breaking news
deputy minister
-
అత్తారింటికి దారేది సీన్ గుర్తొస్తోందా?.. పవన్‌పై విమర్శలు
జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను నటించిన సినిమాలలోని కొన్ని సన్నివేశాలను గుర్తుంచుకునైనా మాట్లాడితే ఇంత అప్రతిష్ట మూట కట్టుకునేవారు కారన్న మాట రాజకీయవర్గాలలో వినిపిస్తోంది. అత్తారింటికి దారేది సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. అందులో హాస్య నటుడు బ్రహ్మానందం అబద్ధాలు చెబితే ఒక చెట్టు ఆకులు రాలుతుంటాయి. దాంతో ఆయన ఇరుకున పడతారు. ఇది పవన్ కళ్యాణ్ కు వర్తిస్తుందనిపిస్తుంది. అబద్దం చెబితే అతికినట్లు ఉండాలన్నది ఒక సామెత. ఈ విషయంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉన్న నేర్పరితనం పవన్ కు ఇంకా రాలేదనుకోవాలి. చంద్రబాబు ప్రత్యర్థులు ఈ విషయం ప్రస్తావిస్తుంటారు.గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగల శక్తి చంద్రబాబుకు మాత్రమే ఉందని ఎద్దేవ చేసేవారు. అది వేరే కథ. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన ఏదో ఒక ప్రకటన చేయడం, ఆ తర్వాత అనతికాలంలోనే దానికి విరుద్ధంగా మాట్లాడడం వంటివి తరచు చేస్తుంటారన్న విమర్శ ఉంది. వాటిని నిర్ధారించే వీడియోలు సోషల్ మీడియాలో విస్తారంగా కనిపిస్తాయి. గతంలో కాపుకులం వారైనా తనకు మద్దతు ఇవ్వాలని బహిరంగంగా కోరడం, ఇప్పుడేమో, తాను కాపులకోసమే పార్టీ పెట్టలేదన్నట్లుగా మాట్లాడడం, కాపులు మద్దతు ఇస్తే సీఎం అయి చూపుతానని ఒకసారి, తనకు అంత శక్తి ఎక్కడిదని ఇంకోసారి మాట్లాడారు.కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తనకు ఏపీలోనే దిక్కులేదని, తెలంగాణలో సీఎం అవుతానా అని వ్యాఖ్యానించి అందరిని ఆశ్చర్యపరిచారు. అది ఫ్రస్టేషనా? లేక ఇంకేదైనా కారణమో తెలియదు. ఈ క్రమంలోనే దివంగత నేత, మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై పవన్ కళ్యాణ్ ఒక సంచలన వ్యాఖ్య చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వస్తారేమో అన్న అనుమానంతో ఆయనను ఇబ్బంది పెట్టాలని వైఎస్ అనుకున్నట్లు, ఆ విషయాన్ని ఒక పోలీసు అధికారి చెప్పినట్లు పేర్కొన్నారు. రోడ్డుపైకి వస్తే కాల్చేసే రోజులని, తాను తుపాకి పోలీసులకు ఇచ్చేసి ప్రాణాలకు తెగించి రాజకీయాలలోకి వచ్చానని ఆయన తెలిపారు. ఇది విన్న కొత్త తరం వారికి అందులో నిజం ఉందేమో అనుకునే అవకాశం ఉంటుంది. కాని అప్పటి నుంచి రాజకీయాలను చూస్తున్న వారికి పవన్ వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి.ఇంత ఘోరంగా అసత్యాలు చెప్పవలసిన అవసరం ఏమి ఉంది అన్న ప్రశ్న వచ్చింది. దీనిని ఖండించి, ఎవరూ వాస్తవాలు చెప్పలేరులే అన్న ధైర్యమో, లేక నిజాలు తెలిసినా పర్వాలేదులే.. తాను చెప్పినవాటిని నమ్మే జనం ఉంటారులే అన్న భావమో తెలియదు. కాని దీనివల్ల తన పరువుకు భంగం అని ఆయన ఆలోచించలేకపోతున్నారు. ఆ వెంటనే కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులు పాత చరిత్రను తవ్వారు. పవన్ తుపాకి కథకు సంబంధించిన వీడియోలను వెలికి తీశారు. వాటిని చూస్తే పవన్ కళ్యాణ్ అనవసరంగా గెలుక్కున్నారన్న అభిప్రాయం కలుగుతుంది. పైగా అసందర్భంగా మాట్లాడినట్లు కూడా అర్థం అవుతుంది.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఈ నేపథ్యంలోనే ఆయనకు సవాల్ విసిరారు. 2005 ప్రాంతంలో పవన్ కళ్యాణ్ పెద్దగా జనంలో ప్రాచుర్యం పొందిన నేతకాదు. కేవలం ఒక సినిమా నటుడిగా, అది కూడా మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా మాత్రమే గుర్తింపు ఉండేది. 2008లో చిరంజీవి ప్రజారాజ్యం ఏర్పాటు చేసిన తర్వాత పవన్ ను యువరాజ్యం అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత ఇందిరాపార్క్ వద్ద జరిగిన ఒక ధర్నాలో కాంగ్రెస్ వాళ్ల పంచెలూడదీసి కొట్టాలి అన్న వివాదాస్పద డైలాగుతో పవన్ బాగా ప్రచారంలోకి వచ్చారు. ఆ తర్వాత పరిణామాలలో 2014లో జనసేన ఆవిర్భావంతో ఒక ప్రముఖ రాజకీయ నేతగా అవతరించారు.2005 ప్రాంతంలో చిరంజీవి కుమార్తె ఒకరు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ వివాహానికి కుటుంబపరంగా ఏవో సమస్యలు వచ్చాయి. ఆ క్రమంలో ఆమె పవన్ పై ఒక ఆరోపణ చేశారు. ఆయన వల్ల తమకు ప్రమాదం ఉందని అన్నారు. దాంతో పవన్ తన వద్ద ఉన్న తుపాకిని తెచ్చి పోలీసులకు అందచేశారు. ఆ టైమ్ లో అవే విషయాలను ఆయన మాట్లాడారు. కాని రెండు దశాబ్దాల తర్వాత ఆ ఉదంతాన్ని వక్రీకరించి వైఎస్ఆర్పై నింద మోపడంతో మరోసారి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అత్తారింటికి దారేది సినిమాలో అబద్ధాలు ఆడితే ఆకులు రాలినట్లుగా, వీడియోలతో అసలు సన్నివేశం తెలిసిపోయింది. దీనిపై తొలుత వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని స్పందిస్తూ పవన్ కళ్యాణ్ రౌడీయిజం చేయబోతే చిరంజీవి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసిందని వ్యాఖ్యానించారు.కాస్త ఆలస్యంగా కేవీపీ రామచంద్రరావు ఒక లేఖను పవన్ కు రాస్తూ తన ఆక్షేపణ తెలిపారు. పవన్ అసత్యాలు చెబుతున్నారని అందులో స్పష్టం చేశారు. వైఎస్ పై ఆరోపణలను రుజువు చేస్తే పది కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి, లేదా స్వచ్ఛంద సంస్థకు అందచేస్తామని సవాల్ చేశారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కుటుంబపరంగా మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప, ఎలాంటి రాజకీయ కేసులు లేవని కేవీపీ స్పష్టం చేశారు. సంబంధిత పోలీసు అధికారి ఎవరో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడితే ఈ చాలెంజ్ స్వీకరించాలని అన్నారు. పవన్ కాంగ్రెస్ వారిని ఉద్దేశించి అప్పట్లో అనుచిత వ్యాఖ్యలు(పంచెలూడగొట్టాలని) చేస్తేనే కేసు పెట్టలేదని ఆయన గుర్తు చేశారు.ఈ సందర్భంలో కేవీపీ కూడా బహుశా కంపల్షన్ రీత్యా ఒక వ్యాఖ్య చేసినట్లు ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డికి, వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదని చాలామందిలాగానే పవన్ కూడా గుర్తించడంలో విఫలం అయ్యారని కేవీపీ అన్నారు. వైఎస్ ఆర్ మరణించాక ఆయన పేరు చార్జీషీట్ లో చేర్చిన రోజే కాంగ్రెస్ తో బంధం తెగిపోయిందని చాలామంది నమ్ముతారు. వైఎస్ వారసత్వాన్ని జగన్ కొనసాగించి ఉండకపోతే ఈపాటికి కాంగ్రెస్ పార్టీ ఆయనను పూర్తిగా వదలివేసి ఉండేదేమో!ఈ మధ్యకాలంలో వైఎస్ ఆర్ పైన, ఆయన కుటుంబంపైన అంత నీచంగా చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తుంటే, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా జవాబు ఇచ్చి ఖండించిందా? లేదే! పైగా ఏపీలో కాంగ్రెస్ నాయకత్వం టీడీపీతో మిలాఖత్ అయిందన్న ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి కదా! పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరో అడిగితేనే కాని స్పందించలేదని ఆయనే చెప్పడం కూడా గమనించదగిందే! కనీసం ఇప్పటికైనా స్పందించి అప్పటి పరిస్థితులను వివరించడం ద్వారా తన ఆప్త మిత్రుడైన వైఎస్ కు కేవీపీ కొంతలో కొంత న్యాయం చేసినట్లయింది.కేవీపీ చేసిన ఈ సవాల్ ను పవన్ స్వీకరిస్తారా అన్నది అనుమానమే. దానికి తగినట్లే ఆయన జవాబిచ్చినట్లు కనిపించలేదు. ఎందుకంటే ఈ పన్నెండేళ్లలో పవన్ కళ్యాణ్ చేసిన అనేక ప్రకటనలు, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఆయనే మాట్లాడిన వీడియోలు కోకొల్లలుగా కనిపిస్తాయి. గతంలో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెచ్చిపోయి మాట్లాడిన పవన్, తెలంగాణలో మాత్రం రేవంత్, కేటీఆర్ తదితరులను పొగుడుతున్న తీరును జనం గమనించకపోలేదు. ఎప్పటికీ అది ప్రస్తుతమో అన్నట్లుగా కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తుంటారన్న భావన ఉంది. వైఎస్ పై కూడా దురుద్దేశంతో చేసిన వ్యాఖ్య ఆయనకే తగిలినట్లయింది. పవన్ కళ్యాణ్ అనవసరంగా తెలంగాణలో వేలుపెట్టి వివిధ వర్గాలవారిని రెచ్చగొట్టి ఆంధ్రులకు ఇక్కట్లు తెచ్చి పెట్టకుండా ఉంటే అదే పదివేలు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
పాత ఫొటోలతో విష ప్రచారం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రహదారులన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తోందని, నిధులు కూడా కేటాయించామని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనాడు పత్రిక పాత ఫొటోలు వేసి తప్పుగా ప్రచారం చేసిందని, ద్వారకానగర్‌లో జూన్ 6వ తేదీలోపు రహదారులు వేసినట్టు స్పష్టం చేశారు. ఇక్కడే మరమ్మతులు కూడా చేపట్టామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మరమ్మతులు జరిగిన రహదారుల్లో పాత ఫొటోలతో పత్రికలో వేసి వార్తలు రాయడం దారుణమన్నారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరగదు కదా అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రహదారులన్నీ ఛిద్రంగా మారాయని, దాని వల్లే ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయన్నారు. పాత ఫొటోలు వేసి పచ్చ పత్రిక ప్రభుత్వంపై బురద జల్లేందుకు కంకణం కట్టుకుందన్నారు. జీవీంఎసీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్లు సూచనలు, సలహాలు మేరకు పనులు చేపడుతున్నట్టు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో అన్ని వార్డుల్లో మొత్తం 6,900 గుంతలను, రహదారులను గుర్తించడం జరిగిందని, ఇందులో సుమారు 3,200 గుంతలను 9 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసినట్టు చెప్పారు. మిగిలిన 3,700 గుంతలు జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే వార్డుల్లో పనుల కోసం ఒక్కొ కార్పొరేటర్‌కు రూ.కోటి 50 లక్షల కేటాయించామన్నారు. ఈ పనులు కూడా టెండర్లు పిలిచి త్వరగా చేపట్టాలని, వచ్చే సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. గ్రామీణా ప్రాంతాల్లో కూడా రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. నాడు–నేడు పథకం నిధులు కేటాయింపు ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రహదారుల కోసం రూ.1,073 కోట్లు కేటాయించామన్నారు. అలాగే మన్యం ప్రాంతాల్లో కూడ పీఆర్, ఆర్అండ్బీ రహదారులు వేయాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ శ, ఆర్డీవో డి.హుస్సేన్ సాహెబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మెరిసిన మన్యం బిడ్డ) -
"భార్యలను కొట్టండి" భర్తలకు సలహాలిచ్చిన మహిళా డిప్యూటి మంత్రి!
Malaysian female minister Said husbands to 'gently' beat 'unruly' wives: అత్యున్నత పదవిలో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే మాట్లాడేటప్పుడూ కాస్త ఆలోచించుకోవాలి. ఎందుకంటే వాళ్లు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి గానీ వాళ్లు ఎటువంటి తప్పులు దొర్లకుండా అత్యంత జాగురకతతో వ్యవహరించాలి. ఇక్కడొక మహిళా డిప్యూటీ మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. అసలు విషయంలోకెళ్తే... మొండిగా ఉండే భార్యలను కొట్టాలని మలేసియాకు చెందిన మహిళా డిప్యూటీ మంత్రి భర్తలకు సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా క్రమశిక్షణ నిమిత్తం వారిని సున్నితంగా కొట్టాలని కూడా చెప్పారు. అందువల్ల అతను తన భార్య ఎంతగా మారాలనుకుంటున్నాడో ఆమెకు స్పష్టంగా తెలుస్తుందని కూడా మహిళా డిప్యూటీ మంత్రి సిటి జైలా మహ్మద్ యూసఫ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు మదర్స్ టిప్స్ పేరుతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో పోస్ట్ చేశారు కూడా. ‘మొండిగా వ్యవహరిస్తున్న భార్యలతో మాట్లాడి క్రమశిక్షణగా ఉంచాలి. అలా కుదరనప్పుడూ సున్నితంగా వారిని కొట్టండి. అప్పటికీ ప్రవర్తన మార్చుకోకపోతే వారికి దూరంగా ఉండండి. అంతేకాదు మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల’ని భర్తలకు మహ్మద్ యూసఫ్ సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. దీంతో ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. (చదవండి: ఏకే 47 గన్‌తో సైనిక కసరత్తులు చేస్తున్న 79 ఏళ్ల బామ్మ!) -
మంత్రిని అపహరించి హతమార్చారు
బొలీవియా: కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చలేదని డిప్యూటీ మినిస్టర్ ను కిడ్నాప్ చేసి కిరాతకంగా హతమార్చిన ఘటన బొలీవియాలో చోటు చేసుకుంది. ప్రైవేటు కంపేనీలో పనిచేసేందుకు అవకాశం కల్పించాలని, మరిన్ని సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ గత కొంత కాలంగా గని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనకారులున్న ఆ దారి గుండా వెళుతున్న డిప్యూటీ మంత్రి రొడాల్ఫో ఇల్లాన్న్ ను చుట్టు ముట్టిన కార్మికులు ఆయనను అపహరించి, హతమార్చారని బొలీవియా ప్రభుత్వం తెలిపింది. బొలీవియా ప్రభుత్వ మంత్రి కార్లోస్ రొమేరో ఇది కిరాతక చర్యగా అభివర్ణించారు. డిప్యూటీ మినిస్టర్ మృతదేహాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా ఆయన ఆందోళన కారులను హెచ్చరించారు. గత కొంత కాలంగా బొలీవియాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గని కార్మికులు ప్రభుత్వ ఆస్తులను పెద్ద ఎత్తున ధ్వంసం చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. దీంతో ఇద్దరు ఆందోళనకారులను పోలీసులు హతమార్చారు.


