నకిలీ వారసుడు! తల్లి అనుమానమే నిజమైంది! | Fake Son Lived As Heir For 41 Years Court Exposes Fraud | Sakshi
Sakshi News home page

నకిలీ వారసుడు! తల్లి అనుమానమే నిజమైంది!

Aug 2 2026 8:09 AM | Updated on Aug 2 2026 9:43 AM

Fake Son Lived As Heir For 41 Years Court Exposes Fraud

లీగలాటా

‘కావమ్మ మొగుడు... కావమ్మ మొగుడు అని అందరూ అంటుంటే... కామోసనుకున్నాను నాకేం తెలుసు’ అన్నాడట ఒకడు. అలా అందరూ ‘అతడు తప్పిపోయిన మీ కొడుకే, అచ్చం అలాగే ఉన్నాడ’ని చెప్పడంతో వృద్ధాప్యంలో ఉన్న ఆ తండ్రి నిజమే అని నమ్మాడు. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కొడుకు తిరిగొచ్చాడని, ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. కానీ, కన్నపేగు కదా! ఆ తల్లి ఆ వ్యక్తిని తన కొడుకుగా అంగీకరించలేకపోయింది. అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు కోర్టుకు చేరింది. 41 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి ఎవరో తేలింది.

‘వారసుడొచ్చాడు’ సినిమాలో వెంకటేష్‌లా, ‘అతడు’లో మహేష్‌బాబులా... కొడుకుగా ఆ వ్యక్తి మరొకరి ఇంటికెళ్లాడు. ఆ సినిమాల్లో హీరోలు ఆ కుటుంబాలను నిలబెట్టేందుకు వారసులుగా వెళ్లారు. కానీ ఈ వ్యక్తి ఆస్తులు కొట్టేసి, విలాసంగా జీవించేందుకు నకిలీ వారసుడిగా ఆ ఇంట అడుగుపెట్టాడు. అయితే నిజం నిలకడమీద తెలిసింది. అతని మోసం బట్టబయలైంది. ఆ తల్లి నమ్మకమే నిజమని రుజువైంది.

బీహార్‌లోని నలందా జిల్లా ముర్గావస్‌ గ్రామానికి చెందిన కామేశ్వర్‌ సింగ్‌ ఓ భూస్వామి. 1977లో అతని ఏకైక కుమారుడు కన్హయ్య పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఎంతగా గాలించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి జాడ తెలియలేదు. చివరికి కామేశ్వర్‌ సింగ్‌ ఓ మంత్రగాడిని కలిశాడు. కొడుకు ఆచూకీ కోసం ఆరా తీశాడు. ‘మీ కొడుకు బతికే ఉన్నాడు. త్వరలోనే తిరిగొస్తాడ’ని అతడు చెప్పాడు. కానీ ఏళ్లు గడుస్తున్నా కొడుకు తిరిగి రాలేదు. ఆ బెంగతో కామేశ్వర్‌ ఆరోగ్యం క్షీణించింది. అయితే తన కొడుకు తిరిగొస్తాడనే ఆశ చావలేదు. కన్హయ్య తప్పిపోయిన నాలుగేళ్లకు అతడి ఊరికి సమీపంలోని ఓ గ్రామానికి ఓ యువకుడు కాషాయ వస్త్రాలు ధరించి వచ్చాడు. తాను ముర్గావస్‌ గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి కుమారుడిగా చెప్పాడు. దీంతో ఆ గ్రామస్థులు అతడే కన్హయ్య అని భావించారు. ఆ విషయాన్ని కామేశ్వర్‌సింగ్‌కు చెప్పారు. ‘వయోభారంతో నా చూపు మందగించింది. అతడ్ని సరిగా గుర్తించలేకపోతున్నాను. మీరందరూ నాకొడుకే అని చెబుతున్నారు కాబట్టి మిమ్మల్ని నమ్మి అతడ్ని నా ఇంటికి తీసుకెళ్తున్నా’ అని చెప్పాడు.

అంగీకరించని తల్లి..
తన కుమార్తె ఇంటి దగ్గర ఉన్న కామేశ్వర్‌ సింగ్‌ భార్య రామ్‌సఖీదేవికి కుమారుడు తిరిగొచ్చాడనే విషయం తెలిసింది. ఆ వ్యక్తిని చూసి తమ కుమారుడు కాదని స్పష్టంగా చెప్పింది. అయితే అతడు వచ్చిన తర్వాత నుంచి తన భర్త ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో కొంతకాలం వేచి చూసింది. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమారుడి తల ఎడమ వైపున గాయం గుర్తు ఉండేదని, ఈ యువకుడి తలపై అలాంటి గుర్తులేవీ కనిపించడం లేదని తెలిపింది. తమ బంధువులు, ఉపాధ్యాయుల్ని సైతం ఆ వ్యక్తి గుర్తించలేదని పేర్కొంది. తమ కుమారుడి వేషంలో వచ్చిన అతడు ఓ మోసగాడని తేల్చి చెప్పింది.

నాలుగు దశాబ్దాలు అదే కుటుంబంలో
తల్లి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. నెల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చాడు. తానే కన్హయ్యను అంటూ తిరిగి అదే ఇంటికి వెళ్లాడు. తండ్రి అతడ్ని నమ్మి ఇంట్లోనే ఉంచుకున్నాడు. అక్కడే ఉంటూ క్రమంగా ఆ కుటుంబంలో సభ్యుడిగా మారాడు. కన్హయ్య పేరుతో గుర్తింపు కార్డులు పొందాడు. డిగ్రీ పూర్తి చేశాడు. వివాహం చేసుకున్నాడు. నాలుగు దశాబ్దాల పాటు నకిలీ గుర్తింపుతో కొనసాగాడు. ఈలోగా భూస్వామికి చెందిన కొంత భూమిని సైతం విక్రయించాడు.

చివరికి మిస్టరీ వీడింది
దయానంద్‌ గోసాయి పేరుతో జముయి జిల్లాలోని అతడి స్వగ్రామం చిరునామాతో ఉన్న ఓ లేఖ పోలీసులకు లభించింది. పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి విచారించారు. అతడి ఫొటో చూసిన కొందరు గ్రామస్థులు అతడు దయానంద్‌ గోసాయిగా గుర్తించారు. దీంతో అతడు దయానంద్‌ పేరుతో మరణ ధ్రువపత్రాన్ని సృష్టించాడు. అందులో 1982లో మరణించినట్టు నమోదు చేశారు. అయితే డెత్‌ సర్టిఫికెట్‌ 2014లో జారీ చేశారు. 32 ఏళ్ల తర్వాత జారీ చేయడంతో కోర్టు పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనికి తోడు కన్హయ్య పేరుతో జారీ అయిన గుర్తింపు పత్రాల్లోనూ పుట్టిన తేదీ వేర్వేరుగా ఉండడాన్ని కోర్టు గుర్తించింది.

డీఎన్‌ఏ పరీక్షలకూ నిరాకరణ
కామేశ్వర్‌ సింగ్‌ కుటుంబ వారసుడా? కాదా? అని తేల్చేందుకు ఆధారమైన డీఎన్‌ఏ పరీక్షకు సైతం అతడు నిరాకరించాడు. తానే కన్హయ్య అని నిరూపించుకునేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ అతడు ఉపయోగించుకోలేదు. వీటన్నిటినీ పరిశీలించిన కోర్టు అతడు కన్హయ్య సింగ్‌ కాదు దయానంద్‌ గోసాయి అని నిర్ధారించింది. ట్రయల్‌ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఐపీసీ సెక్షన్‌ 419 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్‌ 420 కింద మూడేళ్లు, ఐపీసీ సెక్షన్‌ 120 బి కింద ఆరు నెలలు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. 2022లో ఈ తీర్పు వెలువడింది. అప్పటికే ఆ తల్లిదండ్రులిరువురూ మృతి చెందారు. అయితే అసలు కన్హయ్య ఏమయ్యాడనే మిస్టరీ మాత్రం వీడలేదు.

- దిలీప్‌ మాదిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement