1960ల వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్య, పరిశోధనలకు ప్రధానంగా మూడు విశ్వవిద్యాలయాలే ఉండేవి. హైదరాబా ద్‌లో ఉస్మానియా, విశాఖపట్నంలో ఆంధ్ర, తిరుపతిలో శ్రీవేంక టేశ్వర. దీంతో గుంటూరు, కృష్ణా జిల్లాల విద్యార్థులు స్నాతకోత్తర విద్య కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇది వారికి అదనపు ఆర్థిక భారాన్ని, ప్రయాసను కలిగించేది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, 1956 డిసెంబరులో జరిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సమావేశంలో కళాప్రపూర్ణ వావిలాల గోపాలకృష్ణయ్య గుంటూరులో స్నాతకోత్తర కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
అయితే, ఆ ప్రతిపాదన వెంటనే కార్యరూపం దాల్చలేదు. తరువాత డా‘‘ సర్వేపల్లి రాధాకృష్ణన్ కుమారుడు ఆచార్య ఎస్.గోపాల్ నేతృత్వంలోని కమిటీ సూచనలతో గుంటూరులో పోస్ట్ గ్రాడ్యుయేట్ సెంటర్ ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది. 1967లో ఆచార్య ఎస్.మీనాక్షి సుందరం ప్రత్యేకాధికారిగా నియమి తులై గుంటూరుకు వచ్చారు. తొలుత గుంటూరు మెడికల్ కళాశా లలో కార్యాలయ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నల్లపాడు లోని ఎం.బి.టి.ఎస్. పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోని ప్రత్యేక భవనంలో స్నాతకోత్తర కేంద్రం ప్రారంభమైంది. ఒకేసారి తొమ్మిది స్నాతకోత్తర కోర్సులతో ప్రారంభమైన ఈ కేంద్రం గుంటూరు ప్రాంతంలో ఉన్నత విద్యకు కొత్త దిశను చూపింది.
గుంటూరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీ కేంద్రం ప్రారంభ మైన తరువాత ఉన్నత విద్యా విస్తరణకు కొత్త దశ మొదలైంది. విజయవాడ, గుంటూరు, తెనాలి ప్రాంతాల విద్యార్థులకు అందు బాటులో ఉండేలా కాజ–నంబూరు ప్రాంతంలో సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో శాశ్వత ప్రాంగణాన్ని అభివృద్ధి చేశారు. భవ నాలు, రహదారులు, ఇతర మౌలిక వసతులతో పాటు పెద్దఎత్తున మొక్కలు నాటడం వల్ల ఆ ప్రాంగణం పచ్చదనంతో అలరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచార్య శాంతప్ప కమిటీ సిఫార్సులను ఆమోదించి, 1976లో 16వ శాసనం ద్వారా పీజీ కేంద్రానికి స్వయంప్రతిపత్తి కల్పించింది. అనంతరం నల్లపాడులో కొనసాగుతున్న పీజీ కేంద్రాన్ని నంబూరులో నిర్మించిన శాశ్వత భవనాల్లోకి తరలించారు. ఈ పరిణామానికి కొనసాగింపుగా 1976 ఆగస్టులో 43వ శాసనం ద్వారా నాగార్జున విశ్వవిద్యాలయం ఏర్పడింది. పీజీ కేంద్రం డైరెక్టర్ ఆచార్య ఉప్పలపాటి బాలయ్యనే తొలి ఉపకులపతిగా నియమించ డంతో పూర్తిస్థాయి పరిపాలనా వ్యవస్థ ఏర్పడింది.
1976 సెప్టెంబరు 11న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చేతుల మీదుగా నాగార్జున విశ్వవిద్యాలయం లాంఛనంగా ప్రారంభమైంది. మహాబౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరును సార్థకం చేస్తూ, ప్రాచీన భారతీయ జ్ఞాన సంపదను ఆధునిక శాస్త్రీయ ఆలో చనలతో మేళవించే విద్యాకేంద్రంగా ఇది ఎదగాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. ‘సత్యే సర్వం ప్రతిష్ఠితమ్’ అనే నినాదం విశ్వవిద్యాలయ లక్ష్యాన్ని ప్రతిబింబించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్డినెన్స్ నం.1/2004 ద్వారా 2004 జనవరి 24 నుంచి ‘నాగార్జున విశ్వవిద్యాలయం’ పేరు ‘ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం’గా మారింది.
విశ్వవిద్యాలయ ప్రగతిలో దూర విద్యా కేంద్రం ఒక ముఖ్య మైన మైలురాయి. ఒక దశలో సుమారు 2.5 లక్షల మంది విద్యార్థు లకు 144 కోర్సుల ద్వారా విద్యను అందించింది. ఈ కేంద్రం విద్యను అందరికీ చేరువ చేయడంతో పాటు విశ్వవిద్యాలయానికి ఆర్థిక పరిపుష్టిని అందించింది. విశ్వవిద్యాలయం విద్య, పరిశోధ నతో పాటు క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ తన ప్రతిభను చాటు కుంటోంది. 2024 టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ యంగ్ యూనివ ర్సిటీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 401–500 శ్రేణిలో, జాతీయ స్థాయిలో 26వ, రాష్ట్ర స్థాయిలో రెండో స్థానంలో నిలిచింది. పరిశో ధనకు సంబంధించిన కోర్సులతో పాటు ప్రత్యేక కేంద్రాలు, చైర్లు కూడా విశ్వవిద్యాలయ విద్యా వైవిధ్యాన్ని పెంచుతున్నాయి.
– వాసా మాణిక్యాలరావు, పూర్వ జాయింట్ రిజిస్ట్రార్ (ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా)


