుకోవాలి.
ఖర్చుల నియంత్రణ
మేత సాగులో అత్యధిక వ్యయం. ఫీడ్ ట్రేల ద్వారా మేత వినియోగాన్ని నిరంతరం పరిశీలించి, సరైన ఫీడ్ కన్వర్షన్ రేషియో సాధించాలి. అధిక సామర్థ్యం గల ఎయిరేటర్ల వినియోగం, శాస్త్రీయ ఎయిరేటర్ల ప్రణాళిక ద్వారా విద్యుత్ ఖర్చులను గణనీయంగా తగ్గించవచ్చు. అవకాశమున్నచోట్ల సోలార్ విద్యుత్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
సాగు ప్రాంతాల ప్రత్యేకతలు
సముద్రపు ఉప్పు నీటితో సాగు చేసే ప్రాంతాల్లో సర్వైవల్ రేట్, షెల్ బలంగా ఉండి, ఖనిజాల ఖర్చు తక్కువగా ఉంటుంది. బోర్ నీరు లేదా మంచినీటి ప్రాంతాల్లో ఖనిజాల లోపం, అధిక ఎయిరేషన్ అవసరం వల్ల ఉత్పత్తి వ్యయం సుమారు 10–15% పెరుగుతుంది. సరైన ఖనిజ నిర్వహణ, నీటి నాణ్యత పర్యవేక్షణతో ఈ సమస్యలను అధిగమించవచ్చు.
భద్రత, క్రమశిక్షణ, వ్యూహం
పీతలు వంటి జీవులు రాకుండా చెరువు చుట్టూ కంచె (పీతలఫెన్సింగ్), బర్డ్ నెట్టింగ్, క్రిమిసంహారకాలతో పరికరాల శుద్ధి వంటి బయో సెక్యూరిటీ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. చెరువులను సత్వరం రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వల్ల, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పొందే అవకాశముంది. దైనందిన ఖర్చుల రికార్డులు నిర్వహించడం ద్వారా అనవసర రసాయనాల వినియోగాన్ని తగ్గించవచ్చు. మార్కెట్ ధరల హెచ్చు తగ్గులను ఎదుర్కోవడానికి పంట ప్రణాళిక ముందుగానే సిద్ధం చేసుకోవడం, రైతు సహకార సంఘాల ద్వారా విక్రయాలు నిర్వహించడం ప్రయోజనకరం.

సమూహ సాగు విధానం
ఒంటరిగా సాగు చేయడం కంటే, ఒకేప్రాంతంలోని రైతులంతా ఒక సమూహంగా (క్లస్టర్‌గా) ఏర్పడి సాగు చేయడం వల్ల పెట్టుబడి తగ్గి, లాభాలు పెరుగుతాయి. దీని వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు:
క్లస్టర్‌లోని రైతులంతా కలిసి నాణ్యమైన సీడ్, మేత, మినరల్స్‌ను పెద్ద మొత్తంలో ఒకేసారి ఆర్డర్ చేయడం ద్వారా కంపెనీల నుండి భారీ డిస్కౌంట్లు పొందవచ్చు.
నీటి శుద్ధి కోసం ఒకే పెద్ద రిజర్వాయర్ వ్యవస్థను, ఉమ్మడి ల్యాబ్ సౌకర్యాలను, పవర్ బ్యాకప్ కోసం పెద్ద జనరేటర్లను క్లస్టర్ తరఫున ఏర్పాటు చేసుకోవచ్చు.
క్లస్టర్‌లోని రైతులంతా ఒకే పద్ధతిలో, ఒకే సమయంలో చెరువులు ఎండబెట్టడం, సీడ్ స్టాకింగ్ చేయడం, పంటను తీయడం చేయాలి. దీని వల్ల ఒకరి చెరువు నుండి మరొకరి చెరువుకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం 80% వరకు తగ్గుతుంది.
వ్యాపారులతో లేదా ఎగుమతిదారులతో మాట్లాడేటప్పుడు ఒంటరి రైతుకంటే, ఒక సమూహంగా ఎక్కువ టన్నుల రొయ్యలను ఒకేసారి ఆఫర్ చేసినప్పుడు మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. దళారుల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది.
ప్రభుత్వం లేదా ఆక్వా సొసైటీలు (ఉదాహరణకు ఎన్‌ఏసీఎస్‌ఏ వంటి సంస్థలు) అందించే సబ్సిడీలు, ఉచిత విద్యుత్ రాయితీలు, శిక్షణా తరగతులు క్లస్టర్ లేదా కో–ఆపరేటివ్ రూపంలో ఉన్న రైతులకు చాలా సులభంగా అందుతాయి.
రైతులకు అదనపు సూచనలు
ప్రోబయోటిక్స్, ఎంజైమ్స్
చెరువు అడుగు భాగంలో పేరుకు΄ోయే వ్యర్థాలను తొలగించడానికి, హానికర బ్యాక్టీరియాను అరికట్టడానికి మంచి నాణ్యత గల ప్రోబయోటిక్స్‌ను క్రమం తప్పకుండా వాడాలి. ఇది రొయ్యల జీర్ణశక్తిని పెంచి, వాటిలో వ్యాధుల నిరోధకతను మెరుగుపరుస్తుంది.
క్రమం తప్పకుండా శాంప్లింగ్
వారానికి కనీసం ఒకసారి రొయ్యల బరువును, వాటి మొప్పల రంగును, ఆరోగ్యాన్ని పరీక్షించాలి. దీనివల్ల రొయ్యలు ఎంత మేత తింటున్నాయో అర్థమవుతుంది. తద్వారా మేత వృథాను అరికట్టి, ఎఫ్.సి.ఆర్‌ని అదుపులో ఉంచుకోవచ్చు.
విద్యుత్ బ్యాకప్
ఎయిరేటర్లు నిరంతరం పనిచేయడం రొయ్యల మనుగడకు అత్యంత ముఖ్యం. పవర్ కట్ అయినప్పుడు ఎయిరేటర్లు ఆగి΄ోతే, ఆక్సిజన్ తగ్గి రొయ్యలు చని΄ోయే ప్రమాదం ఉంది. కాబట్టి, ఖచ్చితంగా జనరేటర్ లేదా సోలార్ బ్యాకప్ వ్యవస్థను సిద్ధంగా ఉంచుకోవాలి.
వ్యర్థాల తొలగింపు
చెరువు అడుగు భాగంలో పేరుకు΄ోయిన వ్యర్థాలను చేయడం లేదా ఎప్పటికప్పుడు తొలగించడం చాలా ముఖ్యం. ఇది అమోనియా సమస్యను తగ్గించి, నీటినాణ్యతను కాపాడుతుంది.
రైతులతో నెట్‌వర్కింగ్
రొయ్యల సాగులో వస్తున్న కొత్త టెక్నాలజీలు, మందుల వాడకం, మార్కెట్ పరిస్థితులపై అవగాహన కోసం స్థానిక విజయవంతమైన రైతులు లేదా వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారాన్ని పంచుకోవడం వల్ల కష్టసమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
వాతావరణ మార్పులపై అప్రమత్తత
వర్షాకాలం లేదా వాతావరణం మారినప్పుడు నీటి ఉష్ణోగ్రత, పీహెచ్ స్థాయిలు అకస్మాత్తుగా మారవచ్చు. ఈ సమయంలో నీటి పారామీటర్లను రోజుకు రెండుసార్లు పరీక్షించి, అవసరమైన మినరల్స్ లేదా బఫర్స్‌ను అందించడం వల్ల రొయ్యలకు ఒత్తిడి కలగకుండా చూడవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా రైతులకు నష్టభయం తగ్గి, సాగులో స్థిరమైన దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.
రొయ్యల సాగు భవిష్యత్తు అధిక ఉత్పత్తిలో కాదు, అధిక సర్వైవల్‌తో స్థిరమైన లాభాల్లో ఉంది. నాణ్యమైన సీడ్, సమర్థవంతమైన నీటి నిర్వహణ, సమతుల్య స్టాకింక్ సాంద్రత, బయోసెక్యూరిటీ, ఖర్చు నియంత్రణ, శాస్త్రీయ నిర్వహణను అవలంబించినప్పుడే రైతులకు దీర్ఘకాలికంగా లాభదాయకమైన, స్థిరమైన రొయ్యల సాగు సాధ్యమవుతుంది. నిరాశ వద్దు.. నిలకడైన సాగే మన ముందడుగు!

- డా. పొన్నపల్లి రామమోహన్ రావు (98851 44557) డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ (రిటైర్డ్), కాకినాడ
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


