గర్భిణికి బ్రెయిన్ స్ట్రోక్.. కాపాడిన వైద్యులు! | Rare Brain Stroke at 9 Months: How Doctors Saved Mom and Newborn | Sakshi
Sakshi News home page

గర్భిణికి బ్రెయిన్ స్ట్రోక్.. కాపాడిన వైద్యులు!

Sep 17 2026 4:12 PM | Updated on Sep 17 2026 4:29 PM

Rare Brain Stroke at 9 Months: How Doctors Saved Mom and Newborn

విశాఖ: గర్భం దాల్చిన చివరి దశలో ఓ మహిళకు ఊహించని విధంగా ప్రాణాపాయ స్థాయి బ్రెయిన్ స్ట్రోక్ (మెదడు రక్తనాళాల నిరోధం) వచ్చింది. కుడి వైపు పాక్షిక పక్షవాతం రావడం, మాట పూర్తిగా కోల్పోవడంతో ఆమెను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్లిష్టమైన పరిస్థితిలో వైద్య నిపుణులు అత్యంత సాహసోపేతంగా ‘మెకానికల్‌ థ్రాంబెక్టమీ’ అనే అత్యాధునిక శస్త్రచికిత్స నిర్వహించి, తల్లీబిడ్డ ఇద్దరి ప్రాణాలను కాపాడారు.

విశాఖ ప్రాంతానికి చెందిన ఓ తొమ్మిది నెలల గర్భిణికి అకస్మాత్తుగా తీవ్రమైన బ్రెయిన్ స్ట్రోక్ తలెత్తింది. ఆమెకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో మెదడులోని ఎడమ ప్రధాన రక్తనాళాల్లో తీవ్రమైన అడ్డంకులు ఏర్పడినట్లు (ఇస్కీమిక్‌ స్ట్రోక్‌) గుర్తించారు. రోగి గర్భం దాల్చి తొమ్మిది నెలలు కావడంతో, చికిత్స అందించడం వైద్య బృందానికి కత్తి మీద సాములా మారింది. ఒకవైపు తల్లి మెదడుకు రక్తప్రసరణను పునరుద్ధరించాలి, మరోవైపు గర్భస్థ శిశువు ఆరోగ్యం దెబ్బతినకుండా పర్యవేక్షించాలి. మందుల ఎంపిక, మోతాదు సర్దుబాటు, రక్తం గడ్డకట్టకుండా ఇచ్చే చికిత్స, రక్తపోటు నియంత్రణ వంటి ప్రతి అంశంలోనూ వైద్యులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి వచ్చింది.

కిమ్స్‌ ఆసుపత్రి న్యూరో అండ్‌ వాస్క్యులర్‌ ఇంటర్వెన్షన్‌ విభాగం చీఫ్‌ కన్సల్టెంట్‌ డా.వెంకటేష్‌ పోతుల నేతృత్వంలోని వైద్య బృందం వెంటనే రంగంలోకి దిగింది. గర్భస్థ శిశువుపై రేడియేషన్ ప్రభావం పడకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ మెకానికల్‌ థ్రాంబెక్టమీ నిర్వహించారు. మెదడు రక్తనాళంలో అడ్డుపడిన రక్తం గడ్డను విజయవంతంగా తొలగించి, పూర్తిస్థాయి రక్తప్రసరణను పునరుద్ధరించారు. ఇక ప్రసూతి వైద్య బృందం నేతృత్వంలో తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించారు. నాడీ సంబంధిత పరిస్థితి స్థిరపడిన తర్వాత, వైద్యులు సిజేరియన్‌ నిర్వహించగా.. ఆరోగ్యకరమైన మగ శిశువు జన్మించాడు.

వైద్యులు ఏమన్నారంటే? 
గర్భధారణ సమయంలో పెద్ద రక్తనాళాల ఇస్కీమిక్‌ స్ట్రోక్ అరుదైనది. ప్రాణాపాయకరమైనదని డా. వేంకటేష్‌ పోతుల తెలిపారు. ఈ సందర్భంలో వీలైనంత త్వరగా మెదడుకు రక్తప్రసరణ పునరుద్ధరించడం ఎంత ముఖ్యమో, శిశువు భద్రతను కాపాడటం కూడా అంతే ముఖ్యమన్నారు. న్యూరాలజీ, అనస్థీషియా, ప్రసూతి విభాగాల సమన్వయంతో ఈ అత్యవసర పరిస్థితిని విజయవంతంగా ఎదుర్కొన్నట్లు వైద్యులు తెలిపారు. గర్భధారణ సమయంలో స్ట్రోక్ లక్షణాలు (ముఖం వంకరపోవడం, చేయి లేదా కాలు బలహీనపడటం, మాట తడబడటం) కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించాలని వైద్యులు సూచించారు. గర్భధారణ ఉన్నంత మాత్రాన అత్యవసర మెకానికల్‌ థ్రాంబెక్టమీకి అనర్హులని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement