కౌంటర్ దాఖలు చేయండి
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సీజేను ఎంపిక కమిటీ నుంచి తీసేస్తూ చట్ట సవరణ చేసిన బాబు సర్కార్
ఈ చట్ట సవరణను సవాలు చేస్తూ గతంలోనే హైకోర్టులో పిల్
తాజాగా జస్టిస్ మల్లికార్జునరావు నియామకాన్ని సవాలు చేస్తూ మరో పిల్
ఈ రెండింటినీ జత చేయాలని రిజిస్ట్రీకి ధర్మాసనం నిర్దేశాలు
సాక్షి, అమరావతి: లోకాయుక్త నియామకానికి సంబంధించిన దాఖలైన రెండు వ్యాజ్యాలపై గురువారం హైకోర్టు స్పందించింది. వేర్వేరుగా దాఖలైన ఈ రెండు వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అలాగే, చట్ట సవరణను సవాలు చేస్తూ ఇప్పటికే దాఖలైన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన అనంతరం లోకాయుక్త నియామకానికి సంబంధించి దాఖలైన మరో పిల్‌లో జస్టిస్ మల్లికార్జునరావుకు, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
రెండు వ్యాజ్యాలు ఇవీ..
» లోకాయుక్త నియామక ప్రక్రియ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2024లో చేసిన చట్ట సవరణ చేసింది. దీనిని సవాలు చేస్తూ గతంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
» రాష్ట్ర లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుకి పూర్తిస్థాయి బెయిల్ మంజూరు చేసిన జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావును నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో తాజాగా మరో పిల్ దాఖలైంది. లోకాయుక్తగా ఆయన నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ రైల్వేశాఖ విశ్రాంత ఉద్యోగి ఏము కొండలరావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
» పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ, ‘లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జునరావు నియామకం విషయంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, లోకాయుక్త మల్లికార్జునరావుకు నోటీసులు జారీ చేయాలి’ అని కోరారు. అయితే ఈ దశలో నోటీసులు ఇవ్వలేమని, చట్ట సవరణపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తరువాత నోటీసుల అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టంచేసిన ధర్మాసనం, రెండు వ్యాజ్యాలను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.


