మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు ఉరిశిక్ష | Syrian ex president Bashar al-Assad gets death sentence in landmark verdict | Sakshi
Sakshi News home page

మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు ఉరిశిక్ష

Aug 11 2026 5:19 PM | Updated on Aug 11 2026 5:33 PM

Syrian ex president Bashar al-Assad gets death sentence in landmark verdict

డమాస్కస్‌: సిరియా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు ఊరిశిక్ష విధిస్తూ డమస్కస్ క్రిమినల్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పౌర యుద్ధానికి సంబంధించిన కేసులో ముందస్తు హత్యలు, చిత్రహింసలు, అక్రమ నిర్బంధం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు వంటి అభియోగాల్లో అసద్‌ను కోర్టు దోషిగా తేల్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు మరణదండన విధించింది. అయితే ప్రస్తుతం ఆయన రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు.

సిరియా ప్రభుత్వ వార్తా సంస్థ సనా అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. సిరియాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వం.. అసద్‌ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులపై ప్రత్యక్షంగా, గైర్హాజరీలోనూ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు మరణశిక్ష విధించడం ఇదే తొలిసారి.

ఈ కేసుకు న్యాయమూర్తి ఫఖర్‌ అల్‌దిన్‌ అల్‌ అరియన్‌ అధ్యక్షత వహించారు. అసద్‌పై నమోదైన అభియోగాలు న్యాయమైనవన్నట్లు కోర్టు పేర్కొంది. పలువురు వ్యక్తులను, అందులో చిన్నారులను కూడా ముందస్తు ప్రణాళికతో హత్య చేయడం, చిత్రహింసలకు గురిచేయడం, అక్రమంగా నిర్బంధించడం, మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడటం వంటి అభియోగాల్లో ఆయనను దోషిగా తేల్చినట్లు కోర్టు తెలిపింది

బషర్‌ అల్‌ అసద్‌ 2024 డిసెంబర్‌లో అధికారాన్ని కోల్పోయారు. ఇస్లామిస్ట్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష దళాలు డమాస్కస్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత అసద్‌ దేశం విడిచి పారిపోయారు. అనంతరం తన కుటుంబంతో కలిసి రష్యాకు వెళ్లారు. రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించింది. 

2011లో ప్రారంభమై దాదాపు 14 ఏళ్ల పాటు కొనసాగిన సిరియా అంతర్యుద్ధంలో జరిగిన ఆరోపణలపై కొత్త ప్రభుత్వం చేపడుతున్న న్యాయపరమైన చర్యల్లో భాగంగా  అసద్‌కు వ్యతిరేకంగా వెలువడిన ఈ తీర్పు వచ్చింది. అసద్‌ పాలనలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హింస, చిత్రహింసలు, హత్యలు, ఇతర అకృత్యాలకు బాధ్యులను చట్టపరంగా శిక్షించేందుకు సిరియా తాత్కాలిక ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

అసద్‌ ప్రభుత్వంలోని పలువురు మాజీ అధికారులు ఇప్పటికే న్యాయపరమైన విచారణలను ఎదుర్కొంటున్నారు. వీరిలో చిత్రహింసలు, హత్యలు, ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారులు సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌కు గైర్హాజరీలో మరణశిక్ష విధించడం సిరియా రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. అయితే ఈ శిక్ష అమలు కావడం దాదాపు అసంభవం 

కాగా ఆధునిక మానవాళి  చరిత్రలో అత్యంత ఘోరమైన, విధ్వంసకర సంఘటనలలో సిరియా అంతర్యుద్ధం ఒకటి

అప్పటి అధ్యక్షుడు బషర్ అల్-అసద్‌ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు, ముఖ్యంగా యువత శాంతియుత నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలను అణచివేయడానికి అస్సాద్ ప్రభుత్వం సైనిక బలగాలను ఉపయోగించి విచక్షణారహితంగా కాల్పులు జరిపింది. దీంతో ప్రజా ఉద్యోగం కాస్తా సాయుధ పోరాటంగా, అంతర్యుద్ధంగా మారింది. దీంతో ఈ యుద్ధ సమయంలో అస్సాద్ ప్రభుత్వం సొంత ప్రజలపైనే (పౌరులపై) రసాయన ఆయుధాలు  ప్రయోగించింది. దీంతో వందలాది మంది చిన్నారులు, సాధారణ ప్రజలు ఉపిరి ఆడక విలవిల్లాడుతూ ప్రాణాలు కోల్పోయిన దృశ్యాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
 

ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం సిరియా అంతర్యుద్ధంలో భారీ ప్రాణనష్టం సంభవించింది. మృతుల సంఖ్య అధికారికంగా గుర్తించి ధృవీకరించిన దాని ప్రకారం 5,80,000 మందికి పైగా..  కొన్ని సంస్థల అంచనా ప్రకారం దాదాపు 6.5 లక్షలకు పైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వీటికి బాధ్యత వహిస్తూ బషర్‌-అల్‌-అసద్‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement