మూడ్రోజుల సహజీవనం.. ఏఐ ఇంజినీర్‌ ఘాతుకం | Gurugram Horror: Three-Day Live-in Relationship Ends in Murder-Suicide | Sakshi
Sakshi News home page

మూడ్రోజుల సహజీవనం.. ఏఐ ఇంజినీర్‌ ఘాతుకం

Jul 13 2026 7:50 AM | Updated on Jul 13 2026 7:55 AM

Gurugram Horror: Three-Day Live-in Relationship Ends in Murder-Suicide

ప్రేమగా మొదలైన బంధం.. కలిసి జీవించాలని తీసుకున్న నిర్ణయం.. కేవలం మూడు రోజుల్లోనే విషాదాంతమైంది. ఒకే ఇంట్లో జీవితం ప్రారంభించిన యువజంట మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. యువతి కత్తిపోట్లతో రక్తపు మడుగులో కనిపించగా, ఆమె ప్రియుడు కొన్ని గంటల వ్యవధిలోనే రైలు కిందపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ప్రేమ, సహజీవనం, అనుమానాల మధ్య మరో విషాదకథగా మారింది.

హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందిన ఇషారా అయూబీ గురుగ్రామ్‌లోని సెక్టార్‌-55లో అద్దె ఫ్లాట్‌లో నివసిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన శ్రేష్ఠ్‌ మాలిక్‌ (25) గురుగ్రామ్‌లో ప్రముఖ కంపెనీలో  ఏఐ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవలె సహజీవనం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

ఫోన్‌ ఎత్తకపోవడంతో..
ఆదివారం ఇషారాకు కుటుంబ సభ్యులు పలుమార్లు ఫోన్‌ చేసినా స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫ్లాట్‌కు చేరుకుని తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లగా.. ఇషారా రక్తపు మడుగులో మృతదేహంగా కనిపించింది. ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అనంతరం ఫోరెన్సిక్‌ బృందం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించింది.

రైల్వే ట్రాక్‌పై శవంగా..
దర్యాప్తులో భాగంగా ఘటనకు ముందు శ్రేష్ఠ్‌ మాలిక్‌ ఇషారా ఫ్లాట్‌కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అతడి కోసం గాలిస్తుండగా.. గర్హీ రైల్వే స్టేషన్‌ సమీపంలోని పట్టాలపై రెండు ముక్కలైన ఓ యువకుడి మృతదేహం కనిపించినట్లు సమాచారం అందింది. మృతదేహం వద్ద లభించిన మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా అతడిని శ్రేష్ఠ్‌గా గుర్తించారు. ప్రియురాలిని హత్య చేసిన అనంతరం అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మూడ్రోజుల క్రితమే కలిసి నివాసం
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇద్దరూ మూడ్రోజుల క్రితమే ఒకే ఫ్లాట్‌లో కలిసి నివసించడం ప్రారంభించినట్లు తేలింది. అయితే వీరి మధ్య ఏం జరిగింది? ఏ కారణంతో ఈ ఘర్షణ హత్యకు దారితీసింది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు.

మొబైల్‌ చాట్లు, కాల్‌ రికార్డుల పరిశీలన
ఇద్దరి మొబైల్‌ ఫోన్లు, కాల్‌ రికార్డులు, చాట్‌ హిస్టరీతో పాటు ఇతర డిజిటల్‌ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. యువతిని హత్య చేసిన కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన వెనుక అసలు కారణం పోస్టుమార్టం నివేదికలు, సాంకేతిక ఆధారాలు, విచారణ పూర్తయిన తర్వాతే వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement