పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు, పేలుళ్లు
తమకు సంబంధం లేదని అమెరికా ప్రకటన
బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్‌పై ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్
దుబాయ్: ఇరాన్‌పై వరుసగా వైమానిక దాడులు జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. తాము దాడులు పూర్తిస్థాయిలో నిలిపివేశామని అమెరికా ప్రకటించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. తాజా అనుమానాస్పద దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకున్నది ఎవరన్నది అంతుబట్టడం లేదు.
దివంగత సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని ఖననం చేయడానికి ఇరాన్ సన్నద్ధమవుతున్న తరుణంలోనే గురువారం దక్షిణ ఇరాన్‌లోని వివిధ ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. దీనికి కారణం ఎవరన్న దానిపై ఇరాన్ కూడా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా సాగిస్తున్న ప్రచారానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) మద్దతు ఇస్తోందంటూ ఇరాన్ చట్టసభ సభ్యుడు ఒకరు ఆరోపించారు. అమెరికాకు సహకరించినందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఇటీవల అమెరికా చేసిన దాడుల్లో యూఏఈ తెర వెనుక పాత్ర పోషించిందని మండిపడ్డారు. ఇరాన్‌పై తాజా వైమానిక దాడుల పట్ల గల్ఫ్ దేశాలు కూడా స్పందించలేదు. ఇరాన్ బద్ధశత్రువైన ఇజ్రాయెల్ కూడా మౌనం వహించింది. ప్రపంచ ఇంధన మార్కెట్లకు కీలక జలమార్గమైన హార్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని, నౌకల రవాణాకు వీలు కల్పించాలని అమెరికా పట్టుబడుతున్న తరుణంలో ఇరాన్‌పై వరుసగా దాడులు జరిగాయి. హార్మూజ్ ఇకపై పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండాలని, నౌకలు రాకపోకలు సాగించాలంటే తమకు రుసుములు చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది.
నాలుగు దేశాల్లో మిస్సైల్ అలర్ట్ సైరన్లు
ఇరాన్‌లోని బుషెహర్, సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లతోపాటు అహవాజ్, చాబహార్, ఇతర ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయని, పలుచోట్ల పేలుళ్లు చోటుచేసుకున్నాయని స్థానిక మీడియా గురువారం సాయంత్రం వెల్లడించింది. అయితే, గురువారం ఉదయం తర్వాత తాము ఎలాంటి దాడులకు పాల్పడలేదని అమెరికా రక్షణ వర్గాలు తెలిపాయి. సాయంత్రం జరిగిన వైమానిక దాడులతో తమకు సంబంధం లేదని వివరణ ఇచ్చాయి. అయితే, ఇరాన్ సైతం ప్రతీకార దాడులకు దిగింది. బహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతార్‌లో పలు లక్ష్యాలపై విరుచుకుపడింది
. నాలుగు దేశాల్లో మిస్సైల్ అలర్ట్ సైరన్లు వినిపించాయి. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. కువైట్‌లో ఒకరు గాయపడినట్లు సమాచారం. ఇరాన్ దాడికి దిగిన వెంటనే కువైట్ అమీర్(పాలకుడు)తో సమావేశం కావడానికి యూఏఈ నాయకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కువైట్‌కు వెళ్లారు. ఖతార్ విదేశాంగ మంత్రితో గల్ఫ్ అరబ్ దేశాల నేతలు ఫోన్‌లో మాట్లాడారు. ఇంతకుముందు యుద్ధ సమయంలో ఇరాన్‌పై అనేక వైమానిక దాడులు జరిగాయి.
తమ ఇంధన కేంద్రాలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగా సౌదీ అరేబియా, యూఏఈలు ఇరాన్‌పై వైమానిక దాడులు చేశాయని అధికారులు తర్వాత తెలిపారు. ఇరాన్‌పై తాజా దాడులకు ఏదో ఒక గల్ఫ్ దేశం కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గురువారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడారు. గల్ఫ్‌లో అమెరికా తీసుకుంటున్న చర్యల గురించి ట్రంప్ నెతన్యాహుకు తెలియజేశారు. అవసరమైతే ఇరాన్‌ను ఎదుర్కోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ తేల్చిచెప్పారు.


