న్యూఢిల్లీ: నిషేధిత జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్‌ఎఫ్) చీఫ్ యాసిన్ మాలిక్ తన పాకిస్థానీ భార్య ముషాల్ హుస్సేన్ మాలిక్‌కు విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్న మాలిక్.. తాము చాలా కాలంగా దూరంగా ఉంటున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, జమ్ము కోర్టుకు ఒక అఫిడవిట్‌ను పంపించారు. తన భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి ఆమెపై ప్రభావం చూపకుండా, గౌరవప్రదంగా జీవించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అందులో పేర్కొన్నారు.
గత ఎనిమిదేళ్లుగా తాను ముషాల్‌తో మాట్లాడలేదని, ఫోన్ కాల్స్ లేదా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సంప్రదించడానికి అనుమతి లభించలేదని మాలిక్ తెలిపారు. ‘నా పరిస్థితులను చూస్తూ, లేదా వితంతువులా ముషాల్ తన మిగిలిన జీవితాన్ని గడపడం నాకు ఇష్టం లేదు. ఆమె నాకంటే 20 ఏళ్లు చిన్నది. అందుకే ఆమె ధైర్యం తెచ్చుకుని ఆశతో, గౌరవంతో జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని కోరుతున్నాను. నన్ను ఉరితీయకముందే మా వివాహ బంధం నుంచి ఆమెను విముక్తురాలిని చేయాలని నిర్ణయించుకున్నాను’ అని అఫిడవిట్‌లో వివరించారు.
తన తల్లి, భార్య, 13 ఏళ్ల కుమార్తెను ఉద్దేశించి ఆయన ఈ సందేశం ఇచ్చారు. ఇది సానుభూతి కోసం కాదని, తన అంతరాత్మ ప్రబోధానుసారమే రాస్తున్నానని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాద నిధుల (టెర్రర్ ఫండింగ్) కేసుకు సంబంధించి యాసిన్ మాలిక్ 2019 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. ఈ కేసులో ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చి, మే 2022లో జీవిత ఖైదు విధించింది. ఈ పరిణామాలకు కొన్ని వారాల ముందు, దర్యాప్తు సంస్థలు ఆయనకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి.
ఇది కూడా చదవండి: ‘కోహినూర్’ ప్రమోటర్లపై ఈడీ దాడులు


