వీసా కోసం రూ.19 లక్షల బాండ్.. జాబితాలో 50 దేశాలు! | US Makes Visa Bond Program Permanent For 50 Countries | Sakshi
Sakshi News home page

వీసా కోసం రూ.19 లక్షల బాండ్.. జాబితాలో 50 దేశాలు!

Aug 1 2026 2:50 PM | Updated on Aug 1 2026 3:19 PM

US Makes Visa Bond Program Permanent For 50 Countries

అమెరికా ప్రభుత్వం.. వీసాలకు సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇదివరకు ప్రయోగాత్మకంగా అమలు చేసిన 'వీసా బాండ్ ప్రోగ్రామ్'ను.. ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త విధానం ప్రకారం.. కొన్ని దేశాల పౌరులు అమెరికాకు వెళ్లేందుకు బిజినెస్ లేదా టూరిస్ట్ వీసా కోసం దరఖాస్తు చేసినప్పుడు, అవసరమైతే 20,000 డాలర్ల (రూ.19 లక్షల కంటే ఎక్కువ) వరకు బాండ్‌ను సమర్పించాల్సి రావచ్చు.

ఈ విధానం ప్రస్తుతం 50 దేశాల పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. వీటిలో ఎక్కువ దేశాలు ఆఫ్రికా ఖండానికి చెందినవే. కాగా.. ఈ జాబితాలో బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ వంటి దేశాలు కూడా ఉన్నాయి. అయితే.. జాబితాలో ప్రస్తుతం భారత్ పేరు లేదు. భవిష్యత్తులో మరిన్ని దేశాలను చేర్చే అవకాశం ఉందని అమెరికా ప్రభుత్వం తెలిపింది.

ఈ నిబంధన B-1 (వ్యాపార ప్రయాణం), B-2 (పర్యాటక ప్రయాణం) వీసాలకు వర్తిస్తుంది. వీసా మంజూరు చేసే కాన్సులర్ అధికారి, దరఖాస్తుదారుని వివరాలను పరిశీలించి తరువాత బాండ్ అవసరమా?, కాదా?.. అనే నిర్ణయం తీసుకుంటారు. దీన్నిబట్టి చూస్తే.. ప్రతి ఒక్కరూ బాండ్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అమెరికాలో అక్రమంగా ఉండే వారి సంఖ్యను తగ్గించడమే. గతంలో.. ఈ పథకాన్ని ఒక సంవత్సరం పాటు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఇప్పుడు శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించారు.

వీసా బాండ్ కార్యక్రమాన్ని శాశ్వతం చేయడంపై పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు. వలస హక్కుల కోసం పనిచేసే సంస్థలు, ఇంత పెద్ద మొత్తంలో బాండ్ చెల్లించడం సాధారణ ప్రజలకు భారంగా మారుతుందని అంటున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులను కలవడానికి లేదా పర్యాటకంగా అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఇది అదనపు ఆర్థిక భారం అవుతుందని చెబుతున్నారు.

 ఇదీ చదవండి: చెప్పిందే జరుగుతోంది.. కియోసాకి హెచ్చరిక!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement