ఉత్తరాదికి బిగ్‌ అలర్ట్‌.. వరదల ఉగ్రరూపం.. | Monsoon Effect 10 dead And landslides in Uttarakhand rivers swell | Sakshi
Sakshi News home page

ఉత్తరాదికి బిగ్‌ అలర్ట్‌.. వరదల ఉగ్రరూపం..

Jul 10 2026 11:32 AM | Updated on Jul 10 2026 11:39 AM

Monsoon Effect 10 dead And landslides in Uttarakhand rivers swell

దేశవ్యాప్తంగా రుతుపవనాలు వ్యాపించినట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కాగా, భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు.. వాతావరణ శాఖ పలు ప్రాంతాలకు భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల కారణంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో పదికిపైగా మరణాలు సంభవించాయి.

ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపిలేని వర్షాలతో కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. పలు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చార్‌ధామ్‌ మార్గాల్లోనూ భద్రతా కారణాలతో ఆంక్షలు విధించారు. ఏడు జిల్లాలకు ఫ్లాష్‌ ఫ్లడ్‌ ముప్పు హెచ్చరికలు జారీ చేసి అధికారులు అప్రమత్తమయ్యారు.

 

హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కిన్నౌర్‌ జిల్లాలో వరదల కారణంగా ఓ వంతెన దెబ్బతిని గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడం, కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోనూ భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. వరదలు, రహదారులపై నీరు నిలిచిపోవడంతో సాధారణ జీవనం ప్రభావితమైంది.

భారీ వర్షాల ప్రభావం ఇతర రాష్ట్రాలపైనా కనిపిస్తోంది. ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో నీటి మునకలు, రోడ్డు ప్రమాదాలు, భవనాల కూలిన ఘటనలు చోటుచేసుకున్నాయి. సహాయక బృందాలు రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ప్రకృతి ప్రకోపంతో కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. నదులు ఉప్పొంగడం, నేల బలహీనపడటం, ఆకస్మిక వరదలు కారణంగా మరిన్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ప్రజలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని, కొండ ప్రాంతాల్లో నదులు, వాగుల సమీపానికి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. రక్షణ, సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement