వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమంగా చల్లారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తనను హత్య చేయాలనే కుట్రలు పన్నుతోందని చాలాకాలంగా ఆయన చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ నిఘా వర్గాలు కూడా ప్రస్తావించాయి కూడా . ఈ నేపథ్యంలో తనపై హత్యాయత్నం విజయవంతమైతే.. ఇరాన్‌పై ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో దాడులు చేయాలని ముందుగానే అధికారులకు ఆదేశాలు ఇచ్చానని ట్రంప్ అంటున్నారు.
అమెరికా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. "నేను చాలా కాలంగా ఇరాన్ లక్ష్యంగా ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే.. వాళ్లు ఇప్పటివరకు చూడని స్థాయిలో ఇరాన్‌పై బాంబుల వర్షం కురిపించాలని ముందుగానే ఆదేశాలు ఇచ్చాను" అని అన్నారు. ఇటీవల ఇజ్రాయెల్ నుంచి తనపై కొత్త హత్య కుట్రకు సంబంధించిన హెచ్చరికలు వచ్చాయా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. "కొత్తగా ఏమీ లేదు. చాలా ఏళ్లుగా వాళ్ల హిట్ లిస్ట్‌లో నేనే మొదటి లక్ష్యం" అని చెప్పారు.
"అలాంటి పరిస్థితి వస్తే ఇరాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది" అంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. అయితే ట్రంప్ వ్యాఖ్యల వెనుక 2020లో జరిగిన ఖాసెం సోలేమానీ హత్య ఘటన కీలకంగా నిలిచింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఇరాన్‌కు చెందిన అగ్ర సైనికాధికారి ఖాసెం సోలేమానీ మరణించారు. అప్పటి నుంచి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు చెందిన పలువురు నేతలు పరోక్షంగా హెచ్చరిస్తూ వచ్చారు. ఇరాన్ సుప్రీం లీడర్(మాజీ) అయతొల్లా ఖమేనీని యుద్ధంలో హతమార్చడంతో ఆ దేశం పగతో రగిలిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాను ఇరాన్ 'కిల్ లిస్ట్'లో అగ్రస్థానంలో ఉన్నానని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించారు.
ఇటీవల నాటో సమావేశం సందర్భంగా కూడా ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. "ఇరాన్‌లో ఒక నాయకత్వం వెళ్లింది.. ఇంకో నాయకత్వం వచ్చింది.. అది కూడా మారింది. నేను కూడా ఎప్పుడు ఉంటానో తెలియదు. ఎందుకంటే వాళ్ల ప్రధాన లక్ష్యం నేనే" అంటూ వ్యాఖ్యానించారు. "ఇప్పటివరకు అదృష్టం కలిసి వచ్చింది. కానీ అది ఎప్పటికీ అలాగే ఉంటుందని చెప్పలేం" అని కూడా పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఇరాన్‌తో శాంతి చర్చలపై కూడా ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా-ఇరాన్ మధ్య అవగాహన ప్రక్రియ ముగిసిపోయిందని, ఇక ఆ దేశ చర్చల బృందంపై తనకు ఎలాంటి విశ్వాసం లేదని అన్నారు. "వాళ్లతో చాలా సమయం వృథా చేశాం. వాళ్లు హింసను నమ్మే వ్యక్తులు. అధికారులు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు.. కానీ దాంతో పెద్దగా ప్రయోజనం ఉండదని నా అభిప్రాయం" అని వ్యాఖ్యానించారు.
ఇటీవల అమెరికా ఇరాన్‌లోని పలు కీలక స్థావరాలపై దాడులు జరిపిన అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మరోవైపు మధ్యవర్తి దేశాలు శాంతి చర్చలను పునరుద్ధరించే ప్రయత్నాలు చేస్తున్న వేళ ట్రంప్ తాజా వ్యాఖ్యలు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇరాన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. మేం మంచివాళ్లం గనుక ఇరాన్‌కు వారం సెలవు ఇచ్చాం(ఖమేనీ వారం సంతాపదినాలను ఉద్దేశించి..) అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. ఈ క్రమంలోనే ఖమేనీ అంతిమయాత్రలో.. ట్రంప్‌తో పాటు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వ్యతిరేక నినాదాలు వినిపించాయి. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న విభేదాలు ఇంకా పూర్తిగా చల్లారలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు, ఇరాన్ నుంచి వస్తున్న ప్రతీకార స్వరాల నేపథ్యంలో పశ్చిమాసియా పరిస్థితులు మళ్లీ ఏ మలుపు తిరుగుతాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా మారింది.


