కొత్త ఎయిర్‌ఫోర్స్‌వన్‌పై కథనాలే కారణం
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ కొత్త విమానం గురించి వార్త రాసినందుకు అమెరికా వార్తా పత్రిక న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్‌లకు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఖతర్ బహుమతిగా ఇచ్చిన విమానాన్ని డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానంగా మార్చిన సంగతి, వారం రోజుల క్రితమే ఇది అందుబాటులోకి వచ్చిన విషయమూ తెలిసిందే. అయితే ఈ కొత్త విమానంలో భద్రతా వ్యవస్థలను ప్రశ్నిస్తూ న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లు వార్తలు ప్రచురించారు.
దీనిపై శుక్రవారం తమ రిపోర్టర్లు జూలియన్ ఈ. బార్న్‌స్, ఎరిక్ లిప్టన్, టైలర్ పేజర్, ఎరిక్ ష్మిట్లకు నోటీసులు జారీ అయినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. రానున్న బుధవారం మాన్‌హాటన్‌లోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ముందు సాక్ష్యం ఇవ్వాలన్నది ఈ నోటీసుల సారాంశం. ఫెడరల్ ఏజెంట్లు కొంతమంది జర్నలిస్టుల ఇళ్లకు వెళ్లి మరీ నోటీసులు జారీ చేయడం గమనార్హం.
ఇదీ నేపథ్యం...
డొనాల్డ్ ట్రంప్ గత వారం కొత్త ఎయిర్ ఎయిర్ ఫోర్స్‌వన్‌లో టర్కీలో జరిగిన నాటో సదస్సుకు వెళ్లారు. అయితే బుధవారం మాత్రం పాత ఎయిర్ ఫోర్స్–వన్‌లో ఇంగ్లాండ్‌లోని మిల్డెన్‌హాల్లో ఉన్న రాయల్ ఎయిర్‌ఫోర్స్ కేంద్రానికి వెళ్లారు. ఆసక్తికరంగా కొత్త విమానమూ అక్కడకు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ట్రంప్ కొత్త విమానంలో తిరిగి వచ్చారు. అమెరికా – ఇరాన్‌ల మధ్య కాల్పుల ఒప్పందం విఫలమైన సందర్భంలోనే విమానాల మార్పు జరిగింది. అమెరికా ఇరాన్‌పై దాడులు చేయగా ఇరాన్ మూడు గల్ఫ్ అరబ్ దేశాలపై క్షిపణులు ప్రయోగించింది.
ఈ నేపథ్యంలో 40 కోట్ల డాలర్ల ఖర్చుతో మార్పులుచేర్పులు చేసిన కొత్త ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఆధునిక భద్రత వ్యవస్థలు లేవేమో అన్న అనుమానంతో న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. భద్రతా దళాల సూచనల మేరకు అధ్యక్షుడు పాత విమానంలో వెళ్లారని తెలిపింది. అయితే ట్రంప్ వాటిని ఖండించారు. సైనికులకు కొత్త ఎయిర్‌ఫోర్స్‌వన్‌ను చూపేందుకే మిల్డెన్‌హాల్‌లో ఆగినట్లు సోషల్ మీడియాలో తెలిపారు. వైట్ హౌస్ కొత్త విమానంలో భద్రతా లోపాలు లేవని స్పష్టం చేసింది. న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్లకు నోటీసులు జారీ చేసిన విషయంపై శనివారం వరకూ వైట్‌హౌస్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.


