అమెరికాకు ఇరాన్ వార్నింగ్: మరో దాడి చేస్తే.. | Iran Warns US of Proportionate Response Amid Escalating Middle East Tensions | Sakshi
Sakshi News home page

అమెరికాకు ఇరాన్ వార్నింగ్: మరో దాడి చేస్తే..

Aug 2 2026 7:51 AM | Updated on Aug 2 2026 7:51 AM

Iran Warns US of Proportionate Response Amid Escalating Middle East Tensions

టెహ్రాన్‌: అమెరికా మరోసారి సైనిక దాడికి పాల్పడితే తీవ్రంగా స్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణమైనా నిర్ణయాత్మక బదులిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ వైపు నుంచి వ్యూహాత్మక ప్రాంతాలపైకి ప్రయోగించిన శత్రు డ్రోన్లను కూల్చివేశామని కువైట్ సైన్యం ప్రకటించిన కొద్ది గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. టెహ్రాన్‌తో చర్చలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత ఈ హెచ్చరిక వెలువడింది. అవసరమైతే అమెరికా మరోసారి దాడులకు దిగుతుందని, తమపై ఒత్తిడి తెస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్‌లతో వేర్వేరుగా టెలిఫోన్ ద్వారా సంభాషించారు. అమెరికా దురాక్రమణకు పాల్పడితే గట్టిగా స్పందిస్తామని పాక్, టర్కీ అధికారులకు ఆయన తెలిపారు. సౌదీ విదేశాంగ మంత్రితో మాట్లాడుతూ.. అమెరికా లేదా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

కువైట్‌లో కూల్చివేసిన డ్రోన్ల అవశేషాలు ఉత్తర కువైట్‌లోని ప్రభుత్వ భవనం, బుబియాన్ ద్వీపంలోని ఆస్తులను ధ్వంసం చేశాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఇరాన్ భద్రతా సంస్థకు చెందిన మీడియా సంస్థ ఒక హెచ్చరిక జారీ చేస్తూ, అమెరికా కనుక ఇరాన్ ఇంధన సౌకర్యాలపై దాడి చేస్తే, సౌదీ అరేబియా, యూఏఈలోని చమురు కేంద్రాలు, ఖతార్, ఇజ్రాయెల్‌లోని గ్యాస్ క్షేత్రాలపై ప్రతీకార దాడులు జరుపుతామని, అన్నీ బూడిదవుతాయని పేర్కొంది.

ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. జూలైలో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 24 శాతం పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో భద్రతా ఆందోళనల కారణంగా వాణిజ్య నౌకల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. మరోవైపు ఒమన్ తీరంలో రెండు వేర్వేరు సముద్ర ఘటనలు చోటుచేసుకున్నట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ఎవరెస్ట్ ‘డెత్ జోన్’లో అసలేం జరుగుతుంది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement