ఇరాన్ హత్యాయత్నం ముప్పు.. ఎయిర్‌పోర్టులో కేటరింగ్ ట్రక్కులో ట్రంప్ ప్రయాణం! | How Unusual Places Trump Went Into Hiding | Sakshi
Sakshi News home page

ఇరాన్ హత్యాయత్నం ముప్పు.. ఎయిర్‌పోర్టులో కేటరింగ్ ట్రక్కులో ట్రంప్ ప్రయాణం!

Aug 12 2026 3:15 AM | Updated on Aug 12 2026 3:15 AM

How Unusual Places Trump Went Into Hiding

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రత చుట్టూ ఎప్పుడూ అత్యంత కట్టుదిట్టమైన వలయం ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో భద్రతా ముప్పులు, నిరసనలు లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఆయన అనుకోని రీతుల్లో, అత్యంత గోప్యంగా ప్రయాణించాల్సి వచ్చింది. వెనుక ద్వారాల నుంచి దొంగచాటుగా వెళ్లడం, భూగర్భ బంకర్‌లోకి మారడం, బుల్లెట్ ప్రూఫ్ గోల్ఫ్ కార్ట్‌లలో తరలింపుతో పాటు.. ఇరాన్‌ నుంచి ముప్పు పొంచి ఉండటంతో తాజాగా ఎయిర్‌పోర్టులో కేటరింగ్ ట్రక్కులో ప్రయాణించిన ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది.

గత నెలలో టర్కీలోని అంకారాలో జరిగిన నాటో సదస్సుకు హాజరైన ట్రంప్‌పై ఇరాన్ నుంచి హత్యాయత్నం ముప్పు పొంచి ఉందన్న నిఘా సమాచారంతో భద్రతా సిబ్బంది వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. విలేకరుల సమక్షంలో ట్రంప్ పాత బోయింగ్ 747 విమానం ఎక్కారు. అయితే, విమానం లోపల నుంచి ఆయన్ను అత్యంత రహస్యంగా ఒక 'కేటరింగ్ ట్రక్'లోకి ఎక్కించి విమానాశ్రయం గుండా మరో చిన్న ఎయిర్‌ఫోర్స్ సీ-32ఏ విమానానికి తరలించారు.

ట్రంప్ అందులోనే ఉన్నాడనే భ్రమ కల్పించడానికి బ్రిటన్‌కు వెళ్లింది. అందులోని రిపోర్టర్లు, సిబ్బందిని కూడా కిటికీల కర్టెన్లు మూసేయాలని ఆదేశించారు. ట్రంప్ వేరే విమానంలో సురక్షితంగా బ్రిటన్ చేరుకున్నారు. కొన్ని వారాల తర్వాత గానీ ఈ విషయం బయటకు రాలేదు.

2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా శాన్‌ఫ్రాన్సిస్కోలోని హయత్ రీజెన్సీ హోటల్‌లో కాలిఫోర్నియా రిపబ్లికన్ సమావేశానికి ట్రంప్ హాజరుకావాల్సి వచ్చింది. వందలాది మంది నిరసనకారులు ప్రధాన మార్గాన్ని దిగ్బంధించడంతో ఆయన కాన్వాయ్ దారి మళ్లించారు. హైవే 101 నుంచి దిగి, హోటల్ వెనుక ఉన్న తక్కువ ఎత్తున్న రక్షణ గోడను ట్రంప్ స్వయంగా దూకి లోపలికి వెళ్లారు. వేదికపైకి చేరుకున్నాక నేను నా జీవితంలో ఇంత కష్టపడి ఎప్పుడూ వేదికపైకి రాలేదు అంటూ స్వయంగా ఆయనే చమత్కరించారు.

జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత అమెరికా వ్యాప్తంగా చెలరేగిన నిరసనలు వైట్ హౌస్ సరిహద్దుల వరకు చేరాయి. ఆందోళనకారులు వైట్ హౌస్ బారికేడ్లపై వస్తువులు విసురుతుండటంతో సీక్రెట్ సర్వీస్ విభాగం ట్రంప్‌ను వైట్ హౌస్ కింద ఉన్న అత్యవసర భూగర్భ బంకర్‌లోకి తరలించింది. ఆయన దాదాపు గంటపాటు అక్కడే ఉన్నారు. విపక్షాలు ఆయన్ను బంకర్ బాయ్ అని ఎగతాళి చేయగా.. తాను దాక్కోవడానికి వెళ్లలేదని, కేవలం బంకర్‌ను పరిశీలించడానికే   వెళ్లానని ట్రంప్ వివరణ ఇచ్చారు.

సెప్టెంబర్ 15, 2024న వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ క్లబ్‌లో ట్రంప్ ఆడుతుండగా, ఫెన్సింగ్ పొదల్లోంచి తుపాకీ గురిపెట్టిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ గుర్తించి కాల్పులు జరిపారు. వెంటనే ఏజెంట్లు ట్రంప్‌కు రక్షణ వలయంగా ఏర్పడి, స్టీల్ రీఇన్‌ఫోర్స్‌డ్‌తో తయారుచేసిన బుల్లెట్ ప్రూఫ్ 'ఫాస్ట్ గోల్ఫ్ కార్ట్'లోకి ఆయన్ను ఎక్కించి క్లబ్‌హౌస్‌కు సురక్షితంగా తరలించారు. ఈ సంఘటనపై స్పందించిన ట్రంప్, నాలుగైదు బుల్లెట్ శబ్దాలు వినిపించాయి.. చిట్టచివరి షాట్ కొట్టాలని ఉండేది కానీ, వెంటనే అక్కడి నుంచి సురక్షితంగా బయటపడటమే మంచిదనిపించిందిఅని సరదాగా పేర్కొన్నారు.

అధ్యక్షుడిగా గెలిచిన వారం రోజులకే అంటే నవంబర్ 2016 భద్రతా ప్రెస్ బృందానికి సమాచారం ఇవ్వకుండా ట్రంప్ డిన్నర్‌కు వెళ్లారు. ఆ రాత్రి ఆయన బయటకు రారని అధికారికంగా ప్రకటించిన తర్వాత, ఆయన తన కుటుంబంతో కలిసి రహస్యంగా మాన్‌హట్టన్‌లోని '21 క్లబ్' రెస్టారెంట్‌కు వెళ్లిపోయారు. సమాచారం తెలుసుకున్న రిపోర్టర్లు ఆయనను కవర్ చేయడానికి పరుగులు తీశారు. అధ్యక్షుడికి అత్యవసర రక్షణ కవరేజ్ వ్యవస్థ ఉన్నప్పటికీ, వారికి తెలియకుండా డిన్నర్‌కు వెళ్లడం ఆ సమయంలో తీవ్ర చర్చకు దారితీసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement