ప్రశాంత్‌ కిశోర్‌ విజయం వెనుక సీజేపీ వ్యూహం? | BJP’s 30 Year Fortress Falls, The Untold Role Of Abhijeet Dipke CJP Movement In PK’s Historic Victory, Read Story Inside | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ కిశోర్‌ విజయం వెనుక సీజేపీ వ్యూహం?

Aug 4 2026 7:28 AM | Updated on Aug 4 2026 10:52 AM

Abhijeet Dipkes CJP Movement Fueled PKs Stunning Bankipur Victory

బిహార్‌: పట్నాలోని అత్యంత కీలకమైన బాంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) సంచలన విజయం బిహార్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. దాదాపు మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే ఏకంగా 19,324 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ చారిత్రాత్మక విజయం వెనుక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఉద్యమం, అభిజీత్ దీప్కే నాయకత్వంలోని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమ ప్రభావం బలంగా ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో  నడుస్తోంది.

పీకే ఘనవిజయం: వాస్తవ గణాంకాలు
మొత్తం 32 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిశాక, ప్రశాంత్ కిశోర్ 64,151 ఓట్లు సాధించగా, బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హా 44,827 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఆర్‌జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 14,273 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. 19,324 ఓట్ల భారీ తేడాతో బీజేపీని ఓడించడం ద్వారా పీకే.. ఆ పార్టీకి ఉన్న ఇమేజ్‌ను బద్దలు కొట్టారు. ఈ ఫలితం బీహార్ రాజకీయాల్లో యువత ఆలోచనా సరళిలో వస్తున్న మార్పులకు సంకేతమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

30 ఏళ్ల కోట ఎలా కూలింది?
బాంకీపూర్ సీటు గత మూడు దశాబ్దాలుగా బీజేపీకి తిరుగులేని స్థానంగా ఉంది. చివరిసారిగా ఈ సీటును సీనియర్ బీజేపీ నేత నితిన్ నవీన్ గెలుచుకున్నారు. అలాంటి దుర్భేద్యమైన కోటలో ఉప ఎన్నికల ఓటమి సాధారణమైనది కాదు. ఈ సీటును గెలవాలంటే అసాధారణమైన ప్రజా వ్యతిరేకత లేదా కొత్త రాజకీయ సమీకరణాలు అవసరం. ఇప్పుడు అదే జరిగింది.

సీజేపీ ఉద్యమం: కీలక మలుపు
ఈ విజయంలో సీజేపీ పాత్రపై విస్తృత చర్చ జరుగుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అభిజీత్ దీప్కే నేతృత్వంలో 37 రోజుల పాటు జరిగిన నీట్‌ వ్యతిరేక ఉద్యమం యువతలో  అలజడిని సృష్టించింది. పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటం ప్రభావం బీహార్ యువతపై గట్టిగా పడింది. ఈ ఉద్యమానికి యువత నుండి లభించిన భారీ మద్దతు, అదే సమయంలో ఉద్యమకారులపై జరిగిన పోలీస్ లాఠీచార్జి.. విద్యార్థులు, వారి కుటుంబాల ఆగ్రహానికి కారణమయ్యాయి.

విద్యార్థుల ఆగ్రహం ఓట్ల రూపంలో?
బాంకీపూర్ పట్నా విద్యా రంగానికి ప్రధాన కేంద్రం. ఇక్కడ విశ్వవిద్యాలయాలు, కాలేజీలు, దేశవ్యాప్తంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోచింగ్ కేంద్రాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. పేపర్ లీక్ సమస్య, ఉపాధి అవకాశాలు ఈ వర్గపు ఓటర్లకు అత్యంత ప్రధానమైన అంశాలు. సీజేపీ ఉద్యమం లేవనెత్తిన అంశాలు నేరుగా వీరి గురించే ఉన్నాయి. ఈ విద్యార్థి ఉద్యమం పెద్ద సంఖ్యలో యువకులను రాజకీయంగా క్రియాశీలకంగా మార్చింది. ఈ ఆగ్రహం మొత్తం జన్‌ సురాజ్‌ పార్టీకి అనుకూలంగా మారిందన్న వాదన బలంగా వినిపిస్తోంది.

పాత ఓటు బ్యాంకు మూడ్ మారిందా?
ఈ ఉప ఎన్నికలో కేవలం యువ ఓటర్లు మాత్రమే కాదు, సంప్రదాయ ఓటు బ్యాంకు కూడా కదిలినట్లు తెలుస్తోంది. బీజేపీకి సంప్రదాయ మద్దతుదారులుగా భావిస్తున్న కొన్ని వర్గాలు కూడా మార్పును ఆకాంక్షిస్తూ జన్‌ సురాజ్‌కు మద్దతు ఇచ్చాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా, ప్రధాన ప్రతిపక్షమైన ఆర్‌జేడీ ఈ ఎన్నికల్లో మూడో స్థానానికి పడిపోవడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ పీకే ఖాతాలోకే చేరాయని స్పష్టమవుతోంది.

పోలింగ్ శాతం ప్రభావం
ఈ ఉప ఎన్నికల్లో తక్కువ పోలింగ్ శాతం కూడా ఫలితాన్ని ప్రభావితం చేసిందనేది మరో వాదన. తక్కువ పోలింగ్ ఉన్నప్పుడు, స్పష్టమైన అజెండాతో పోరాడే, ఐక్యంగా ఉండే ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సీజేపీ ఉద్యమం ద్వారా యువతలో ఏర్పడిన ఐక్యత, వారు అనుసరించిన వ్యూహం ఈ తక్కువ పోలింగ్ శాతంలో వారికి లాభం చేకూర్చి ఉండవచ్చు. ఏది ఏమైనా ఈ బాంకీపూర్ ఉప ఎన్నిక బీహార్ రాజకీయాల్లో పేపర్ లీక్, ఉద్యోగ భర్తీ వంటి అంశాలు ఇకపై ప్రధాన ఎజెండాగా మారబోతున్నాయనే సంకేతాన్ని స్పష్టంగా ఇచ్చింది.

ఇది కూడా చదవండి: మనిషి డీఎన్‌ఏలో అజ్ఞాత పూర్వీకుల ఆనవాళ్లు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement