దేశంలోని ప్రముఖ ఐఐటీల విద్యార్థులకు కేవలం రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కే రూ.67 లక్షల సీటీసీ (Gross CTC) ఆఫర్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ నియామక ప్రకటన తీవ్ర చర్చకు దారితీసింది. రెడిట్‌లోని r/Btechtards ఫోరం, ఎక్స్ (X) వేదికలపై విస్తృతంగా షేర్ అవుతున్న ఈ స్క్రీన్‌షాట్ నిజమా? కాదా? అనే అంశంపై విద్యార్థులు, టెక్ నిపుణులు పెద్దఎత్తున చర్చిస్తున్నారు.
వైరల్ పోస్టు ప్రకారం.. హర్యానాలోని గురుగ్రామ్‌లో క్వాంటిటేటివ్ స్ట్రాటజిస్ట్ ఇంటర్న్ పోస్టులకు ప్రీ-ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. ఇందులో నెలకు రూ.30 లక్షల స్టైపెండ్, రెండు నెలల ఇంటర్న్‌షిప్‌కు మొత్తం రూ.67 లక్షల గ్రాస్ సీటీసీ పేర్కొన్నట్లు కనిపిస్తోంది. బీఎస్-ఎంఎస్ (మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్), బీటెక్ (సీఎస్‌ఈ, ఈఈ, డీఎస్‌ఏఐ, ఈసీఈ తదితర విభాగాలు) చదువుతున్న, కనీసం 8.5 సీజీపీఏ ఉన్న విద్యార్థులు అర్హులని పోస్టులో పేర్కొన్నారు.
అయితే వైరల్ స్క్రీన్‌షాట్‌లో సంస్థ పేరు స్పష్టంగా లేకపోయినా, పలువురు నెటిజన్లు ఇది గురుగ్రామ్‌కు చెందిన ప్రముఖ క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ ‘క్వాడెయీ’ (Quadeye)కు సంబంధించినదై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. దీనికి కారణం, ఆ సంస్థ అధికారిక కెరీర్ పేజీలో ప్రస్తుతం ఇంటర్న్- క్వాంట్ స్ట్రాటజిస్ట్ పోస్టుకు నియామకాలు కొనసాగుతుండటమే. అయితే అక్కడ ఇంటర్న్‌షిప్ స్టైపెండ్ వివరాలు వెల్లడించలేదు. పూర్తి స్థాయి ఉద్యోగంగా ఎంపికైతే కనీసం రూ.93 లక్షల వార్షిక వేతనం (CTC) ఉంటుందని మాత్రమే పేర్కొంది.
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఇది అగ్రశ్రేణి హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ (HFT), క్వాంట్ ట్రేడింగ్ సంస్థల్లో అసాధారణం కాదని చెబుతుండగా, మరికొందరు వైరల్ స్క్రీన్‌షాట్‌లోని గణాంకాలను స్వతంత్రంగా నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రూ.67 లక్షల ఇంటర్న్‌షిప్ సీటీసీపై సంబంధిత సంస్థ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
I'm out of words 💀 pic.twitter.com/hgPweX2ax5
— Ansh (@0xansh_) July 15, 2026


