న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటు రాజకీయంగానూ కొంతకాలంగా.. కొన్ని రకాల ప్రచారాలు, ఊహాగానాలు, ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇథనాల్ పెట్రోల్‌తో గడ్కరీ కుటుంబం విపరీతంగా లాభపడుతోందని.. ఆ ఉద్దేశంతో ఆయన ఈ విధానాన్ని ప్రొత్సహిస్తున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం. అయితే ఇథనాల్ విధానాన్ని తానే రూపొందించి.. వ్యక్తిగతంగా లాభపడుతున్నానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. అంతేకాదు ఈ20 పెట్రోల్‌తో వాహనాలు దెబ్బతింటున్నాయనే ఘటనకు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. తాజాగా ఆయన ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం ఒక వ్యక్తి నిర్ణయం కాదు. దాని వెనుక నేను మాత్రమే ఉన్నానన్నది ఆరోపణలే. శాస్త్రీయ పరిశోధనలు, పెట్రోలియం శాఖ, కేంద్ర మంత్రివర్గం సంప్రదింపుల తర్వాతే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఇథనాల్ ఉత్పత్తి చేసే కంపెనీల్లో తన కుటుంబానికి(కుమారులకు) సంబంధాలున్నాయనే విమర్శలపై స్పందించిన గడ్కరీ.. తమ కుటుంబం చెరుకు పరిశ్రమలో చాలాకాలం కిందటే ఉందని గుర్తుచేశారు. అంతేకాదు..
ప్రస్తుతం దేశంలో సుమారు 550 ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు ఉండగా.. అందులో తన వాటా చాలా కొద్దిమాత్రమేనని చెప్పారు. "నా వాటా 0.07 శాతం మాత్రమే. అంత చిన్న వాటాతో దేశ ఇథనాల్ విధానాన్ని నా ప్రయోజనం కోసం ప్రభావితం చేయడం అసాధ్యం. ఈ విధానం వల్ల నాకు వ్యక్తిగతంగా ఎలాంటి లాభం లేదు. పైసా రాదు" అని గడ్కరీ స్పష్టం చేశారు.
ఆధారాలు చూపండి..
ఈ20 పెట్రోల్ వాడితే ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలపై కూడా గడ్కరీ తీవ్రంగా స్పందించారు. "ఈ20 వల్ల ఎవరి వాహనం దెబ్బతిన్నా డీలర్‌కు, మా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయండి. మేం విచారణ చేసి న్యాయం చేస్తాం. మీకు వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరి వాహనాలైనా ఈ20 కారణంగా దెబ్బతిన్నాయని చెప్పగలరా?" అంటూ ప్రశ్నించారు.
ప్రముఖ కంపెనీల నుంచి ఫిర్యాదుల్లేవు
దేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన మారుతీ సుజుకీ, టయోటా, టాటా మోటర్స్, మహీంద్రా&మహీంద్రా నుంచి ఈ20 ఇంధనం కారణంగా వాహనాలు దెబ్బతిన్నాయని ఎలాంటి అధికారిక ఫిర్యాదులు రాలేదని మంత్రి తెలిపారు. ఇటీవల టయోటా కారుకు సంబంధించిన ఓ ఘటనలో కూడా ఇథనాల్ కారణం కాదని.. ఇంధనంలో నీరు కలవడమే సమస్యకు కారణమని విచారణలో తేలిందని చెప్పారు.
నాలుగేళ్ల పరీక్షల తర్వాతే అనుమతి
ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని హడావుడిగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కాదని గడ్కరీ వివరించారు. వాహనాలను నాలుగేళ్లపాటు పరీక్షించి, లక్షల కిలోమీటర్లు నడిపిన తర్వాతే అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇది ప్రయోగాత్మక విధానం కాదని, శాస్త్రీయంగా నిర్ధారించిన ప్రక్రియ అని పేర్కొన్నారు.
రైతులకు లాభం.. దిగుమతులు తగ్గుతాయి
తాను ఇథనాల్‌ను మాత్రమే కాదు, ప్రత్యామ్నాయ ఇంధనాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నానని గడ్కరీ తెలిపారు. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. దేశ ఇంధన భద్రతకు కూడా ఇది కీలకమని అభిప్రాయపడ్డారు.
నాపై దుష్ప్రచారం చేస్తోంది..
ఇథనాల్ విధానంపై వస్తున్న వివాదం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని గడ్కరీ ఆరోపించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ఇథనాల్ కార్యక్రమాన్ని అపఖ్యాతిపాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.
ప్రపంచమంతా ఇదే దారి
ఇథనాల్ వినియోగంలో భారత్ కొత్త ప్రయోగం చేయడం లేదని గడ్కరీ గుర్తు చేశారు. అమెరికా, బ్రెజిల్, జపాన్, జర్మనీ, థాయ్‌లాండ్, స్వీడన్ ఇలా.. అనేక దేశాల్లో ఇప్పటికే ఇథనాల్ మిశ్రమ ఇంధనం విజయవంతంగా వినియోగిస్తున్నారని చెప్పారు.
అసలు ఈ20 వివాదం ఏంటి?
ఈ20 అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం. కాలుష్యం తగ్గించడం, చమురు దిగుమతులను తగ్గించడం, చెరకు వంటి పంటలకు డిమాండ్ పెంచి రైతుల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన లక్ష్యాలు. అయితే పాత మోడల్ వాహనాల్లో దీర్ఘకాలంలో ఇంజిన్, మైలేజ్‌పై ప్రభావం ఉంటుందా అనే సందేహాలు కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ20 వల్ల వాహనాలకు నష్టం జరిగిందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతోంది.


