న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ దిగ్గజం మణిపాల్ హెల్త్ ఎంటర్‌ప్రైజెస్ మెగా పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)కు రంగం సిద్ధమైంది. ఈ ఇష్యూకు షేరు ధరల శ్రేణిని రూ.560–590గా కంపెనీ నిర్ణయించింది. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువ రూ.77,600 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ నెల 29న ప్రారంభం కానున్న ఈ ఆఫర్ 31న ముగుస్తుంది. రూ.9,275 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. ఇందులో భాగంగా రూ. 8,000 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుండగా.. సంస్థలోని ప్రస్తుత వాటాదారులు ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) రూపంలో మరో 2.16 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.
మణిపాల్ హెల్త్ సమీకరించనున్న నిధుల్లో రూ.5,378 కోట్లను సబ్సిడరీ మణిపాల్ హాస్పిటల్స్‌కు చెందిన రుణ చెల్లింపుల కోసం, రూ.574 కోట్లను మరో సబ్సిడరీ సహ్యాద్రి హాస్పిటల్స్‌లో మైనారిటీ వాటా కొనుగోలు కోసం, ఇతర కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. దేశవ్యాప్తంగా 49 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్స్ (13,000 బెడ్స్) కలిగిన మణిపాల్ హెల్త్.. 2025 సెపె్టంబర్ 30తో ముగిసిన ఆరు నెలలకు రూ.4,713 కోట్ల ఆదాయంపై రూ. 572 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
3–4 ఏళ్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడి
హాస్పిటల్స్ నెట్‌వర్క్ విస్తరణ కోసం వచ్చే 3–4 ఏళ్లలో రూ.3,560 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు మణిపాల్ హెల్త్ ఎండీ, సీఈఓ దిలీప్ జోస్ చెప్పారు. కొత్త ప్రాజెక్టులతో పాటు ప్రస్తుత హాస్పిటల్స్ విస్తరణ ద్వారా మరో మూడేళ్లలో 3000 బెడ్స్ అదనంగా జతయ్యే అవకాశం ఉందన్నారు. విస్తరణలో భాగంగా కేరళ, హైదరాబాద్, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లో ఆసుపత్రుల కొనుగోలుకు సిద్ధమేనని కూడా జోస్ వెల్లడించారు.


