పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. తొలి టెస్టులో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన ఆజం.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన క్లాస్ చూపిస్తున్నాడు.
కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన బాబర్, మరో సీనియర్ బ్యాటర్ అబ్దుల్లా షఫీక్‌తో కలిసి జట్టును భారీ స్కోర్ దిశగా నడిపిస్తున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి అతడు 86 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ క్రమంలో బాబర్ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
టెస్టుల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన నాలుగో పాకిస్తాన్ కెప్టెన్‌గా జావేద్ మియాందాద్ సరసన బాబర్ నిలిచాడు. టెస్టుల్లో కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌కు ఇది 13వ అర్ధశతకం. ఈ జాబితాలో మిస్బా-ఉల్-హక్(35) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత స్ధానాల్లో ఇమ్రాన్ ఖాన్ (14), ఇంజామామ్-ఉల్-హక్ (14) ఉన్నారు.
టెస్ట్ క్రికెట్‌లో పాకిస్తాన్ కెప్టెన్‌గా కనీసం 1000 పరుగులు చేసిన జాబితాలో అత్యధిక బ్యాటింగ్ సగటు కలిగిన ప్లేయర్‌గా బాబర్ (54.1) నిలిచాడు. ఈ క్రమంలో పాక్ దిగ్గజాలు ఇమ్రాన్ ఖాన్, సలీమ్ మాలిక్, ఇంజామామ్-ఉల్-హక్, మిస్బా-ఉల్-హక్‌లను అధిగమించాడు. ఆజం కెప్టెన్‌గా ఇప్పటివరకు 22 టెస్టుల్లో 54.1 సగటుతో 1894 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 13 అర్ధసెంచరీలు ఉన్నాయి.
పాక్ కెప్టెన్‌లగా అత్యుత్తమ టెస్ట్ సగటు కలిగిన బ్యాటర్లు వీరే ( కనీసం 1000 ప్లస్ రన్స్):
బాబర్ ఆజమ్ – 54.1
సలీమ్ మాలిక్ – 52.4
ఇమ్రాన్ ఖాన్ – 52.3
ఇంజామామ్-ఉల్-హక్ – 52.1
మిస్బా-ఉల్-హక్ – 51.4


