సాంకేతిక నేపథ్యం లేదు.. చేతిలో ఐఐటీ, ఎన్‌ఐటీల డిగ్రీలు లేవు.. కంపెనీ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌ల నుంచి వరుస నిరాకరణలు.. కుటుంబ సభ్యుల్లో నిరాశ, భవిష్యత్తుపై తీవ్ర భయాందోళనలు. అయినా సరే పట్టుదల వీడకుండా పోరాడి, కేవలం రెండేళ్ల వ్యవధిలోనే నెలకు రూ.25,000 జీతం నుంచి ఏకంగా రూ.22 లక్షల వార్షిక వేతనానికి ఎదిగిన ఓ 24 ఏళ్ల యువకుడి కథనం ఇప్పుడు సోషల్ మీడియా, కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎంబీఏ నుంచి డేటా సైన్స్ వైపు
2022లో ఒక సాధారణ కళాశాల నుంచి బీబీఏ పూర్తి చేసిన సదరు యువకుడు క్యాట్ (సీఏటీ) రాసి మంచి మేనేజ్‌మెంట్ కళాశాలలో సీటు సాధించడానికి ఏళ్ల సమయం పడుతుందని గ్రహించాడు. సమయం వృథా చేయకూడదనే ఉద్దేశంతో తన మార్గాన్ని డేటా సైన్స్ వైపు మళ్లించాడు. నాన్-టెక్ బ్యాక్‌గ్రౌండ్ అయినప్పటికీ యూట్యూబ్, కొన్ని వంటి డిజిటల్ వేదికల ద్వారా దాదాపు ఏడాదిన్నర పాటు స్వయంగా కోడింగ్, డేటా ఎనలిటిక్స్ నేర్చుకున్నాడు. స్నేహితులు ఉన్నత ఉద్యోగాలు, పైచదువుల కోసం విదేశాలకు వెళ్తున్న సమయంలో తాను మాత్రం గదికే పరిమితమై, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతూనే నైపుణ్యాలను పెంపొందించుకున్నాడు.
700 దరఖాస్తులు.. ఉద్యోగ సంక్షోభం
టెక్ డిగ్రీ, అనుభవం లేదన్న కారణంతో 90 శాతానికి పైగా హెచ్‌ఆర్‌లు అతడి ప్రొఫైల్‌ను తిరస్కరించారు. దాదాపు 700కు పైగా కంపెనీలకు దరఖాస్తు చేసుకున్నాక నెలకు రూ.25,000 జీతంతో ఒక స్టార్టప్‌లో తొలి ఉద్యోగం లభించింది. అయితే, ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. మూడు నెలలకే కంపెనీలో ప్రాజెక్టులు లేక ఉద్యోగం పోయింది. రెండు నెలల జీతం కూడా బకాయి పడింది. ఆ విషయాన్ని ఇంట్లో చెప్పకుండా ధైర్యంతో మళ్లీ లింక్డ్‌ఇన్‌లో దరఖాస్తులు చేస్తూ నాలుగు నెలల తర్వాత రూ.6 లక్షల ప్యాకేజీతో మరో ఉద్యోగం సాధించాడు.
ఆ కంపెనీలో 1.7 ఏళ్లు పనిచేస్తూ సమాంతరంగా నైపుణ్యాలను మరింత పదును పెట్టుకున్న అతడు తాజాగా ఒక ప్రముఖ అమెరికన్ ఎంఎన్‌సీలో రూ.22 లక్షల వేతనంతో ఆఫర్ లెటర్ సాధించాడు. డిగ్రీల కంటే నిరంతర నైపుణ్యాభివృద్ధి, మానసిక స్థిరత్వం ఉన్నవారికి నేటి డిజిటల్ యుగంలో ఆకాశమే హద్దు అని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: ఒక్క బ్యాంకూ లోన్ ఇవ్వకపోయినా ‘డీటీడీసీ’ ఎలా సాధ్యమైందంటే..


