EPF పెన్షన్‌.. టెన్షన్‌! | EPFO Pension Delay July Pension Payments Delayed Lakhs Pensioners Worried | Sakshi
Sakshi News home page

EPF పెన్షన్‌.. టెన్షన్‌!

Aug 1 2026 2:17 PM | Updated on Aug 1 2026 2:40 PM

EPFO Pension Delay July Pension Payments Delayed Lakhs Pensioners Worried

సాక్షి, హైదరాబాద్‌: పెన్షనర్లకు ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) షాకిచ్చింది. ప్రతి నెలా చివరి రోజు కంటే రెండ్రోజుల ముందే (28, 29వ తేదీ) ఇచ్చే పెన్షన్‌ డబ్బులు...జూలై నెల గడిచినా జాడలేకపోవడంతో పెన్షనర్లలో తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో శుక్రవారం (జూలై 31) ఈపీఎఫ్‌ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున పెన్షనర్లు ప్రత్యక్షమయ్యారు. పెన్షన్‌ డబ్బులు రాకపోవడంపై ఆరా తీశారు. అయితే అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడం వారిని మరింత ఆందోళనకు గురి చేసింది.

కాగా, ఈపీఎఫ్‌ఓ తాజాగా నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచి్చంది. ఇందులో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో కొన్ని కార్యక్రమాలకు అవాంతరం ఏర్పడడంతో పెన్షన్‌ చెల్లింపుల్లో జాప్యం జరిగి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ దీన్ని అధికారికంగా ధుృవీకరించడం లేదు. దేశవ్యాప్తంగా 82.11లక్షల మంది పెన్షనర్లున్నారు. తాజాగా నెలకొన్న సాంకేతిక సమస్యలతో వీరందరికీ పెన్షన్‌ అందలేదని తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లలో అత్యధికంగా తెలంగాణ రీజియన్‌ పరిధిలో దాదాపు 8 లక్షల మంది ఉన్నారు. ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లకు ప్రతి నెలా అందే పెన్షన్‌ అత్యంత పరిమితమే. రూ.1500 నుంచి సర్వీసుకు తగినట్లు రూ.7వేల వరకు గరిష్టంగా అందుతుంది. నెలవారీ వ్యక్తిగత ఖర్చులు, మందుల కొనుగోలు, ఇతరత్రా చిన్న అవసరాలకు ఈ డబ్బుల మీదే ఆధారపడుతుంటారు.

తాజాగా జూలై నెల పెన్షన్‌ డబ్బులు అందకపోవడంతో వారంతా ఒక్కసారిగా అయోమయంలో పడ్డారు. ఎప్పటిలోగా చెల్లింపులు చేస్తారనే స్పష్టత లేకపోవడంతో పెన్షనర్లు తీవ్ర గందరగోళంలో పడ్డారు. తక్షణమే పెన్షన్‌ డబ్బులు విడుదల చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈపీఎఫ్‌ఓ తగిన చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement