పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ అతి పెద్ద పొలిటికల్ బాంబు పేల్చాడు. పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి కూడా అయిన.. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాన్ని గుర్తించామని ప్రకటించారు. ఈ వ్యవహారంలో న్యాయమూర్తులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, బ్యాంకర్లు కూడా ఉన్నారని ఆరోపించారు.
"21 ఏళ్లుగా లంచాలు ఇచ్చారు, తీసుకున్నారు. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకుంటాం" అని వ్యాఖ్యానించారు. అయితే కుంభకోణానికి పాల్పడ్డ వ్యక్తుల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు.
నఖ్వీ కొద్ది రోజుల కిందటే మరో సంచలన ఆరోపణ చేశారు. పాకిస్థాన్ పాలనా వ్యవస్థ కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించారు. నఖ్వీ వరుసగా చేస్తున్న సంచలన ఆరోపణలు పాక్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. అతడికి దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు పొసగడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే నఖ్వీ ప్రభుత్వంపై ఆరోపణుల చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. నఖ్వీ-మునీర్ చాలాకాలంగా ప్రధానిపై గుర్రుగా ఉన్నారని సమాచారం. ఈ కారణంగానే వారు ఇలాంటి ఆరోపణులు చేస్తున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, నఖ్వీ పీసీబీ అధ్యక్షుడిగా, పాక్ అంతర్గత మంత్రిగా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. తాజాగా అతడు మహిళల ఆసియా కప్‌కు సంబంధించిన షెడ్యూల్ డిస్కషన్‌లో పాల్గొన్నాడు. ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ప్రకటన త్వరలోనే వెలువడాల్సి ఉంది.


