పచ్చిగెడ్డి... ఆకలి ఇద్దరికీ ఒకటే! | Funday Special Story On Rural Women Amina And Her Cow | Sakshi
Sakshi News home page

పచ్చిగెడ్డి... ఆకలి ఇద్దరికీ ఒకటే!

Aug 2 2026 9:39 AM | Updated on Aug 2 2026 9:39 AM

Funday Special Story On Rural Women Amina And Her Cow

ఫండే స్టోరీ

ఎండ సుర్రని కొడ్తాంది. పిల్లోళ్ళు కాళ్ళకి చెప్పులేసుకోని, టోపీలు పెట్టుకోని, బ్యాటు బాల్లు తీసుకోని కిర్‌కేట్‌ ఆడుకున్నేకి పోతాన్నారు. ఇంటి ముందర అరుగుల మింద నీడ పోయి ఎండొచ్చింది.

సందులోకి చూస్తే ఎవురూ కనపడల్యా, అందురూ ఎండ తట్టుకోల్యాక ఎవురింట్లో వాళ్ళున్నారు.
ఆవులకి నీళ్ళు తాపిద్దామని అమీనా పశువుల కొట్టంలోకి పోయింది. అన్ని ఆవులు బానే ఉండాయి. ఒకే ఒక్క ఆవు మాత్రం ముడ్చుక్కోని పండుకుంది. దాని ముందర ఏసినే ఎండుగెడ్డి అట్లనే ఉంది. కొంచెం కూడా తినల్యా. ఆవుని అట్ల చూస్తానే పాణమంతా ఎట్లో అయింది అమీనాకి. గెడ్డి చేతిలోకి తీసుకోని తినిపించేకి చూసింది. ఆవు అమీనా తుక్కు చూసి చేతిలో ఉన్నే గెడ్డి తినింది.
హమ్మయ్య అనుకోని ఇంగ రొంత గెడ్డి తీస్కోని తినిపించింది. ఆవు కొంచేపు తిని మొగం పక్కకి తిప్పుకుంది. కడుగు నీళ్ళల్లో అన్నం, తౌడు కలిపి తీసుకొచ్చింది. అది గూడా రోంత తినింది. ఇంగ సాల్లే అనుకోని నీళ్ళు తాపిచ్చింది. నీళ్ళు తాగి పనుకుంది ఆవు.

‘‘ఎంతసేపు ఆ ఆవు దగ్గరే ఉంటావు, ఇంట్లో పని మీ నాయినొచ్చి చేస్తాడా?’’ ఇంట్లో నుండే
అరిసింది అమీనా వాళ్ళత్త హుసేన్‌ బీ.
ఇంకేం ఆలోచన చేయకుండా పరిగెత్తి ఇంట్లోకి పోయింది అమీనా. బట్టలు నానేసి, సామాన్లు కడిగేసి, ఇంట్లో మిగిలిండే పనులు చేసేసి కుచ్చుంది. కిటికీ లోనుండి ఆకాశం కనిపిస్తాంది. దూరంగా విండుమిల్లులు కనిపిస్తాన్నాయి. అవి తిరుగుతా ఉంటే వాటినే చూస్తా చూస్తా అమీనా ఆలోచనల్లో పడిపోయింది.
∙∙ 
అమీనాకి పెళ్ళై సంవత్సరం దాటింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. అమీనా మీద వాళ్ళత్తకున్న కోపానికి అది కూడా ఒక కారణం. సేద్యం చేసే కుటుంబం కావడంతో చిన్నప్పట్నుండి ఆవులు, గేదెలు, ఎద్దులు చూస్కుంట పెరిగింది. 
పదో తర్తి వరకు ముక్కీ మూలిగి సదివి ‘కాలేజీకి పోను’ అని చెప్పేసింది. ఇంట్లో పనులు చేసుకుంట, సేన్లో పనులు, పాలు పిండేది, పచ్చిగెడ్డి కోసుకొచ్చి పశువులకి పెట్టేది ఒకటని కాదు. ఇంట్లో వాళ్ళమ్మ చేసే ప్రతిపనీ అమీనా కూడా చేసేది.

ఒక అన్న, ఇద్దురు అక్కలు. అందరికీ పెళ్ళిళ్ళు అయినాయి. వయసులో అమీనా కంటే చానా పెద్దోళ్ళు కావడం మూలాన పెద్దగా మాట్లాడేది కాదు వాళ్ళతో. ఇంటిదగ్గర నేస్తులున్నా, వాళ్ళతో మాట్లాడేదీ తక్కువే. ఎప్పుడూ ఆవుల కొట్టంలోనే. వాటితోనే మాట్లాడేది. అవి తిరిగి మాట్లాడతాయని నమ్మేది. అన్నిటికంటే ఒక ఆవంటే రోంత ఎక్కువిష్టం అమీనాకి.
అమీనా వచ్చి పక్కన నిలబడకుంటే ఏం తినేది, తాగేది కాదా ఆవు. ఎవురన్న వచ్చి ‘‘ఇప్పుడంటే ఇట్లుంది. రేప్పొద్దున పెండ్లయి వేరే ఊరికి పోతే ఎట్లమ్మే?’’ అనడిగితే, ‘‘ఎట్ల ఏం ఎట్ల? నాతో పాటు దీన్ని కూడా తీసకపోతా’’ అనేది చానా మామూలుగా.

‘‘అట్లయితే పొలం, పశువులు ఉన్నే ఇంటికి, యాదో ఒక పల్లెటూరికి ఇయ్యబడ్తాది’’ అనేటోళ్ళు.
‘‘పుట్టిండేది పల్లెటూర్లోనే, పెరిగిండేది ఈడనే. ఇంగ పెళ్ళి చేస్కోని పొయ్యేది 
పల్లెటూరికైతేనేం?’’ అనేది.
‘‘కొంతమంది పొలం, పశువులు లేని ఇంటికి పోవల్ల అనుకుంటారు కదా, అట్ల అన్యాం లే’’ అనంటే, ‘‘నాకట్లాటివి ఏం లేవుబ్బా’’ అనేది.

ఒకనాడు బంధువుల్లో ఒకాయప్ప వచ్చి ‘‘తెలిసినోళ్ళ పిల్లోడుండాడు తలారి చెరువులో. కొండమింద ఉంటాది ఆ ఊరు. పొలాలున్నాయి, పక్కనే సిమెంటు ఫ్యాక్టరీలో ఉజ్జోగం కూడా ఉంది, చానా ఆవులు, గేదెలు ఉన్నాయి’’ అని చెప్పినాడు. పెద్దోళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళొచ్చి చూసి పోయినారు, వీళ్ళు పోయి చూసొచ్చినారు. పెళ్ళి ఖాయమైంది. ఆ కొండమిందే ఉన్న హాజివలి దర్గా ఉర్సుకి చానాసార్లు పొయ్యొచ్చింది అమీనా. అదే ఊరికి పెళ్ళి చేస్కోని కోడలి మాదిరి పొయ్యేదంటే భలే సంబరమైంది అమీనాకి. రెండు నెలలు తిరక్కతలికే పెళ్ళయిపోయింది.

అమీనా చెప్పినట్లే అత్తారింటికి పోతా పోతా ఆవుని కూడా పిల్చుకోని పోయింది. కొత్త పెళ్ళికూతురు కావడంతో పశువుల కొట్టం తుక్కు పంపీలేదు అమీనాని కొన్నిరోజులు. ఆవు తింటాందో లేదో అనే దిగులు. సరిగ్గా తినలేదు ఆవు.
కొన్నిరోజులకి సేన్లో పని, పశువులకి మేత వేసేది, పాలు పిండేది మొదులుపెట్టింది. ఆవు మాత్రం కొంచెం కొంచెమే తినేది. ‘ఎందుకుబ్బా’ అని ఆలోచించుకుంది అమీనా.
ఇంటిపనుల్లో, అత్త భయంతో తొందరగా గుర్తుకురాలేదు కానీ, మళ్ళా తెలిసింది అసలు సంగతి. పశువులకి పచ్చిగెడ్డే లేదని. ‘ఎందుకుబ్బా ఇట్లా?’ అనుకోని ఆ పొద్దు అట్లే ఉంది.
మరుసటి నా పొద్దు కొడవలి తీసుకోని పచ్చిగెడ్డి కోసరం పోయింది. ఇండ్లన్ని దాటుకొని సేన్ల వైపు నడిసింది. ఎక్కడే గానీ రోంత కూడా పచ్చిగెడ్డి కనపరాల్యా. ఒక్కో సేను దాటుకోని పోతాంది. శనగలు, కుసాలు, ఆముదం తప్పించి వేరే పంట లేదు. ఎంతదూరం పోయినా ఇదే కత.

విండు మిల్లులు దాటి పోయింది. అవి నిదానంగా తిరుగుతా ఉంటే వాటి తుక్కే చూసుకుంట నిలబడిపోయింది. తన జీవితం కూడా వాటి మాదిరే, అంత నిదానమైపోయినట్లు అనిపిస్తాంది. లోపలంతా ఏందో తెలియని నిస్సత్తువ. నడిసినంత దూరం నడిసి ఇంగ చేతకాక ఎనక్కి తిరిగింది. దర్గా దగ్గర నీడలో కొంచేపు కుచ్చుంది. ఉత్త చేతులతో ఇంటికొచ్చింది. ‘ఏందిబ్బా ఇంత తమాషా!’ అనుకుంది. ఇంట్లో అత్తని అడుగుదామనుకుంది. ఆయమ్మ మాట్లాడేది తక్కువా, అరిసేది ఎక్కువా అని మానుకుంది.
సాయంకాలమైనాక ఇంటి పక్కన ముసిలాయమ్మొచ్చి బయట అరుగు మింద కుచ్చుంది. కసువు నూకుదామని పరక తీస్కోని బయటికొచ్చిన అమీనాని చూసి ‘‘ఏం పాపా, ఎట్లున్నావు?’’ అని ఎచ్చరిచ్చింది.

‘‘బాగున్నా అవ్వా, నువ్వెట్లున్నావు?’’ అనడిగింది అమీనా.
‘‘ఊరు పొమ్మంటాంది, కాడు రమ్మంటాంది. అట్లనే బతుకుతాండా’’ అని చెప్పింది ముసిలాయమ్మ.
అమీనాకి నవ్వొచ్చింది కానీ ఆపుకోని ‘‘కాపీ తాగినావావ్వా?’’ అనడిగింది.
‘‘ఇంగా లేదుమ్మా, కాపీ మాటేం గానీ నువ్వు కొడవలి తీసుకోని యాడికో పోతివే పొద్దన. సేను కాడికా?’’ అనడిగింది ముసిలాయమ్మ.
‘‘అవునువ్వా, పశువులకి రోంత పచ్చిగెడ్డి ఏమన్నా దొరుకుతాదేమోనని పోతిని. యాడే గాని కనపరాల్యా’’ అని చెప్పింది కసువు నూక్కుంట.

ముసిలాయమ్మ నగింది. నోట్లో మిగిలినే నాలుగు పళ్ళు కనిపిచ్చేటట్లు నగింది.
‘‘ఏం వ్వా, అట్ల నగుతాన్నావ్‌?’’ అనడిగింది అమీనాకి అర్థంకాక.
‘‘ఈ ఊర్లో పచ్చిగెడ్డి యాడిది పాపా. ఎనభై ఏళ్ళయింది నేను పుట్టి. ఈ ఊర్లోనే పుట్టి, ఈడే పెండ్లి చేస్కోని కాపురం చేసినా. నా పిల్లోళ్ళ పిల్లోళ్ళు కూడా పెద్దగైనారు. ఈ పొద్దుటిదాంక పచ్చిగెడ్డి అనేదే పెట్టింది లేదు పశువులకి’’ అని చెప్పి ఆపింది.
ముసిలాయమ్మ ఏం చెప్తాందో అర్థం కాలేదు అమీనాకి.
మళ్ళా ముసిలాయమ్మే ‘‘మనూరు కొండమింద గదా ఉండేది. బోరుకి నీళ్ళు పడవు. పడినా తాగేకి సరిపోతాయి గానీ సేద్యానికి సాలవు’’ అని చెప్పింది.

దావెంబడి ఎంతసేపు నడిసినా శనగలు, కుసాలు, ఆముదాలే ఎందుకు కనపడినాయో అప్పుడర్థమైంది అమీనాకి.
‘‘ఈ మాటే తెలీదువ్వా నాకు’’ అనింది అమీనా.
‘‘తెలీక ఏం పాపా, కొండ మింద ఉన్నే ఊర్లో ఇట్లే ఉండేది.’’
‘‘ఏమో, మా ఆవు వట్టిగెడ్డి సరిగ్గా తినడం ల్యా. మా ఊర్లో పచ్చిగెడ్డి బాగలవాటు. అందుకే దొరుకుతాదేమో అని పోతిని’’ కసువు నూకేది అయిపోయింది.
‘‘యాడ పచ్చిగెడ్డిలే పాపా, పశువుల గురించి ఆలోచిస్తేనే పాపం అనిపిస్తాది. ఈ ఊర్లోని పశువులకి అసలు పచ్చిగెడ్డి అనేది ఒకటుంటాదని గూడా తెల్దు. శనగపొట్టు, సొప్ప, కడుగునీళ్ళల్లో అన్నం కలిపి పెట్టేది, పశువుల దాణా నీళ్ళల్లో కలిపి పెట్టేది – ఇవే తిండి. పాపం ఇవి తినే, పాలు ఇంతగా ఇస్తాన్నాయి. ఇంత ఆరోగ్గెంగా ఉంటాన్నాయి. ఇంగ పచ్చిగెడ్డి గనక దొరికితే ఇంగెన్ని పాలిస్తాయో, ఇంగెంత ఆరోగ్గెంగా ఉంటాయో...’’ అని చెప్తా పోతాంది ముసిలాయమ్మ.
కసువు దిబ్బలో పోసొచ్చి పక్కనే కుచ్చుంది అమీనా.

‘‘పెళ్ళికో, తిరుణాలకో వేరే ఊరు పోతే ఆడున్నే పశువులని చూసి ఇవి ఎంత అదృష్టం చేసుకున్నాయో అనుకుంటా. మనూరి పశువులు గుర్తుకొస్తాయి అప్పుడు. మనూరోళ్ళు ఎవురన్నా పశువులని కొండ కిందున్నే ఊర్లకి అమ్మితే పచ్చిగెడ్డి తిని బాగా బతుకుతాయిలే ఇంగ అనుకుంటారు. ఎంతో అవసరమయితే తప్ప వేరే ఊరి నుండి మనూరికి పిల్చుకోని రారు.
ఈడే పుట్టిండేటివి అయితే ఇట్లే అలవాటు పడతాయిలే. అట్లాటిది మీ ఊరి నుండి తెచ్చినావు పాపా ఈ ఆవుని. యాడ అలవాటైతాది?’’ అనడిగింది అమీనాని.

‘‘అదేవ్వా, నేను కూడా అదే అనుకుంటాన్నా నువ్వు చెప్తాంటే’’ అనింది అమీనా.
ముసిలాయమ్మ ముందుకి వంగి ‘‘అవు పాపా, మీయత్త బానే ఉంటాదా నీతో, గొడవలేం పడదా?’’ అనడిగింది గుసగుసలాడుతున్నట్లే.
అమీనా ఆ పక్కా, ఈ పక్కా చూసి ఎవరూ లేరని నిర్ధారించుకోని సన్నగా ‘‘ఏం చెప్పేదిలేవ్వా. చానా అద్మానం మనిషి. అన్నం ఎక్కువసేపు తింటే గొడవే. అందరికన్నా ముందే తిన్నా గొడవే. తిండిలేని చోటు నుండి చేసుకొచ్చుకున్యాం. అదీ ఇదీ అని ఎన్ని మాటలంటుందో’’ అని చెప్పింది.
‘‘అంటే అనుకోనీలే పాపా, నువ్వు ఆయమ్మ నోటికి తగలాకు. గొడవేస్కుందంటే ఇంగ అయిపాయ. పనికి పోయినే సాట ఆయమ్మని ఎచ్చరించల్లన్నా భయమే...’’ అని చెప్పి చిన్నగ అరుగు మింది నుండి లేసింది ముసిలాయమ్మ.
ఎట్లా పచ్చిగెడ్డి దొరకదని తెలిసినాక ఇంగ ఉండే వాటిల్లోనే ఆవు ఏమి బాగ తింటుందో చూసి కడుపు నిండా కాకపోయినా ఒకరకంగా తినేటట్టు ప్రయత్నిస్తాంది అమీనా.

అట్లనే ఆరు నెలలు గడిసిపోయినాయి. ఆవుకి ఇంగా అలవాటు కాలేదు ఊరు. అమీనాకి అప్పుడప్పుడే అలవాటయితాన్నాయి ఆ ఇల్లు, అత్త తిట్లు. ‘‘ఏమ్మా, ఏమన్నా విశేషమా?’’ అని అడిగేటోళ్ళు ఎక్కువైనారు. ఇంగా ఏమీ లేదు అని చెప్పేకి సాలయితాంది అమీనాకి. ఇంగో వైపు వాళ్ళత్త. కొంచేపు కుచ్చోని కనిపిస్తే సాలు యాదో ఒక పని చెప్తుంది. చేసేది కొంచెం ఆలస్యమైనా నోటికొచ్చిండేది తిడ్తుంది. ఆ తిట్టేది గూడా పని చేసేటప్పుడు కాక అన్నం తినేకి కుచ్చుంటానే మొదులుపెడ్తుంది. ఆ తిట్లు తినుకుంట అన్నం లోపలికి పోదు. చెయ్యి కడుక్కోని మళ్ళా పనిలో పడిపోతుంది అమీనా.

మొగునికి చెప్పి చూసింది, లాభం లేదు. పుట్టింట్లో వాళ్ళకి చెప్పి చూసింది. ‘‘మామూలేమ్మా ఇంగా, సర్దుకుపోవల్ల’’ అని చెప్పినారు. ఎవరికీ పట్టినట్టు అనిపించల్యా. ఇంగో పక్క ఆవు పరిస్థితి బాల్యాకుండా పోతాంది. జీవితమంతా ఎట్లో అనుకుంటే, ఇంగెట్లో పోతాన్నెట్లు అనిపిస్తాంది.
ఇంట్లో పని, సేన్లో పని, పశువుల పని ఈ మూడింటితోనే సరిపోతాంది. 
పెండ్లిగాకముందు కూడా చేసేది ఇవే పనులే అయినా ఏందో ఇప్పుడంతా మారిపోయినట్లు అనిపిస్తాంది. చుట్టూ యాడ చూసినా పచ్చటిపొలాలు కనపడే ఊరి నుండి వచ్చినే అమీనాకి ఆ సిమెంటు ఫ్యాక్టరీ, ఆ విండు మిల్లులు, గెడ్డి లేని సేన్లు చూస్తాంటే ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చి పడినానో అనిపిస్తాంది.

ఊర్లో ఉన్నెప్పుడు సేనుకి పోయి వస్తా వస్తా పెన్నేట్లో ఆడుకున్నేది గుర్తుకొస్తాది. సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు పచ్చిగెడ్డి మోపు తీసుకొచ్చి పశువులకి పెట్టేది గుర్తుకొస్తాది. టీవీ ఆన్‌ చేస్కోని తట్టలో అన్నం, పప్పు, చెనిక్కాయల పొడి, నెయ్యి పెట్టుకోని టీవీ చూస్కుంట ఎంచేపు కావల్సింటే అంచేపు తినేది గుర్తుకొస్తాది. కాపీ చేస్కోని లోటాలో ఏస్కోని బయట అరుగుమింద కుచ్చోని తాగేది గుర్తుకొస్తాది.
మళ్ళా ఇంతకుముందు మాదిరి ఎప్పుటికైనా అయితాదా అని ఆలోచించీ, ఆలోచించీ ఒక నిర్ణయానికొచ్చింది. తనకెట్లా తప్పదు. యాదో ఒకరోజు తనకి నచ్చినట్లు మార్చుకోనీకి ప్రయత్నించల్ల.
అప్పుటిదాకా ఇట్లనే. కానీ ఆవెందుకు ఆకలికి ఉండల్ల. దాని తిండిని, దాని ఆరోగ్యాన్ని నా మూలాన ఎందుకు దూరం చేయల్ల అనుకుంది.

పుట్టింటోళ్ళని పిలిపిచ్చింది. ఆవుని తీస్కోపొమ్మని చెప్పింది. ఒకనాడు లగేజ్‌ ఆటో తెచ్చి ఆవుని తీసకపోయినారు పుట్టింటోళ్ళు. చానా బాధ పడతానే పంపింది. ఆవు పోనంటే పోనని మొండికేసి పోయింది.
ఆరోజంతా ఏడూస్తానే పండుకుంది అమీనా. మళ్ళా ఇంటికి పోన్‌ చేసి ‘ఆవెట్లుంది, బాగా తింటాంద్యా లేదా’ అనడిగింది. ‘బాగా తింటాంది, ఇప్పుడు బాగుంది’ అని చెప్తే సంబరపడిపోయింది.
ఆవిప్పుడు కడుపు నిండా తింటాంది, అమీనా తినేది ఎప్పుడో..!?

- మొహమ్మద్‌ గౌస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement