ఇంటి పంట-13
ఇంటిపంటలు, మిద్దె తోటల్లో కుండీలు, మడుల్లో క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, కంద, చేమదుంప వంటి దుంపలు పండించడానికి సరైన కాలం, సరైన సాగు పద్ధతులు ఏమిటో తెలుసుకుందాం. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి వంటి దుంప పంటలను ప్రధానంగా చలికాలంలో లేదా వర్షాకాలం అంటే సెప్టెంబర్ /అక్టోబర్ నుంచి జనవరి వరకు నాటుకోవడం ఉత్తమం.
ఈ కాలంలో ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండటం వల్ల దుంపలు బాగా ఊరతాయి. ముల్లంగిని ఆగస్టు నుంచి కూడా నాటుకోవచ్చు. కంద, చేమదుంప వేసవి, వర్షాకాలం పంటలు. వీటిని సాధారణంగా ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో నాటుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే దుంపలు తెచ్చి నాటుకోవచ్చు.
దుంప జాతి మొక్కలకు నత్రజని కంటే భాస్వరం, పొటాషియం ఎక్కువగా అవసరం. విత్తనాలు నాటేటప్పుడే మట్టిలో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ కల΄ాలి. మొక్కలు 4–6 అంగుళాల ఎత్తు పెరిగినప్పుడు (నాటిన 30–45 రోజుల తర్వాత) ఒకసారి ద్రవ ఎరువులు లేదా కొద్దిగా వర్మీ కంపోస్ట్ ఇవ్వాలి.
తాజా పశువుల ఎరువు వాడకూడదు. వాడితే క్యారెట్, ముల్లంగి దుంపలు రెండుగా చీలిపోయే అవకాశం ఉంది. దుంపలు భూమిలో సులభంగా పెరగడానికి మట్టి చాలా గుల్లగా, మెత్తగా ఉండాలి.
1 వంతు ఇసుకతో ఉన్న ఎర్రమట్టి లేదా తోట మట్టి (మామూలు ఎర్ర మట్టి అయితే కొద్దిగా ఇసుక కల΄ాలి), 1 వంతు కోకోపీట్ /వరి పొట్టు (మట్టి గుల్లగా ఉండటానికి), 1 వంతు వర్మీ కంపోస్ట్ లేదా బాగా చివికిన పశువుల ఎరువు కొద్దిగా వేప పిండి (మట్టిలో పురుగులు చేరకుండా ఉండటానికి)తో కలిపి మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలి.
ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తీసేయాలి..
క్యారెట్ – బీట్రూట్ నాటుకోవటం కోసం కనీసం 12–14 అంగుళాల లోతు, 12 అంగుళాల వెడల్పు ఉన్న కుండీలు లేదా గ్రో బ్యాగ్స్ వాడాలి. ముల్లంగి నాటుకోవటానికి 8–10 అంగుళాల లోతు సరిపోతుంది.
కంద – చేమదుంప నాటుకోవటానికి పెద్ద కుండీలు అవసరం. కనీసం 15–20 లీటర్ల సామర్థ్యం ఉన్న కుండీ లేదా పెద్ద టబ్బులు వాడితే దుంపలు పెద్దగా పెరుగుతాయి.
మట్టిలో రాళ్లు, గడ్డలు లేకుండా చూసుకోవాలి, లేదంటే దుంపల ఆకారం దెబ్బతింటుంది. బీట్రూట్, క్యారెట్ విత్తనాల మధ్య కనీసం 2–3 అంగుళాల దూరం ఉండాలి.
కంద/చేమదుంప నాటేటప్పుడు దుంప మొలక పైకి ఉండేలా చూసి, 2–3 అంగుళాల లోతులో నాటాలి. ఈ మొక్కలకు రోజుకు కనీసం 6 గంటల ఎండ అవసరం.
కుండీ అడుగున రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేకపోతే నీరు నిల్వ ఉంటే దుంపలు కుళ్ళిపోతాయి.
ముల్లంగి అన్నిటికంటే వేగంగా వస్తుంది. విత్తనాలు నాటిన 25 నుంచి 45 రోజులలోపు తీసి వాడుకోవచ్చు. బీట్రూట్ విత్తనాలు నాటిన 50 నుంచి 80 రోజుల్లో తీసుకొని వాడుకోవచ్చు.. కొన్ని రకాలు 3 నెలల వరకు సమయం తీసుకోవచ్చు. క్యారెట్ కొంచెం నిదానంగా పెరుగుతుంది. సాధారణంగా విత్తనాలు నాటిన తరువాత 60 నుంచి 100 రోజులు పడుతుంది. కొన్ని రకాలకు 120 రోజుల వరకు సమయం పట్టవచ్చు. క్యారెట్, ముల్లంగి, బీట్రూట్ దుంపలు పెరిగినప్పుడు వాటి పైభాగం మట్టి పైన కొద్దిగా కనిపిస్తాయి. చేమదుంపలు నాటిన 150 నుంచి 180 రోజులకు (అంటే 5 నుంచి 6 నెలలు) తవ్వి తీసుకోవచ్చు.
కంద.. ఇది అన్నిటికంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. నాటిన తరువాత సాధారణంగా 210 నుంచి 240 రోజులు (7 నుంచి 8 నెలలు) పడుతుంది. కంద, చేమదుంప మొక్క ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోవటం జరిగిన తరువాత తీసుకొని వాడుకోవాలి. ముల్లంగి విత్తనాలను ఆగస్టు మొదటి వారంలో నాటుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ విత్తనాలను సెప్టెంబర్ /అక్టోబర్‌లో నాటుకోవచ్చు.
- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్


