బీజింగ్: టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్ట్ కింద ఉన్న ఒక క్రియాశీల ఫాల్ట్ లైన్ ఆ ప్రాజెక్టు నిర్మాణ స్థిరత్వాన్ని ప్రభావితం చేయగలదని చైనా భూగర్భ శాస్త్రవేత్తలు జరిపిన ఒక అధ్యయనంలో తేలింది. అయితే, ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలో విపత్తులను నివారించడంలో తోడ్పడుతుందని చైనా చెబుతోంది. ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్‌లోని భారత సరిహద్దుకు సమీపంలోనే ఉంది.
తూర్పు హిమాలయ ప్రాంతంలోని ఎర్త్ క్రస్ట్‌లో ఏర్పడిన పగులు ఈ భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు మౌలిక సదుపాయాల నిర్మాణ సమగ్రతను గణనీయంగా ప్రభావితం చేయగలదని శాస్త్రవేత్తలు చెప్పినట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పత్రిక వెల్లడించింది. ఈ పగులు జలాశయ ప్రాంతంతో పాటు ఆనకట్టలు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి సమీప నిర్మాణాలు, వాటి స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపుతుందని సైంటిస్టులు అంచనాకొచ్చారు.
దీర్ఘకాలిక భూకంప పగుళ్ల కారణంగా చుట్టుపక్కల ఉన్న శిలా నిర్మాణాలు పగిలి, బలహీనపడ్డాయి. దీనివల్ల సమీపంలోని ఇంజనీరింగ్ ప్రాజెక్టుల పునాదులు, నిర్మాణ స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఎక్కువగా ఉంది. చైనా గత జూలైలో టిబెట్‌లో బ్రహ్మపుత్ర నదిపై 167.8 బిలియన్ డాలర్ల వ్యయంతో ఆనకట్ట నిర్మాణాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇక్కడ ఏటా 300 బిలియన్ కిలోవాట్ అవర్‌కు పైగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తారని అంచనా.


