చైన్‌ స్నాచింగ్‌.. నగర కమిషనర్‌ భార్య నిహారిక మెడలో.. | Funday Special Story On Commissioners Wife Chain Snatching Drama Pradyumna Crime | Sakshi
Sakshi News home page

చైన్‌ స్నాచింగ్‌.. నగర కమిషనర్‌ భార్య నిహారిక మెడలో..

Aug 2 2026 1:03 PM | Updated on Aug 2 2026 1:10 PM

Funday Special Story On Commissioners Wife Chain Snatching Drama Pradyumna Crime

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

క్లూషియల్‌

నగర కమిషనర్‌ భార్య నిహారిక మెడలోని ఐదు తులాల బంగారు గొలుసు పట్టపగలే చోరీకి గురైంది. వీఐపీ ఏరియాలో జరిగిన ఈ సంఘటన పోలీస్‌ శాఖ ప్రతిçష్ఠకు సవాలుగా మారింది. కమిషనర్‌ ఈ కేసును క్రైమ్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్నకు అప్పగిస్తూ, ‘ఇది మన పోలీస్‌ శాఖకే కాదు, వ్యక్తిగతంగా నాకు కూడా ఇబ్బందికరమైంది. మీ గురించి తెలుసు కాబట్టి ఈ కేసును మీరే సాల్వ్‌ చేయగలరని నమ్ముతున్నాను.’ అన్నాడు కమిషనర్‌.

ఇన్‌స్పెక్టర్‌  ప్రద్యుమ్న రంగంలోకి దిగి సీసీటీవీ విజువల్స్‌ను నిశితంగా పరిశీలించాడు. దొంగలు బైక్‌పై వచ్చిన విధానం, చైన్‌ లాగిన తీరు చూస్తే ఎక్కడో తేడాగా అనిపించింది. సాధారణంగా చైన్‌ స్నాచర్లు గొలుసు లాగేటప్పుడు మహిళలు కింద పడిపోవడం లేదా మెడకు గాయాలు కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ నిహారికకి చిన్న గీత కూడా పడలేదు. పైగా, దొంగలు వస్తున్నప్పుడు ఆమె ముందే అలర్ట్‌ అయినట్లు కెమెరాలో కనిపించింది.

ప్రద్యుమ్న నిహారిక కాల్‌ డేటాను పరిశీలించాడు. ఒక గుర్తుతెలియని నంబర్‌తో ఆమె గత రెండు రోజులుగా మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ నంబర్‌ ఆధారంగా చైన్‌ స్నాచర్‌ ‘రాకీ’ని ప్రద్యుమ్న సీక్రెట్‌గా పట్టుకుని విచారించాడు.
∙∙ 
కమిషనర్‌ ఇంటికి వచ్చాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న.
‘రండి తను ఇందాకే వెళ్లారు. చైన్‌ స్నాచర్‌ దొరికాడా?’ అడిగింది నిహారిక.
‘దొరికాడు. రాత్రంతా స్టేషన్‌లో థర్డ్‌ డిగ్రీ అప్లై చేస్తే నిజం కక్కాడు’ చెప్పాడు నిహారిక వంకే చూస్తూ...
‘కొట్టారా... నిజం చెప్పాడా?’ నిహారిక మొహం పాలిపోవడం గమనించాడు.
‘యస్‌ మేడం... ఇప్పుడు ఏం చేయమంటారు? చెప్పండి. మీరే ఇదంతా చేశారని చెప్పమంటారా? వాడికి మరో నాలుగు తగిలించి వాడే నేరం చేశాడని లోపల వేయమంటారా?’
‘వద్దు వద్దొద్దు... నా కోసం అనవసరంగా చేయని నేరానికి వాడిని శిక్షించొద్దు... నా భర్త నన్ను నిర్లక్ష్యం చేయడం భరించలేకపోయాను. పాత  నేరస్తుడు చైన్‌ స్నాచర్‌ వివరాలు తెలుసుకోవడం కమిషనర్‌ భార్యగా కష్టం కాదు. రాకీకి డబ్బులు ఇచ్చి డ్రామా ఆడాను. అలాగైనా నా భర్త నా భద్రత గురించి భయపడి, నాతో ఎక్కువ సమయం గడుపుతాడని పూలిష్‌గా చేశాను.’ రియలైజ్‌ అవుతూ చెప్పింది.

‘పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ గురించి మీకు తెలియంది కాదు. మీ బాధ అర్థమైంది. మీ బాధను సూటిగా చెప్పండి. నేరుగా మాట్లాడితే, మనసు విప్పి మాట్లాడితే చాలా అపోహలు తొలగిపోతాయి. రాకీని ఏం చేయలేదు. నిజం చెప్పినందుకు క్షమించాను. మీరిచ్చిన డబ్బుతో నిజాయితీగా బ్రతకమని చెప్పాను. ఇక మీరు కేసు గురించి ఆలోచించకండి. పొరపాటున కిందపడిందని, చైన్‌ స్నాచింగ్‌ జరగలేదని నమ్మించడం నాకు కష్టమైన పని కాదు. దయచేసి మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి.‘ చెప్పి బయటకు నడిచాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న.
∙∙ 
అయితే, అదే సమయంలో అనుకోకుండా ఇంటికి వచ్చిన కమిషనర్‌.. ప్రద్యుమ్న, తన భార్య మాట్లాడుకుంటున్న మాటలను చాటుగా విన్నాడు. ఒక నిష్ఠుర నిజం తెలుసుకున్నాడు. భార్య చేసిన పని కన్నా, ఆ పని చేయడానికి కారణాన్ని అర్థం చేసుకున్నాడు.
వెనక్కి తిరిగి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఆఫీస్‌ పని ముగించుకుని పెందరాళే ఇంటికి వచ్చాడు. బెడ్‌రూమ్‌లో కూర్చున్న భార్య దగ్గరకు వెళ్లి, ‘నిహారికా.. ఇవాళ మనం సినిమాకు వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వు’ అన్నాడు. షాకైంది నిహారిక. ఈ సమయంలో తను చేసిన పని భర్తకు  చెప్పకూడదని, ఎప్పటికీ  చెప్పకూడదని, భర్త వృత్తిని అర్థం చేసుకోవాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది నిహారిక.

కమిషనర్‌ తన భార్యను సినిమాకు తీసుకువెళ్లాడు. థియేటర్‌లో సినిమా ఇంటర్వెల్‌ సమయంలో ఆయన సీటులోంచి లేచి పక్కకు వచ్చి ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్నకు ఫోన్‌ చేశాడు.
ఫోన్‌ ఎత్తగానే, ‘థాంక్యూ ప్రద్యుమ్న! మీరు కేవలం క్రిమినల్‌ కేసులను మాత్రమే కాదు. మనుషుల మనసులను కూడా పరిశోధించి సమస్యలను సాల్వ్‌ చేస్తారు.’ మనస్ఫూర్తిగా అన్నాడు కమిషనర్‌.
అవతలి వైపు నుంచి నవ్వుతూ, ‘అప్పుడప్పుడు  ఇలాంటి సమస్యల్లో అసలు సాక్ష్యాన్ని కనిపెట్టాలిగా’ నవ్వుతూ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రద్యుమ్న.

- శ్రీసుధామయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement