మధ్యప్రదేశ్‌లో మరో భారీ స్కాం! | Subsidised rice being diverted to pvt mills in MadhyaPradesh | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్‌లో మరో భారీ స్కాం!

Jul 12 2026 3:51 AM | Updated on Jul 12 2026 3:51 AM

Subsidised rice being diverted to pvt mills in MadhyaPradesh

రూ.1,200 కోట్ల బియ్యం కుంభకోణం

ఇథనాల్‌ మాఫియాకు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం మళ్లింపు

చిన్నారులు, గర్భిణుల నోటికాడ కూడు లాగేసుకున్న వైనం

ఉజ్జయిని భూస్కామ్‌లో ఏకంగా సీఎంపైనే ఆరోపణలు

ప్రధాని మౌనం వీడాలన్న కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ అవినీతి, దోపిడీకి కేంద్రంగా మారిందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఒక కుంభకోణం మరువకముందే మరో కుంభకోణం వెలుగుచూస్తోందని విమర్శించారు. తాజాగా రాష్ట్రంలో ఇథనాల్‌ తయారీ పేరిట రూ.1,200 కోట్ల భారీ బియ్యం కుంభకోణం జరిగిందని ఆరో పించారు. ఈ మేరకు తన సామాఇజక మాధ్యమ ‘ఎక్స్‌’ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. 

పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికల కోసం వినియోగించాల్సిన బియ్యాన్ని లాభాల కోసం పక్కదారి పట్టించారని ఖర్గే మండిపడ్డారు. సుమారు 5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని రైస్‌ మిల్లర్లు, ఇథనాల్‌ మాఫియాకు అప్పగించారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ అవినీతి దందా సాగుతోందని విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం, అధికార పార్టీ నేతల కుమ్మక్కుతో ప్రజల హక్కుగా దక్కాల్సిన పౌష్టికాహారాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి చుట్టూ ఉజ్జయిని భూస్కామ్‌
తాజా బియ్యం కుంభకోణం కంటే ముందు ఉజ్జయినిలో భారీ భూ కుంభకోణం వెలుగుచూసిందని ఖర్గే గుర్తుచేశారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, హైవే కారిడార్‌ రానున్నాయని ప్రతిపాదించిన ప్రాంతాల్లోనే ముందస్తు సమాచారంతో అక్రమంగా భూముల కొనుగోళ్లు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాత్రపైనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి శాఖలోనూ దోపిడీ సాగుతోందని, బీజేపీ నేతలు తమ జేబులు నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని విమర్శించారు.

అవినీతికి మోడల్‌గా మధ్యప్రదేశ్‌
గతంలో సంచలనం సృష్టించిన వ్యాపం కుంభకోణం నుంచి మొదలుకొని, లెక్కలేనన్ని పేపర్‌ లీకేజీలు, అవినీతి వ్యవహారాలు వెలుగుచూస్తున్నా రాష్ట్రంలో దోపిడీ ఆగలేదని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు మధ్యప్రదేశ్‌ను పూర్తిగా ‘అవినీతి మోడల్‌’గా మార్చేశారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పటిలాగే మౌనం వహిస్తున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్‌ షాలు తమ అధికార అహంకారంతో ప్రజా జీవితంలో ఉండాల్సిన జవాబుదారీతనం అనే భావనను కాలరాశారని ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement