విరాళాల చోరీపై మోదీ మౌనమెందుకు?  | Congress party questions PM Modi silence on alleged Ram Temple donation | Sakshi
Sakshi News home page

విరాళాల చోరీపై మోదీ మౌనమెందుకు? 

Jul 13 2026 5:17 AM | Updated on Jul 13 2026 5:59 AM

Congress party questions PM Modi silence on alleged Ram Temple donation

దోషులను కాపాడేందుకు ప్రయత్నాలు 

సిట్, ఎఫ్‌ఐఆర్‌ కంటితుడుపు చర్యలు 

కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ విమర్శలు 

సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారంలో ప్రధాని మోదీ తీరును కాంగ్రెస్‌ తీవ్రంగా తప్పుబట్టింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కుంభకోణంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రణాళికాబద్ధంగానే భక్తుల నమ్మకాన్ని దెబ్బతీసేలా ఈ వ్యవహారాన్ని నడిపించాయన్నారు. ప్రతి చిన్న అంశానికీ అది తమ గొప్పతనమేనంటూ చెప్పుకునే ప్రధాని మోదీ, నిధుల గోల్‌మాల్‌పై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. 

రోజుకు లక్షలాది రూపాయల విరాళాలు మాయమైనట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలోనే స్పష్టమైందని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ఈ కేసును నీరుగార్చేందుకు అధికార యంత్రాంగం ప్రయత్నిస్తున్నప్పటికీ, భారీ మొత్తంలో నిధులు పక్కదారి పట్టాయనే వాస్తవాన్ని సిట్‌ అంగీకరించాల్సి వచ్చిందని తెలిపారు. దేవుడి సొమ్ము లూటీ వ్యవహారం కేవలం కొద్దిమంది కిందిస్థాయి ఉద్యోగులకే పరిమితం కాలేదని, దీని వెనుక పెద్ద నెట్‌వర్క్‌ ఉందని ఆరోపించారు. 

 రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌తో పాటు ఇతర కీలక ట్రస్టీలపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక లోతైన రహస్యాలు దాగి ఉన్నాయని ఆరోపించారు. కేసు తీవ్రతను తగ్గించేందుకు అధికారికంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లు, సిట్‌ విచారణలు, కొందరి రాజీనామాలు కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నాలేనని స్పష్టం చేశారు.  చోరీపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరపాలని, పూర్తిస్థాయి ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని డిమాండ్‌చేశారు.

ఆప్‌ సంతకాల ఉద్యమం 
న్యూఢిల్లీ: అయోధ్యలోని రామాలయంలో విరాళాల చోరీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం దేశవ్యాప్త సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఉన్న జపనీస్‌ పార్క్‌లో సుందరకాండ పారాయణ కార్యక్రమం చేపట్టారు. హనుమాన్‌ ఆశీస్సులతో ప్రారంభించిన ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని, చందాల చోరీకి బాధ్యులైన వారిని శిక్షించాలంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలపై సంతకాలు చేయాలని ప్రజలను కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు. ఇతరులు సైతం ఇలాంటి లేఖలనే ప్రధాని మోదీకి రాసేలా ప్రోత్సహించాలన్నారు. రామాలయంలో చోరీకి బాధ్యులపై చర్యలను కోరుతూ తమ నివాసాలతోపాటు తమ ప్రాంతంలోని ఆలయాల్లో హనుమాన్‌ చాలీసా పఠించాలని, హనుమాన్‌ హారతి నిర్వహించాలని సూచించారు. కేవలం ఆప్‌ కార్యకర్తలకే పరిమితం కాకుండా, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరగాలన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement