దెయ్యం మొక్క... తిస్మియా డెమోనా | Scientists discover bizarre devil flower hidden in Thailand | Sakshi
Sakshi News home page

శాస్త్రవేత్తల కంట్లో కొత్తరకం ‘వెలుగు’

Sep 17 2026 6:28 PM | Updated on Sep 17 2026 6:37 PM

Scientists discover bizarre devil flower hidden in Thailand

సూర్యరశ్మి, ఆకుపచ్చని ఆకులు, క్లోరోఫిల్‌... సాధారణంగా ఏ మొక్క జీవించాలన్నా ఇవి అత్యంత ముఖ్యం. కానీ, ప్రకృతి నిబంధనలను తుడిచిపెడుతూ థాయిలాండ్‌ అడవుల్లోని ఒక వింతైన, అరుదైన ‘పువ్వు మొక్క’ దానికై అది ఎదుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. పశ్చిమ థాయిలాండ్‌లోని కంచనబురి ప్రావిన్స్‌లో ఉన్న ‘థాంగ్‌ ఫా ఫుమ్‌ నేషనల్‌ పార్క్‌’లో పరిశోధకులు ఈ విచిత్రమైన మొక్కను కనుగొన్నారు. దీనికి వారు ‘తిస్మియా డెమోనా’ (Thismia daemona) అని పేరు పెట్టారు. అంటే దెయ్యం మొక్క! ఆకులు, ఆకుపచ్చటి రంగు, క్లోరోఫిల్‌ ఏవీ లేని ఈ మొక్క, ప్రకృతిలో జీవనం సాగించడానికి సూర్యరశ్మి ఒక్కటే మార్గం కాదని నిరూపిస్తోంది.

‘పీడకల జీవి’లా పోలికలు! 
తిస్మియా డెమోనా పువ్వు రూపురేఖలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం, భయం కలగక మానవు. ముదురు రంగులో, పైన కొమ్ముల వంటి నిర్మాణాలు, అడుగున ఎరుపు–ఆరెంజ్‌ రంగుల కాంబినేషన్‌తో ఇది చూడటానికి ఒక చిన్న పీడకల జీవిలా కనిపిస్తుంది. అందుకే శాస్త్రవేత్తలు దీనికి దెయ్యం పోలికలతో ‘డెమోనా’అని నామకరణం చేశారు. 2026 ఆగస్టులో ప్రముఖ అంతర్జాతీయ సైన్స్‌ జర్నల్‌ ‘ఫైటోకీస్‌’లో దీనికి సంబంధించిన అధికారిక పరిశోధనా పత్రం ప్రచురితమైంది.

పర్వత అడవుల్లో వింత ఆవాసం 
చులాంగ్‌కార్న్‌ యూనివర్సిటీ, ప్రిన్స్‌ ఆఫ్‌ సోంగ్‌క్లా యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన వృక్షశాస్త్ర సర్వేల్లో ఈ డెవిల్‌ ఫ్లవర్‌ వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తిస్మియా జాతులు తేమగా ఉండే ఉష్ణమండల అడవుల్లో పెరుగుతాయి. కానీ ఈ డెమోనా మాత్రం సముద్ర మట్టానికి 950 నుంచి 970 మీటర్ల ఎత్తులో, చిన్న వెదురు చెట్లు ఉండే పర్వత ప్రాంతపు సతత హరిత అరణ్యంలో కనిపించి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది.

ప్రస్తుతం ఈ జాతికి చెందిన 50 కంటే తక్కువ మొక్కలను మాత్రమే పరిశోధకులు గుర్తించారు. అందువల్ల ఇది అత్యంత ప్రమాదంలో ఉన్న అరుదైన జాతిగా పరిగణనలోకి వచ్చింది. మొక్కలు జీవించడానికి కేవలం ఆకులు, ఎండ మాత్రమే కాకుండా అడవి నేలల అంతర్లీన వ్యవస్థ కూడా ఎంత ముఖ్యమో ఈ ‘చిన్ని దెయ్యం పువ్వు’ మొక్క శాస్త్ర ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది.

సూర్యరశ్మి లేకుండా ఎలా? 
మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కిరణజన్య సంయోగక్రియపై ఆధారపడతాయన్న సంగతి తెలిసిందే. కానీ ‘తిస్మియా డెమోనా’ఆ ప్రకృతి నియమాన్ని పక్కన పెట్టేసింది! ఎలాగంటే, ఈ మొక్క తన జీవితంలో ఎక్కువ భాగం నేల అడుగున లేదా రాలిపడిన ఆకుల వ్యర్థాల కిందే గడుపుతుంది. ఆహారం కోసం ఇది పూర్తిగా నేలలో ఉండే శిలీంధ్రాలపై ఆధారపడుతుంది. ఈ ప్రత్యేక ప్రక్రియ ద్వారా శిలీంధ్రాల నుంచి సేంద్రియ పోషకాలను గ్రహించి జీవిస్తుంది. పూలు పూసే అతి స్వల్ప సమయంలో మాత్రమే ఈ మొక్క నేల పైకి కనిపిస్తుంది. అందుకే ఈ అరుదైన జాతి ఇంతవరకు పరిశోధకలు కంట్లో పడలేదు. 
-సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement