లోకేష్‌ వ్యాఖ్యలు.. జనసేన ఆత్మగౌరవానికే పరీక్ష? | Kommineni Srinivasa Rao Comments on Pawan Kalyan Local Body Elections | Sakshi
Sakshi News home page

లోకేష్‌ వ్యాఖ్యలు.. జనసేన ఆత్మగౌరవానికే పరీక్ష?

Sep 1 2026 11:29 AM | Updated on Sep 1 2026 12:09 PM

Kommineni Srinivasa Rao Comments on Pawan Kalyan Local Body Elections

స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు  చికాకుగా మారేలా ఉంది. జనసేన క్యాడర్ లో చాలామంది ఈ స్థానిక పదవులపై ఆశలుపెంచుకోవడమే దీనికి కారణం. పవన్ కళ్యాణ్ డిప్యూటి సీఎం పదవిలోకి  వచ్చినప్పటి నుంచి పార్టీ సంగతి ఎలా ఉన్నా,తన వరకు పవర్‌ను బాగానే ఎంజాయ్ చేస్తున్నారన్నది పలువురి భావనగా ఉంది. ఆయన తరచుగా  మంత్రివర్గ సమావేశాలకు వెళ్లకపోయినా అడిగేవారు లేరు. కీలకమైన అంశాలలో పార్టీ పక్షాన  ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించకపోయినా లోలోపల మదనపడేవారే తప్ప ఆయనను అడిగే  ధైర్యం చేసేవారు లేరు. పవన్ కు భుజం శస్త్ర చికిత్స ,అనారోగ్య సమస్య కారణంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. అయినా కొన్ని కార్యక్రమాలకు వెళ్లడం, మరికొన్నిటికి వెళ్లకపోవడం జరుగుతోంది.

ఇటీవల కేరళకు వెళ్లారు. దీనిపై అంతా సానుభూతితోనే ఉన్నారు. కాని రాజకీయంగా జరుగుతున్న  పరిణామాలు పార్టీలో అంత సంతృప్తికరంగా లేవన్నది నిష్టుర సత్యంగా కొందరి వ్యాఖ్యల బట్టి అర్దం అవుతుంది. ఇవన్ని ఎలా ఉన్నా  కూటమి ప్రభుత్వం ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వం 15 ఏళ్లు  ఉండాలని స్వయంగా పవన్ కళ్యాణే పలుమార్లు ప్రకటించడంతో జనసేన క్యాడర్ లో నిస్తేజం ఏర్పడింది. తాము పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలని అనుకుంటే, ఆయనేమో  దాని గురించి ఆలోచించడం మానేశారన్నది వారి బాధ. తన సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించినా అది దక్కలేదు. కాని చివరికి అటవీశాఖలో గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా నియమించి క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంతవరకైనా అన్నదమ్ములకు న్యాయం జరిగినట్లయిందని కొందరు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తుంటారు. 

ఒకప్పుడు కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించిన సంగతి వేరే కోణం. పార్టీలో ఆయా ముఖ్యమైన పదవులలో సామాజిక న్యాయం జరగడం లేదన్న విమర్శ ఉంది. పార్టీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు కారు రాష్ డ్రైవింగ్ కారణంగా ఒక యువతి మరణిస్తే తగురీతిలో పార్టీ స్పందించి ఉండాల్సిందని,అలా చేయకపోవడం వల్ల జాతీయ మీడియాలో కూడా విమర్శలకు గురి కావల్సి వచ్చిందన్న భావన ఉంది. చంద్రబాబు, మంత్రి  లోకేష్  లు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ ను  పొగడడం మినహా జనసేన పార్టీవారికి పెద్దగా ఒరుగుతున్నదేమీ లేదన్నది కొంతమంది జనసేన నేతల అభిప్రాయం.  ఈ పరిణామాలను అంతా గమనిస్తున్నారు. కాకపోతే అధికారంలో ఉన్న నేపద్యంలో ఎవరికివారు పైకి మాట్లాడడానికి కాస్త వెనుకాడుతుంటారు. 

ఈ పరిస్థితిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే  తమకు ఏ మేరకు అవకాశాలు వస్తాయన్నది జనసేన కార్యకర్తలలో ఉన్న ప్రశ్న. లోకేష్ ఎప్పుడైతే  జనసేనకు 15 శాతం సీట్లే కేటాయిస్తామని చెప్పడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. లోపల ఉడుకుతున్నారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ శాసనసభ ఎన్నికలు వేరు, స్థానిక ఎన్నికలు  వేరని, అందువల్ల 15 శాతం కేటాయింపు సమ్మతం కాదన్నట్లు మాట్లాడారు.కాని ఆ తర్వాత కాస్త తగ్గారేమో అన్న అభిప్రాయం పార్టీలో ఏర్పడింది. దాంతో పవన్ కళ్యాణ్ కూడా దీని గురించి మాట్లాడక తప్పలేదు. నిజానికి ఆయనకు  ఈ అంశంపై ఎంత శ్రద్ద ఉందో పార్టీ క్యాడర్ కు తెలియడం లేదు. నిర్దిష్టంగా స్థానిక ఎన్నికలలో పార్టీ కార్యకర్తలు,లోకల్ నేతలకు మంచి ప్రాధాన్యం వచ్చేలా చూస్తామని హామీ ఇవ్వలేదు. ఒక కమిటీని నియమించారు. 

