సాహసాల వేటలో సావాసాల బాట
సోలోగా రండి దోస్తులుగా వెళ్లండి
ఒక్క ట్రిప్‌తో క్లోజ్‌ఫ్రెండ్స్ అవుతున్న వైనం
నేడు స్నేహితుల దినోత్సవం
ఒకప్పుడు స్నేహం అంటే స్కూల్, కాలేజీ, ఆఫీస్.. లేదా పక్కింటి పరిచయాలు.. అంతే. కానీ ఇప్పుడు స్నేహానికి కొత్త చిరునామాలు పుట్టుకొస్తున్నాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్, సైక్లింగ్, రోడ్ ట్రిప్స్, అడ్వెంచర్ టూర్లు కొత్త స్నేహాల అల్లికకు కేరాఫ్‌గా మారుతున్నాయి. అపరిచితులుగా కలిసిన వారు టూర్ ముగిసే కొన్ని రోజుల వ్యవధిలోనే మంచి మిత్రులుగా మారుతుండడం ఈ స్నేహాల పట్ల నగర వాసుల్లో ఆసక్తిని పెంచుతోంది.
‘విభిన్న ఉద్యోగాల రీత్యా నగరానికి వచ్చి స్నేహాల కోసం సాహస యాత్రల్ని ఎంచుకుంటున్నారు’ అని నగరానికి చెందిన ట్రెక్ ఇట్ సంస్థ నిర్వాహకులు వెంకట్ తెలిపారు. ఈ ఆసక్తిని గమనించిన టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ కమ్యూనిటీలు ఇప్పుడు కేవలం ‘కొత్త ప్రదేశాలు చూడండి.. కొత్త స్నేహాలను ఏర్పరచుకోండి’ అంటూ ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి.
సోలోమంటూ.. స్నేహాలకు చలో..
ఈ తరహా యాత్రలు కనీసం 20 మంది నుంచి 50 మంది దాకా బృందంతో నిర్వహిస్తారు. అందరూ కలిసి ఒకే వాహనంలో ప్రయాణించడం, కలిసి భోజనం చేయడం, ఒకే క్యాంప్‌లో బస చేయడం, ప్రయాణంలో ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం, ఫొటోలు దిగడం.. ఇలా మొదలవుతున్న పరిచయం శరవేగంగా స్నేహంగా మారుతోంది. ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సందర్భాల్లో ఒకరు అలసిపోతే మరొకరు చేయి అందిస్తారు. వాటర్ బాటిల్ ఖాళీ అయితే ఇంకొకరు తమ నీటిని పంచుకుంటారు. ఒకరి బ్యాగ్‌ను మరొకరు కొద్దిసేపు మోస్తారు. ఇదే ‘ట్రిప్ ఫ్రెండ్’ను ‘లైఫ్ ఫ్రెండ్’గా మార్చేస్తోంది.
యాత్ర సమాప్తం.. ఆగని స్నేహం..
అడ్వెంచర్ ట్రిప్ పూర్తయిన తర్వాత కూడా వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్స్ సంబంధాలు, తదుపరి ట్రిప్స్ ప్లాన్ చేయడం ద్వారా స్నేహాలు బలోపేతమవుతున్నాయి. సాహస యాత్రలు చేసే అభిరుచి ఎక్కువగా యువతదే అయినప్పటికీ మొత్తం బృందంలో ముగ్గురు నలుగురే మధ్య వయసు్కలు ఉంటారు. సహజంగానే వీరు సమవయసు్కలు కావడంతో స్నేహితులుగా మారుతున్నారు. ఉద్యోగ, కుటుంబ బాధ్యతల మధ్య స్నేహితుల తో బంధాలు తగ్గిపోయిన 40+, 50+ వయసు వారిలోనూ గ్రూప్ ట్రావెల్, ద్వారా కొత్త స్నేహాలు ఏర్పడుతున్నాయి.
ఊర్లు వేరు.. దార్లు ఒకటే...
‘మాది తిరుపతి, అన్నాడు సునీల్ మాది పీలేరు అన్నాడు రెడ్డి శంకర్. మాది ఒంటిమిట్ట అని చెప్పాడు సంపత్. ఆ ముగ్గురు యువకులు. నగరం నుంచి ప్రారంభం అయే ప్రయాణాల్లో మేము సైతం అంటూ తమ బైక్‌ని కలుపుతారు. లేదా వీరు ముగ్గురూ కలిసి తరచుగా బైక్ ట్రిప్స్ వేస్తుంటారు ‘ఇటీవలే వాయనాడ్, కూర్గ్.. చుట్టు పక్కల ప్రాంతాలకు బైక్స్ మీద వెళ్లి వచ్చాం. ఎవరు ఎక్కడ ఎంత బిజీగా ఉన్నా ట్రిప్ ప్లాన్ చేసుకుంటే మాత్రం బైక్ కిక్ కొట్టాల్సిందే’ అంటోందీ స్నేహ త్రయం.
ప్రయాణ అభిరుచే కలిపింది..
కడప నివాసి మహ్మద్ వాసిమ్, నగరవాసి రాజ్ కుమార్ వశిష్టలను ఓ సాహస యాత్ర మంచి స్నేహితులుగా మార్చింది. ఇటీవలే దేవ్‌కుండ్ వాటర్ ఫాల్ తదితర ప్రాంతాల్లో ట్రెక్కింగ్ ముగించుకుని వచ్చిన వీరు తమ తదుపరి మాన్‌సూన్ ట్రెక్‌కు సిద్ధమవుతున్నారు.
‘తొలుత నేను ట్రిప్ ప్లాన్ చేస్తాను. వాసిమ్ ని సంప్రదించి తను ఓకే అన్నాక ఫైనల్ చేస్తాను’ అంటూ చెప్పారు రాజ్. కుల,మత నేపథ్యాలతో పాటు వృత్తి వ్యాపకాలు కూడా వేర్వేరు. (వాసిమ్ వ్యాపారి కాగా రాజ్ ఐటీ ఉద్యోగి ) అయినా అవేవీ వీరి స్నేహ ప్రయాణానికి అడ్డంకి కాకపోవడం గమనార్హం.


