వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌పై మరోసారి వ్యతిరేకత వ్యక్తమైంది. బలవంతపు చాకిరిని నియంత్రణ పేరుతో ట్రంప్ ప్రభుత్వం గత నెలలో 60 దేశాలపై విధించిన టారిఫ్‌లపై అమెరికాలోని 25 డెమొక్రటిక్ పార్టీ పాలిత రాష్ట్రాలు అంతర్జాతీయ వాణిజ్య కోర్టుకు ఎక్కాయి. అమెరికా దిగుమతుల్లో సుమారు 99.4 శాతం వాటా ఉన్న ఉత్పత్తులపై ట్రంప్ ప్రభుత్వం 10 నుంచి 12.5 శాతం టారిఫ్ విధించిన విషయం తెలిసిందే.
భారత్‌పై మొదట 12.5 శాతం పన్ను విధించినప్పటికీ జూలై 14న తాము వాణిజ్య విధానంలో మార్పులు చేసి బలవంతపు చాకిరి కారణంగా ఉత్పత్తి అయిన వస్తువుల దిగుమతిని నిషేధించామని స్పష్టం చేయడంతో టారిఫ్‌ను పది శాతానికి పరిమితం చేశారు. ఈ పన్నులు వినియోగదారులతోపాటు వ్యాపారాలపై అదనపు భారం మోపుతాయని కోర్టుకు ఎక్కిన రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
ఈ పన్నులు అక్రమమని ప్రకటిస్తూ రద్దు చేయాలని డెమొక్రటిక్ పాలిత రాష్ట్రాల తరఫున వాదిస్తున్న న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటీషియా జేమ్స్ డిమాండ్ చేశారు. టారిఫ్‌ల విషయంలో ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీంకోర్టులో ఓటమి చవిచూసిందని, దీంతో ఇప్పుడు మరో రకంగా వ్యాపారాలపై టారిఫ్‌లను రుద్దేందుకు ప్రయత్నిస్తోందని అని జేమ్స్ వ్యాఖ్యానించారు.


