ఒక్క పోజ్‌... వెయ్యి లైక్స్‌! | Best Photo Poses For Men To Look Stylish | Sakshi
Sakshi News home page

ఒక్క పోజ్‌... వెయ్యి లైక్స్‌!

Aug 2 2026 10:18 AM | Updated on Aug 2 2026 10:18 AM

Best Photo Poses For Men To Look Stylish

ఫ్యాషన్‌

ట్రెండీమెన్‌

‘ఫొటో తీస్తా... పోజ్‌ ఇవ్వు!’  అని ఫ్రెండ్‌ అన్న వెంటనే... ఏం చేయాలో తెలియక చేతులు జేబుల్లో ఎట్టుకుని, తల ఎటు తిప్పాలో అర్థం కాక కెమెరానే చూస్తూ స్టాచ్యూ అయిపోతున్నారా? అయితే ఈ టిప్స్‌ మీ కోసమే!

నడవట్లేదు... మ్యూజిక్‌ నడుస్తోంది!
కెమెరా ముందు బిగుసుకుని నిలబడాల్సిన పని లేదు. ఫ్రెండ్‌ను చూసి నడుస్తూ  ఒక కాలు ముందుకు మరో కాలు మడమను పైకి లేపి ఆగండి. ఇక ఒక చేయి జేబులో... మరో చేయి ముందుకు ఊపితే చాలు... ఫొటోలో సినిమా హీరో ఎంట్రీ వైబ్‌ వచ్చేస్తుంది. ఈ పోజ్‌ ఎక్కువగా రోడ్డు, పార్క్, కాలేజ్‌ క్యాంపస్, మాల్‌లలో బాగుంటుంది.

సైడ్‌ లుక్‌... ఫుల్‌ హుక్‌!
కెమెరా వైపు ఎప్పుడూ చూడాల్సిన రూల్‌ లేదు. చిన్‌ను కొద్దిగా పైకి ఎత్తి, పక్కకు చూస్తే, చూసేవాళ్లే ‘ఏమో... ఏదో ఆలోచిస్తున్నాడు!’ అనుకుంటారు. అసలు మీరు ఆలోచించేది ఇంటికి వెళ్లాక ఏం తినాలన్నదే అయినా... ఫొటోలో మాత్రం చాలా డీప్‌ థింకర్‌లా కనిపిస్తారు!

ఫ్రెండ్‌తో కలిసి పోజ్‌... డబుల్‌ స్టయిల్‌!
ఒక్కడిగా ఫొటో బాగుంటుంది. కాని, ఇద్దరు ఫ్రెండ్స్‌ ఒకే స్టయిల్‌లో నడిస్తే, అది వేరే లెవెల్‌. ఇద్దరూ ఒకే స్టయిల్‌లో నడవడం, ఒకే డైరెక్షన్‌ లో చూడడం, ఒకే టైమ్‌లో పోజ్‌ ఇస్తే, ఫొటోకు సినిమాటిక్‌ ఫీల్‌ను తీసుకొస్తుంది. ఫ్రెండ్స్‌తో రీల్స్‌ లేదా ఫొటోషూట్‌ చేస్తే ఈ పోజ్‌ తప్పక ట్రై చేయండి. కానీ ఒకడు హీరోలా నడుస్తుంటే, ఇంకొకడు చెప్పు జారి బ్యాలెన్స్‌ పట్టుకుంటే మాత్రం కామెడీ షో పోస్టర్‌ అయిపోతుంది!

నవ్వాలా? సీరియస్‌గా ఉండాలా?
ప్రతి ఫొటోలో పళ్లన్నీ చూపిస్తూ నవ్వితే టూత్‌పేస్ట్‌ యాడ్‌లా బాగుండదు. అందుకే, కొన్నిసార్లు చిన్న స్మైల్‌... ఇంకొన్నిసార్లు సైలెంట్‌ లుక్‌. ముఖ్యంగా కళ్లలో కాన్ఫిడెన్స్‌ ఉంటే చాలు. ఫొటోకి అదే అసలైన ఫిల్టర్‌! గుర్తించుకోండి. పోజ్‌ అంటే శరీరాన్ని వంచడం కాదు, కాన్ఫిడెన్స్‌ను చూపించడం! అందుకే, కెమెరా ముందు సహజంగా ఉండండి. మీ స్టయిల్‌ను మీరే ఎంజాయ్‌ చేయండి.

చేతులే చాలు.. కాన్ఫిడెన్స్‌!
చేతులు ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడేవాళ్లకు ఇది లైఫ్‌సేవర్‌ పోజ్‌. ఒక చేయి లేదా రెండు చేతులు వెనక షర్ట్‌ లేదా హెయిర్‌ అడ్జస్ట్‌ చేస్తున్నట్లు పెట్టండి. అలాగే, భుజాలను నిటారుగా ఉంచి, ఛాతీని కొద్దిగా ముందుకు తీసుకొస్తే కాన్ఫిడెన్స్‌ ఆటోమేటిక్‌గా ఆన్‌ అవుతుంది. అయితే, ఫొటో దిగేటప్పుడు జేబులో మొబైల్, వాలెట్, బైక్‌ కీ... అన్నీ నింపేస్తే మాత్రం పోజ్‌ కంటే జేబే హైలైట్‌ అవుతుంది!

నిజం చెప్పాలంటే... మంచి డ్రెస్‌ వేసుకోవడం కంటే మంచి పోజ్‌ ఇవ్వడమే చాలా కష్టం. డ్రెస్‌ షాపులో దొరుకుతుంది. కానీ, స్టయిల్‌ మాత్రం మీలోనే ఉండాలి! అందుకే, ఇక్కడ కనిపించిన పోజులు పెట్టి ఫొటోలు దిగండి. అప్పుడు ఎక్కువ కష్టపడకుండానే స్టయిలిష్‌గా కనిపిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement