కరీబియన్‌ వేడుక... కెనడా వేదిక | Toronto Caribbean Carnival Grand Parade 2026 Funday Special Story | Sakshi
Sakshi News home page

కరీబియన్‌ వేడుక... కెనడా వేదిక

Aug 2 2026 9:19 AM | Updated on Aug 2 2026 9:19 AM

Toronto Caribbean Carnival Grand Parade 2026 Funday Special Story

అగడం.. బగడం..

ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద కరీబియన్‌ సాంస్కృతిక వేడుకకు కెనడాలోని టొరంటో నగరం వేదికగా నిలుస్తోంది. ‘టొరంటో కరీబియన్‌ కార్నివాల్‌’ ఈ ఏడాది 59వ వసంతంలోకి అడుగుపెట్టింది.

ఈ వేడుకల్లో అత్యంత కీలకమైన గ్రాండ్‌ పరేడ్‌ ఆగస్టు ఒకటిన టొరంటో ఎగ్జిబిషన్‌ ప్లేస్‌లో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైంది. కరీబియన్‌ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ వేడుకలను తిలకించడానికి దేశ విదేశాల నుంచి ఇప్పటికే లక్షలాది మంది పర్యాటకులు టొరంటోకు చేరుకున్నారు.

ఆకట్టుకునే సాంస్కృతిక ప్రదర్శనలు..
ప్రస్తుతం ఈ కార్నివాల్‌లో భాగంగా కంటికిఇంపుగా సాగే భారీ పరేడ్‌లు, సంగీత పోటీలు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీబియన్‌ దీవుల నుంచి వచ్చిన కళాకారుల సంగీత హోరు, రంగురంగుల దుస్తులలో నృత్యాలు చేస్తూ సాగే పరేడ్‌లు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఒకనాడు చిన్నగా ప్రారంభమైన ఈ పండుగ, నేడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవాల్లో ఒకటిగా ఎదిగి, టొరంటో నగర వైభవాన్ని ప్రపంచానికి చాటుతోంది.

టొరంటో ఆర్థిక వ్యవస్థకు ఏటా అర బిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయాన్ని అందించే ఈ కరీబియన్‌ కార్నివాల్‌ ఉత్సవ ప్రస్థానం 1967లో ప్రారంభమైంది. కెనడా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా, అక్కడ నివసిస్తున్న కరీబియన్‌ సమాజం తమ సాంస్కృతిక మూలాలను చాటుకోవడానికి 1967లో ‘కరిబానా’ పేరుతో ఈ వేడుకను మొదటిసారిగా ప్రారంభించింది. నాటి యోంగ్‌ స్ట్రీట్‌లో జరిగిన తొలి పరేడ్‌లో దాదాపు యాభైవేల మంది పాల్గొన్నారు. కెనడాకు కరీబియన్‌ ప్రజలు అందించిన ఈ బహుమతే, కాలక్రమేణా నేటి భారీ అంతర్జాతీయ ఉత్సవానికి బలమైన పునాదిగా మారింది.

కరీబియన్‌ ప్రాంతంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ వేడుక ‘కరీబానా’ పేరుతో మొదలైంది. తరువాతి కాలంలో ఈ పేరును ‘టొరంటో కరీబియన్‌ కార్నివాల్‌‘గా మార్చారు. కెనడాలో స్థిరపడిన కరీబియన్‌ ప్రజల సాంస్కృతిక పరిరక్షణకు, వారి ఆర్థిక స్వావలంబనకు ఈ వేడుక ఒక అద్భుతమైన వేదికగా నిలుస్తోంది.
- రమా జంబుల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement