గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే భారతీయ కార్మికులు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఏజెంట్ల మోసాలకు బలై అక్కడ సరైన జీతాలు లేకుండా ఆ దేశస్థుల చేతిలో బందింపబడి చిత్రహింసలకు గురవుతుంటారు. తాజాగా అటువంటి ఘటన మరోసారి చోటు చేసుకుంది. తమిళనాడుకు చెందిన ఓ మహిళ తాను అన్యాయంగా కువైట్‌లో చిక్కుకున్నానని మూడు నెలలుగా తనకు జీతం ఇవ్వకుండా తీవ్రంగా వేదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే..కువైట్ దేశంలో ఒక ఇంటిలో పనిచేస్తున్న వనిత అనే మహిళ తనను అక్కడ తీవ్రంగా హింసిస్తున్నారని, రెండు నెలలుగా జీతం చెల్లించలేదని ఆవేదనతో వీడియో చేశారు. ఆమె మాటల్లో "నా పేరు వనిత, నేను కల్లకురిచి జిల్లాకు చెందిన దానిని. నేను అక్కడి నుండి వచ్చి మూడు నెలలు అయ్యింది. ఇక్కడ నన్ను హింసిస్తున్నారు. నన్ను రక్షించి నా మాతృభూమి అయిన భారతదేశానికి తీసుక వెళ్లాలని కలెక్టర్‌కు, జిల్లా పోలీసు అధికారికి విజ్ఞప్తి చేస్తున్నాను. గత రెండు నెలలుగా నా జీతం చెల్లించలేదు. నేను ఇక్కడి హింసను భరించలేను" అని ఆమె వీడియోలో అన్నారు.
అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలై తమిళనాడు అధికారులకు చేరింది, దీంతో వారు దీనిపై ఆరా తీయగా వనిత కల్లకురిచికి చెందినదని తెలిసింది, ఈ విషయం వారి కుటుంబసభ్యులకు తెలియజేడంతో వారు ఆమెను రక్షించి భారతదేశానికి తిరిగి తీసుకురావాలని కోరినట్లు అధికారులు తెలిపారు.
అయితే ఈ విషయమై స్పందించిన వనిత తల్లి , ఒక ఏజెంట్ కువైట్‌లో తన కుమార్తెకు ఉద్యోగం ఇప్పించి మోసం చేశాడని ఆరోపించారు. తనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్న వనిత, ఇంటి పనిమనిషిగా పనిచేయాలనే ఆశతో కువైట్ వెళ్లిందని కానీ ఇప్పుడు ఆమె చిత్రహింసలను ఎదుర్కొంటోందని ఆమె అన్నారు.
" ఏజెంట్ ఆమెను మోసం చేశాడు. ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. వాళ్ళు ఆమెను ఇంటి పని కోసం తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు. కలెక్టర్ గారూ, దయచేసి నా కూతురిని ప్రాణాలతో ఇంటికి తీసుకురండి. చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాను," అని ఆమె తల్లి ఆవేదనతో చెప్పింది.
అయితే దీనిపై స్పందించిన పోలీసులు వనితను తిరిగి భారత్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అయితే ఆ వీడియోలో బాధితురాలు చీకటి గదిలో ప్రాధేయపడుతూ రెండు చేతులు జోడించి వేడుకోవడం అందరిని అందరినీ తీవ్రంగా కలిచివేసింది.


