నెల్లూరు జిల్లా: మూడేళ్ల పాప.. కడుపులో మరో బిడ్డ.. అయినా మెట్టింటి గడప దాటనివ్వని పరిస్థితి. భర్త, అత్తమామలు తనను విడాకులు ఇవ్వాలని వేధిస్తున్నారంటూ ఐదో నెల గర్భిణి అత్తింటి ఎదుట బైఠాయించింది. తరచూ వేధించి పుట్టింటికి పంపిస్తున్నారని ఆరోపించింది. భర్త మరో వివాహం చేసుకునేందుకే తనను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ ఘటన మండలంలోని కొడవలూరు రైల్వేగేట్ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. కొడవలూరు రైల్వే గేట్ కాలనీకి చెందిన చిత్తూరు జయకుమార్ వరికోత యంత్రం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. వరి కోతల సీజన్‌లో వృత్తిరీత్యా వివిధ జిల్లాలకు వెళుతుంటారు. మూడేళ్ల క్రితం ఒంగోలు వెళ్లిన సమయంలో అక్కడి పూజల చెంగమ్మతో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారడంతో పెద్దల సమక్షంలో 2023 ఆగస్టు 30న కొడవలూరు విష్ణు ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరికి మూడేళ్ల పాప ఉంది. ప్రస్తుతం చెంగమ్మ ఐదో నెల గర్భిణి.
విడాకులివ్వాలంటూ వేధిస్తున్నారు
గత ఐదు నెలలుగా భర్త తనను వేధిస్తున్నారని, విడాకులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ తరచూ పుట్టింటికి పంపిస్తున్నారని చెంగమ్మ ఆరోపించారు. వృత్తిరీత్యా మచిలీపట్నం వెళ్లిన జయకుమార్‌కు మరో యువతితో పరిచయం ఏర్పడిందని, ఆమెను వివాహం చేసుకునేందుకే తనకు విడాకులు ఇవ్వాలని చూస్తున్నారని వాపోయారు. భర్తకు అత్తమామలు కూడా మద్దతుగా నిలిచి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సోమవారం తన తల్లి, పిన్నమ్మతో కలిసి మూడేళ్ల కుమార్తెను వెంట బెట్టుకుని జయకుమార్ ఇంటి ఎదుట బైఠాయించారు. తనకు న్యాయం చేయాలని కోరారు.
గతంలోనూ పోలీసులకు ఫిర్యాదు
భర్త వేధింపులపై గతంలో ఒంగోలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెంగమ్మ తెలిపారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారని చెప్పారు. అనంతరం కొద్దిరోజులు సజావుగా ఉన్నప్పటికీ మళ్లీ వేధింపులు మొదలయ్యాయని వాపోయారు.
పోలీసుల రంగప్రవేశం
చెంగమ్మ అత్తింటి ఎదుట బైఠాయించిన విషయం తెలియడంతో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. స్థానిక సీఐ, ఎస్సైలు విధుల్లో భాగంగా బయటకు వెళ్లడంతో అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలు, అత్తింటి వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. జయకుమార్ వరి కోతల నిమిత్తం నాయుడుపేట వెళ్లి ఉండటంతో ఆయన్ను కూడా కొడవలూరు పోలీస్‌స్టేషన్‌కు రావా లని సమాచారం ఇచ్చారు. ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను పరిష్కరించి, దంపతులు కలిసి ఉండేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


