వరలక్ష్మీ వ్రత పూజలకు పిఠాపురం పాదగయ క్షేత్రానికి వచ్చిన మహిళలపై పోలీసుల దురుసు ప్రవర్తన
వ్రతాల టోకెన్ల కోసం క్యూలో ఉన్న స్త్రీలపై దౌర్జన్యం
వెళ్లకపోతే ఇళ్ల నుంచి లాక్కొచ్చి కేసులు పెడతామంటూ బెదిరింపులు
చీరలు ఇస్తామని ప్రకటించి, అన్నీ వారే తీసేసుకున్న జనసేన నేతలు
అమ్మవారి సన్నిధిలో వ్రతం కోసం వస్తే అవమానించారని మహిళలు కన్నీరు
పిఠాపురం: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో వరలక్ష్మీ వ్రత పూజల టోకెన్ల కోసం వచ్చిన మహిళలకు తీరని అవమానం జరిగింది. టోకెన్లు ఇవ్వకపోగా, వారిని క్యూలో నుంచి బయటకు లాగేసి, అక్కడి నుంచి వెళ్లకపోతే ఇళ్ల నుంచి లాక్కొచ్చి కేసులు పెడతామంటూ పోలీసులు బెదిరించడం, చీరల కోసం వచ్చారంటూ జనసేన నేతలు అవహేళన చేయడంతో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. చీరలు ఎవరడిగారు..? పాదగయ క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు టోకెన్ల కోసం వస్తే ఇలా అవమానిస్తారా అంటూ మండిపడ్డారు. ఇదేనా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహిళలకు ఇచ్చే గౌరవం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడ్డారు.
ప్రతి ఏటా పిఠాపురం పాదగయ క్షేత్రంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తారు. పిఠాపురంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా మహిళలు వచ్చి ఇక్కడ వ్రతాలు చేసుకుంటారు. అయితే ఈసారి వ్రతాలతో పాటు మహిళలకు ఇవ్వడానికి వేల చీరలు సిద్ధం చేశామంటూ జనసేన నేతలు ప్రచారం చేశారు. ఎప్పటిలానే మహిళలు వ్రతాల టోకెన్ల కోసం గురువారం తెల్లవారుజాము నుంచే క్యూలో నిలబడ్డారు. అయితే, చీరల కోసం టోకెన్లన్నీ జనసేన నేతలే తీసుకెళ్లిపోవడంతో వ్రతాలకు వచ్చిన మహిళలకు ఒక్కరికి కూడా టోకెన్ అందలేదు.
మధ్యాహ్నం వరకు వేచి చూసిన మహిళలు ఆలయ అధికారులను నిలదీయగా.. టోకెన్లు లేవు పొండంటూ కసురుకున్నారు. ఆ వెంటనే పోలీసులు వచ్చి మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించారు. మహిళా పోలీసులు కాకుండా పురుష పోలీసులే స్త్రీలను క్యూలో నుంచి బయటకు లాగేయడంతో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మర్యాదగా వెళ్లిపోకపోతే ఫొటోలు తీసి.. ఇళ్లకు వచ్చి మరీ తీసుకెళ్లి జైలులో పెడతాం..’ అంటూ పోలీసులు బెదిరించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మేమేమన్నా దొంగలమా.. జైలులో పెట్టడానికి? ఇదేనా పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మహిళలకు ఇచ్చే గౌరవం?’ అంటూ మహిళలు మండిపడ్డారు.
అవహేళన చేసిన జనసేన నేతలు
ఇంతలో కొందరు జనసేన నేతలు వచ్చి.. వారంతా చీరల కోసం వచ్చారంటూ అవహేళనగా మాట్లాడటంతో మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. పుణ్య క్షేత్రంలో అమ్మవారి సన్నిధిలో వ్రతం చేసుకుందామని వచ్చామని, చీరల కోసం కాదంటూ కన్నీరు పెట్టుకున్నారు. చీరలు వద్దు.. వ్రతానికి టోకెన్లు ఇవ్వాలని ఆలయ అధికారులను కోరారు. ఈసారి అంతా జనసేన నేతలే నిర్వహిస్తున్నారని, తమకు ఎటువంటి సంబంధం లేదని ఆలయ అధికారులు చెప్పడంతో మహిళలు మండిపడ్డారు. మీకు సంబంధం లేకపోతే గుడిలో ఎలా వ్రతాలు నిర్వహిస్తారంటూ వారిని నిలదీశారు. అయినా అధికారులు స్పందించకపోవడంపై భక్తులు మండిపడ్డారు.


