ఈపీఎఫ్‌ వడ్డీ డబ్బులు వచ్చేశాయ్‌.. చెక్ చేసుకోండి | EPF Interest Credited FY 2025-26 - Check PF Account balance in UMANG | Sakshi
Sakshi News home page

EPFO Interest: ఈపీఎఫ్‌ వడ్డీ డబ్బులు వచ్చేశాయ్‌.. చెక్ చేసుకోండి

Jul 25 2026 2:15 PM | Updated on Jul 25 2026 3:14 PM

EPF Interest Credited FY 2025-26 - Check PF Account balance in UMANG

ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన 8.25 శాతం వడ్డీని సభ్యుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది. జూలై 15 నుంచి దేశవ్యాప్తంగా పలువురు సభ్యుల పాస్‌బుక్‌లలో వడ్డీ ఎంట్రీలు కనిపిస్తున్నాయి. ఈసారి కొత్త కేంద్రీకృత ఐటీ వ్యవస్థ (CITES) అమల్లోకి రావడంతో గత సంవత్సరాలతో పోలిస్తే వడ్డీ జమ ప్రక్రియ వేగంగా పూర్తవుతోంది.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపిన వివరాల ప్రకారం, సుమారు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో రూ.1.44 లక్షల కోట్లకు పైగా వడ్డీ జమ అవుతోంది. ప్రభుత్వం 8.25 శాతం వడ్డీ రేటును అధికారికంగా నోటిఫై చేసిన అనంతరం ఈ ప్రక్రియను ఆటోమేటిక్‌గా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ఈసారి డిజిటల్ అప్‌గ్రేడ్ కారణంగా సభ్యులు సాధారణంగా సెప్టెంబర్–అక్టోబర్ వరకు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా జూలైలోనే వడ్డీ జమ కావడం విశేషం.

EPFO వడ్డీ పడిందో లేదో.. ఎలా చెక్ చేయాలి?

EPFO పోర్టల్‌ ద్వారా..
సభ్యులు EPFO పాస్‌బుక్ పోర్టల్‌లో తమ UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి సంబంధిత మెంబర్ ఐడీని ఎంచుకుంటే తాజా వడ్డీ ఎంట్రీని చూడొచ్చు. పాస్‌బుక్‌లో ఉద్యోగి వాటా, యజమాని వాటా, జమ అయిన వడ్డీ వివరాలు కనిపిస్తాయి. ఇందుకోసం UAN యాక్టివ్‌గా ఉండటంతో పాటు మొబైల్ నంబర్‌కు లింక్ అయి ఉండాలి.

UMANG యాప్ ద్వారా..
పాస్‌బుక్ పోర్టల్‌తో పాటు సభ్యులు  UMANG యాప్ ద్వారా కూడా వడ్డీ వివరాలు తెలుసుకోవచ్చు. ముందుగా మీ మొబైల్‌లో ఉమాంగ్‌ యాప్‌ లేకపోతే ప్లేస్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోండి. తర్వాత యాప్‌ ఓపెన్‌ చేసి EPFO ​​serviceను ఎంచుకోండి. ఇక్కడ View Passbook ఆప్షన్‌ను సెలెక్ట్‌ చేయండి. ఇప్పుడు మీ UAN ఎంటర్‌ చేసి ఓటీపీతో లాగిన్‌ అవ్వండి. అనంతరం మీ ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇక్కడ కనిపిస్తుంది.

మిస్డ్‌ కాల్‌, SMS ద్వారా PF బ్యాలెన్స్
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కు EPFOHO UAN (మీ UAN నంబర్‌) SMS పంపినా, లేదా 9966044425కు మిస్డ్ కాల్ ఇచ్చినా ఖాతా వివరాలు SMS రూపంలో అందుతాయి. అయితే ఈ సేవలు ఉపయోగించాలంటే UAN ఆధార్, బ్యాంక్ లేదా పాన్‌తో అనుసంధానమై ఉండాలి.

EPFO వడ్డీ కనిపించకపోతే ఆందోళన వద్దు..
EPFO అన్ని ఖాతాల్లో ఒకేసారి వడ్డీ జమ చేయదు. దశలవారీగా ఎంట్రీలు అప్‌డేట్ అవుతాయి. కాబట్టి కొంతమంది సభ్యుల పాస్‌బుక్‌లలో వడ్డీ ఆలస్యంగా కనిపించే అవకాశం ఉంది. వడ్డీ కనిపించకపోయినా సభ్యులకు నష్టం ఉండదు. అర్హత ఉన్న మొత్తానికి వడ్డీ పూర్తిగా జమ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత కూడా అప్‌డేట్ కాకపోతే EPFiGMS పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు లేదా సమీప EPFO కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement