అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక.. క్షిపణి ప్రయోగంతో షాక్‌! | North Korea Fires Ballistic Missile Ahead of US South Korea Military Drills | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఉత్తర కొరియా హెచ్చరిక.. క్షిపణి ప్రయోగంతో షాక్‌!

Aug 12 2026 7:44 AM | Updated on Aug 12 2026 7:46 AM

North Korea Fires Ballistic Missile Ahead of US South Korea Military Drills

పోగ్యాంగ్‌: దక్షిణ కొరియా, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్న ‘ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్’ సైనిక విన్యాసాలు ప్రారంభం కానున్న తరుణంలో ఉత్తర కొరియా మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. బుధవారం ఉదయం ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఈ క్షిపణిని ప్రయోగించారు. ఇది సుమారు 700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి, జపాన్ సముద్రంలో పడిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు.

జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి ఈ ప్రయోగాన్ని ప్రాంతీయ శాంతికి ముప్పుగా అభివర్ణించడమే కాకుండా, దౌత్య మార్గాల ద్వారా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ ప్రయోగంపై దక్షిణ కొరియా జాతీయ భద్రతా కార్యాలయం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఇటువంటి చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పేర్కొంటూ, ఉత్తర కొరియాను వెంటనే ఇలాంటి పరీక్షలు ఆపివేయాలని హెచ్చరించింది. అగ్రరాజ్యాల మధ్య సాగుతున్న సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా దశాబ్దాలుగా దురాక్రమణకు సన్నాహాలుగా భావిస్తూ, ప్రతిసారీ ఇటువంటి క్షిపణి ప్రయోగాలతోనే తన నిరసనను తెలుపుతుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ నెలలో జరగనున్న 11 రోజుల ‘ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్’ విన్యాసాల్లో సుమారు 18,000 మంది దక్షిణ కొరియా సైనికులతో పాటు, అక్కడ మోహరించిన 28,500 మంది అమెరికా సైనికులు పాల్గొంటారు. ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా సైనికులు పొందిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి సైనిక విన్యాసాలు మరింత పటిష్టంగా ఉంటాయని కంబైన్డ్ ఫోర్సెస్ కమాండ్ పేర్కొంది. ఈ పరిణామాలు కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను మరోసారి తారాస్థాయికి చేర్చాయి.

ఇది కూడా చదవండి: సముద్రం నుంచి అంతరిక్షం వరకు చైనా సీక్రెట్ సెన్సార్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement