సాక్షి,కాకినాడ: తాళ్ళరేవు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మట్లపాలెం గ్రామం వద్ద వేగంగా వస్తున్న ఆటో, బైక్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సమాచారం మేరకు.. కృష్ణ, మణికంఠ, తమ్మి అనే ముగ్గురు యువకులు ఒకే బైక్‌పై కాకినాడ నుండి యానం వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాళ్ళరేవు మండలం మట్లపాలెం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆటో వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు తీవ్ర గాయాలపాలైన కృష్ణ, మణికంఠ ఇద్దరూ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్ర గాయాలతో ఉన్న మరో యువకుడు తంబిని స్థానికులు తక్షణమే కాకినాడ జిజిహెచ్ జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో అతను కన్నుమూశాడు.
ఒకే ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