వారేమి చేస్తారో తెలియదు. లోకేష్ ప్రకటనకు పవన్ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారన్నది జనసేనలో ఉన్న ఒక అభిప్రాయంగా భావిస్తున్నారు. ఆయా ప్రాంతాలు,సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని సీట్ల కేటాయింపు కోరాలన్న ఆలోచనను ఆయన చేస్తున్నారట. ఈ ఎన్నికలలో జనసేన ప్రభావశీలంగా ,మెరుగైన  స్థాయిలో నిలబడుతుందని ఆయన చెప్పారు. అయితే కచ్చితంగా ఎంత శాతం సీట్లు దక్కుతాయన్నది తేల్చలేదు. లోకేష్ అంత స్పష్టంగా ఒక లెక్క చెప్పినప్పుడు అది కుదరదని చెప్పకపోతే పార్టీవారికి అది లోకువ కాదా అన్నది కొందరు నేతల భావన. కాగా పార్టీ బాధ్యత అంతా నాదెండ్ల మనోహర్ కే అప్పగించినట్లుగా కనిపిస్తుందని, ఆయనే ఆయా సమావేశాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల కోసం 30 రోజుల ప్రణాళిక తయారు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు వ్యూహాత్మకంగా జనసేనకు ఎన్ని సీట్లు  కేటాయించేది చెప్పకుండా ,మూడుపార్టీలు కలిసి పనిచేయాలని ప్రకటనలు చేస్తున్నారు. టీడీపీ ఏ మేరకు సీట్లు ఇస్తుందో తెలియక,ఆయా చోట్ల జనసేన ఆశలు పెంచుకుంటోంది. మచిలీపట్నంలో ఇంతవరకు టీడీపీతో ఒక అవగాహన రానప్పటికీ జనసేనలోని రెండువర్గాలు దీనిపై ఘర్షణ పడ్డాయి.మరోవైపు గుంటూరు మేయర్ సీటును జనసేనకే కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ గుంటూరు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు  ఒక కరపత్రాన్ని విడుదల చేశారు.గుంటూరులో ప్రస్తుతం ఉన్న ముఖ్యమైన పదవులన్నీ టీడీపీవారికే వచ్చాయని, అందువల్ల మేయర్ పదవికి పోటీచేసే అవకాశాన్ని  జనసేనకు ఇవ్వాలని ఆయన కోరారు. పలు ఇతర జిల్లాలలో కూడా జనసేన నేతలు ఇలాంటి  డిమాండ్లే పెడుతున్నారు. ఇదిలా ఉండగా కొంతమంది నేతలు ఏ ఏ జిల్లాలలో ఎంత శాతం సీట్ల కేటాయింపు కోరాలో పార్టీకి సూచిస్తున్నారు.

దాని ప్రకారం ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీతో సమానంగాను, ఉత్తరాంధ్ర  నుంచి కృష్ణా జిల్లావరకు 40 శాతం సీట్లు,తొమ్మిది జడ్పి చైర్ పర్సన్, ఐదు మేయర్ పదవులకు పోటీ చేయాలని వీరు కోరుతున్నారు. ఒవరాల్ గా చూసినప్పడు సగటున మూడో వంతు సీట్లకు పట్టుబట్టాలన్నది జనసేన నేతల డిమాండ్ గా ఉందని అంటున్నారు. తాను నియమించిన కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తాము కోరదగిన సీట్ల వివరాలను టీడీపీ నాయకత్వానికి అందచేయవచ్చని భావిస్తున్నారు.ఆ తర్వాత సంప్రదింపులలో ఎన్నిటికి ఒప్పందం కుదురుతుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. శాసనసభ ఎన్నికలలో కనీసం 50 సీట్లకుపట్టుబట్టి ఉంటే,ఈ రోజు జనసేనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని అనుకుంటున్నారు. అయినా ఆనాడు పవన్ మాటను కాదనలేక సర్దుకుపోయామని కొందరి వ్యాఖ్యగా ఉంది. ఇప్పుడు స్థానిక ఎన్నికలలో లోకేష్ మాటే చెల్లితే జనసేన పరిస్థితి మరింత దిగజారుతుందన్న భయం పార్టీవర్గాలలో ఉంది.

ఇప్పటికే అనేక చోట్ల టీడీపీ నేతల నుంచి అవమానాలను భరించవలసి వస్తోందన్నది పలువురు నేతల బాధగా ఉంది.ఈ విషయాన్ని కొంతమంది ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారని వార్తలు  వచ్చాయి. దీనిపై పార్టీ కార్యకర్తలలో ఉన్న అసహనాన్ని కూడా  తెలియచేశారు. పవన్ ఈ విషయాలు తెలుసునని  అన్నారట. అయినా ఆయన  నుంచి వారికి కచ్చితమైన హామీ లభించినట్లు చెప్పలేకపోతున్నారు. ఒకరకంగా ఈ స్థానిక ఎన్నికలు జనసేన ఆత్మగౌరవానికి ఒక పరీక్ష అని ఆ పార్టీవారే వ్యాఖ్యానిస్తున్నారు. ఒక రాజకీయపార్టీగా జనసేన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోగలుగుతుందా?. ఆత్మ గౌరవాన్ని పరిరక్షించుకుంటుందా? లేక టీడీపీ వెనుక నిలబడే పార్టీగానే మిగిలిపోతుందా అన్నది స్థానిక ఎన్నికలలో కొంతవరకు తేలవచ్చేమో!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement