మైసూరులో పట్టుబడ్డ కేరళ వాసి
కోజికోడ్: కేరళలో బస్సు కండక్టర్‌ను తుపాకీతో బెదిరించి టికెట్ విక్రయ నగదును దోచుకుని పరారైన ఒక వ్యక్తిని ఏకంగా 36 సంవత్సరాల తర్వాత ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు కేరళ నుంచి పారిపోయి కర్ణాటకలోని మైసూరులో మారుపేరుతో జీవిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య పెట్టిన వేధింపుల కేసు ఇతడిని ఎట్టకేలకు పట్టిచ్చింది.
71 ఏళ్ల వయస్సులో అనుకోకుండా ఇతను పోలీసులకు దొరికిపోయాడు. కేరళలోని మలప్పురం జిల్లా అరికోడ్‌కు చెందిన వీకే జోస్ 1990లో కేరళ కేఎస్‌ఆర్టీసీ బస్సు థిరువంబాడీ నుంచి కూంబారా పట్టణానికి వెళ్తున్నప్పుడు అందులోని కండక్టర్‌ను తుపాకీతో బెదిరించి కండక్టర్ వద్ద ఉన్న రోజువారీ టికెట్ కలెక్షన్ సొమ్మును నిందితుడు లాక్కొని పరారయ్యాడు. ఈ కేసులో ఇతనిపై కోర్టు అప్పట్లోనే అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు ఇతడు శివకుమార్ అనే మారుపేరుతో మైసూరులోని నరసింహరాజా ప్రాంతంలో జీవించడం మొదలెట్టాడు.
పెళ్లిచేసుకుని భార్య, పిల్లలతో ఉంటున్నాడు. అయితే తనను భర్త వేధిస్తున్నాడంటూ ఇతని భార్య జూలై 8వ తేదీన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు విచారణలో భాగంగా పోలీసులు ఇతని ఇంట్లో సోదాలు చేయగా ఒక తుపాకీ లభించింది. తుపాకీ లైసెన్స్ వివరాలు ఆరా తీయగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఇతని వివరాలను కేరళ పోలీసులకు మైసూరు పోలీసులు పంపించారు. దీంతో ఇతనిపై మూడు దశాబ్దాల క్రితం చోరీ కేసు నమోదైనట్లు గుర్తించి వెంటనే అరెస్ట్‌చేశారు. తర్వాత కేరళలోని థిరువంబాడీకి తీసుకొచ్చి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.


