హెడ్‌కోచ్‌ అవుతా.. మెకల్లమ్‌ రాజీనామాకు కారణం నేనే: స్టోక్స్‌ | Ben Stokes Expresses Desire to Coach England, Takes Blame for Brendon McCullum's Exit | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌ అవుతా.. మెకల్లమ్‌ రాజీనామాకు కారణం నేనే: బెన్‌ స్టోక్స్‌

Aug 4 2026 4:06 PM | Updated on Aug 4 2026 4:20 PM

I want to be coach: Stokes Takes Blame For McCullum Quitting As Test Coach

PC: Instagram

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తన భవిష్యత్‌ ప్రణాళికల గురించి వివరించాడు. ఏదో ఒకరోజు తాను తప్పక ఇంగ్లండ్‌ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపడతానన్నాడు. అదే విధంగా.. బ్రెండన్‌ మెకల్లమ్‌ రాజీనామాకు ఒక రకంగా తానే కారణమని పేర్కొన్నాడు.

‘బజ్‌బాల్‌’తో
కాగా న్యూజిలాండ్‌ దిగ్గజం బ్రెండన్‌ మెకల్లమ్‌ మార్గదర్శనంలో బెన్‌ స్టోక్స్‌ సారథ్యంలో ఇంగ్లండ్‌ టెస్టు జట్టు దూకుడు విధానం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. సంప్రదాయ ఫార్మాట్లోనూ వేగంగా ఆడుతూ ‘బజ్‌బాల్‌’తో మిశ్రమ ఫలితాలు పొందింది.

అయితే, వరుస ఓటముల నేపథ్యంలో మెకల్లమ్‌, స్టోక్స్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే స్టోక్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించగా.. మెకల్లమ్‌ సైతం టెస్టు కోచింగ్‌ బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఈ పరిణామాల నేపథ్యంలో స్టోక్స్‌ తాజాగా స్పందించాడు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ..

ఏదో ఒకరోజు కోచ్‌ని అవుతా
‘‘నేను కోచ్‌గా మారాలనుకుంటున్నాను. కోచ్‌గా ఉన్నపుడే ఆటలోని పూర్తి సంతృప్తిని మనం ఆస్వాదించగలుగుతాము. ఇంగ్లండ్‌ కోచ్‌ కావడమంటే నాకెంతో ఇష్టం. ఏదో ఒకరోజు కచ్చితంగా కోచ్‌ని అవుతా. ఇది కచ్చితంగా జరుగుతుందా? అంటే నాకు తెలియదు.

అయితే, నాకు మాత్రం కోచ్‌గా సేవలు అందించడమంటే ఎంతో ఇష్టం. ఏదో ఒకరకంగా మరోసారి ఇంగ్లండ్‌ నాయకత్వ బృందంలో పని చేయాలనే కోరిక నాకుంది. ఏదేమైనా మెకల్లమ్‌ రాజీనామా చేయడం నన్ను ఆశ్చర్యపరిచింది.

మెకల్లమ్‌ రాజీనామాకు కారణం నేనే
ఒకవేళ నేను గనుక రిటైర్మెంట్‌ ప్రకటించి ఉండకపోతే.. ఇప్పటికీ బజ్‌ కోచ్‌గా కొనసాగేవాడు. కాబట్టి అతడు రాజీనామా చేయడానికి ఒక రకంగా కారణం నేనే. తప్పంతా నాదే. చాలా మంది అనుకుంటున్నట్లుగా మా మధ్య అసలు ఎలాంటి విభేదాలు లేవు. ఒక్కోసారి మా ఆలోచనలు వేరుగా ఉండేవి. అయితే, పరస్పర అవగాహనతో ఇద్దరం ఒక్కతాటి మీదే నడిచేవాళ్లము’’ అని స్టోక్స్‌ స్పష్టం చేశాడు.

కాగా స్టోక్స్‌ రిటైర్మెంట్‌ నేపథ్యంలో జో రూట్‌ను తిరిగి టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమించింది ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు. ఇక మెకల్లమ్‌ స్థానంలో అతడి స్నేహితుడు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌కు టెస్టు కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది. మరోవైపు.. ఇంగ్లండ్‌ వన్డే, టీ20 జట్ల కోచ్‌గా మెకల్లమ్‌ కొనసాగుతున్నాడు. 

చదవండి: గంభీర్‌పై ఫిర్యాదు చేసిన సీనియర్‌ ప్లేయర్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement