ఫండే
మామూలుగా చెర్రీ ధర కిలోకు రెండువందల నుంచి నాలుగువందల రూపాయలు ఉంటుంది. కొన్ని అరుదైన రకాల చెర్రీ ధర కిలోకు మూడువేల రూపాయల వరకు కూడా ఉంటుంది. జపాన్‌లో పండే ఈ అత్యంత అరుదైన చెర్రీ ధర మాత్రం చుర్రుమనిపిస్తుంది.
ఈ చెర్రీ రకం పేరు ‘అమరీ హార్ట్‌బీట్’. జపాన్‌లో పండించే చెర్రీ రకాలలో ఇవి అత్యంత అరుదైనవి. వీటిని కిలోల లెక్కన కాకుండా, పదిహేనేసి చొప్పున ప్యాక్‌చేసి, అందమైన ప్యాకెట్లలో విక్రయిస్తారు. ఇవి ఇతర రకాల చెర్రీల కంటే ఎక్కువ తీపిగా ఉంటాయి. వీటిలో చక్కెర శాతం మిగిలిన చెర్రీ రకాల కంటే ఇరవై శాతం ఎక్కువగా ఉంటుంది.
ఈ చెర్రీలను ఎక్కువగా వేలం పాటల్లో విక్రయిస్తుంటారు. వేలంలో పదిహేనేసి చెర్రీలు ఉండే ఒక్కో ప్యాకెట్ ధర నాలుగున్నర లక్షల నుంచి ఆరులక్షల యెన్‌ల వరకు పలుకుతుంటుంది. ‘అమరీ హార్ట్‌బీట్’ చెర్రీలలో అత్యంత నాణ్యమైన వాటిని వేరుచేసి, వేలంశాలల్లో విక్రయిస్తుంటారు. మిగిలిన వాటిని లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో అమ్ముతుంటారు. లగ్జరీ ఫ్రూట్ షాపుల్లో వీటి ధర ఒక్కో ప్యాకెట్‌కు యాభైవేల యెన్‌ల వరకు ఉంటుంది.


