వియంటియాన్: లావోస్‌లోని సియంగ్ ఖౌవాంగ్ పీఠభూమిలో పురావస్తు శాస్త్రవేత్తలు ఒక భారీ శిలాజ పాత్ర (మెగాలిథిక్ స్టోన్ జార్)లో సుమారు 1,000 సంవత్సరాల క్రితం నాటి 37 మంది ప్రాచీన మానవుల అవశేషాలను కనుగొన్నారు. ఈ అరుదైన ఆవిష్కరణ పురావస్తు వర్గాలలో సంచలనం కలిగించింది. ఇప్పటివరకు ఇలాంటి పాత్రలలో కాలిపోయిన ఎముకలు లేదా బూడిద మాత్రమే లభించగా, తొలిసారిగా కాలిపోని మానవ ఎముకలు లభించడం విశేషం.
2022 నుండి 2024 మధ్య జరిగిన తవ్వకాలలో వెలుగు చూసిన ఈ పెద్ద శిలాజ పాత్ర నాలుగు అడుగుల ఎత్తు, ఏడు అడుగుల వెడల్పు కలిగి ఉంది. కాలక్రమంలో దీనిని 890 శకం నుండి 1160 శకం మధ్య వివిధ తరాల ప్రజలు అంత్యక్రియల నిమిత్తం ఉపయోగించి ఉంటారని రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పురాతన కాలంలో ఎముకలు, పుర్రెలను ఈ పాత్ర అంచులలో ఉంచి అంత్యక్రియలు నిర్వహించేవారని భావిస్తున్నారు.
ఈ పాత్రలో మానవ అవశేషాలతో పాటు ఒక ఇనుప కత్తి, రాగి గంట, రాతి పలకలు, మట్టి పాత్రల ముక్కలు లభించాయి. మృతులకు కానుకగా సమర్పించినట్లు భావిస్తున్న గాజు పూసలు కూడా దొరికాయి. అయితే, ఈ పెద్ద పాత్రను కేవలం శ్మశానవాటికగా మాత్రమే ఉపయోగించారా లేదా అనేది ఇంకా ఖచ్చితంగా చెప్పలేమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. తొలుత మృతదేహాలను వేర్వేరు పాత్రలలో ఉంచి కుళ్లిన తర్వాత, మిగిలిన ఎముకలను ఈ పెద్ద పాత్రలోకి మార్చి ఉంటారనే మరొక సిద్ధాంతాన్ని కూడా పరిశోధకులు ప్రతిపాదిస్తున్నారు. ఈ ప్రాచీన మానవులు ఎవరు? వారి జీవన విధానం ఎలాంటిదో తెలుసుకునేందుకు పరిశోధకులు ఈ ప్రాంతం నుండి డీఎన్‌ఏ నమూనాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అక్కడి ఉష్ణోగ్రతల కారణంగా డీఎన్‌ఏ సేకరించడం సవాలుగా మారిందని అధ్యయన ప్రధాన పరిశోధకుడు నికోలస్ స్కోపాల్ తెలిపారు.
ఇది కూడా చదవండి: ‘చాందీపురా’ కలకలం: 22 మంది మృతి.. 35 మందికి పాజిటివ్


