breaking news
E20 petrol
-
ఇథనాల్ పెట్రోల్ స్కామ్‌ను బయటపెడతా
న్యూఢిల్లీ: రాజకీయ విశ్లేషకుడు, వ్యాపారవేత్త తెహసీన్ పూనావాలాను గురువారం ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా ఆయన గళం విన్పిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 31న (శుక్రవారం) ‘గాడీ మార్చ్’కు ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే పూనావాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఉదయం విజయ్ చౌక్ వద్ద ఆయనను ఢిల్లీ పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు.తన గొంతును నొక్కడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన 'ద స్టేట్స్‌మన్'తో అన్నారు. తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను కూడా నిలిపివేశారని వాపోయారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇదంతా చేయించారని అన్నారు. గడ్కరీకి భయపడబోనని, ఆయనకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తానని ప్రకటించారు.ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌ను ప్రజలపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ ఇండియా గేట్ నుంచి పార్లమెంట్ వరకు కారు ర్యాలీ (గాడీ మార్చ్) చేపట్టనున్నట్టు ఇంతకుముందు తెహసీన్ పూనావాలా ప్రకటించారు. ఈ20 పెట్రోల్‌తో వావాహనదారులు తీవ్రంగా నష్టపోతారని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుటుంబ సభ్యుల ప్రయోజనాల కోసమే దీన్ని జనంపై రుద్దుతున్నారని ఆరోపించారు.హుందాగా పోరాడతాతన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నిలిపివేయడం సమంజసం కాదని ప్రధాన నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. 'ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానానికి వ్యతిరేకంగా నేను చేస్తున్న పోరాటం హేతుబద్దమైనది. మీ మంత్రులను, ఎంపీలను ఇన్‌స్టాగ్రామ్‌లో చేరమని గౌరవనీయ ప్రధానమంత్రి ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు నా ఇన్స్టాగ్రామ్ ఖాతా ట్రెండింగ్‌లో ఉన్నప్పుడు దాన్ని నిలిపివేశారు. ఈ విషయాన్ని మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. ప్రజాస్వామ్య పంథాలో హుందాగా నా పోరాటాన్ని కొనసాగిస్తాన'ని ఎక్స్‌లో పేర్కొన్నారు.ఏం చేసుకుంటారో చేసుకోండిఇథనాల్ పెట్రోల్ స్కామ్‌పై పోరాటం కొనసాగిస్తానని తెహసీన్ పూనావాలా (Tehseen Poonawalla) పునరుద్ఘాటించారు. నితిన్ గడ్కరీకి భయపడేది లేదని తేల్చిచెప్పారు. 'నా ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేసిన తర్వాత నితిన్ గడ్కరీకి ఇదే సందేశం. సార్, మీరు చేయగలిగినది చేయండి, నేను ఇథనాల్ స్కామ్‌ను బయటపెట్టడం మాత్రం ఆపను. నేను మీకు భయపడను, పైగా మీ పిల్లలకు చెందిన ఇథనాల్ డిస్టిలరీల విషయంలో మీరు వివాదంలో ఉన్నార'ని ఎక్స్‌లో వీడియోలో షేర్ చేశారు. Guys irrespective of your pov : agreeing with me or no: if my Instagram account can be suspended for being this successful and speaking up that too decently and with facts, think why won't it be yours tomorrow? Do we tolerate this? pic.twitter.com/oK0QhR3JQT— Tehseen Poonawalla Official 🇮🇳 (@tehseenp) July 30, 2026చదవండి: ఇన్‌స్టా మార్గం పట్టిన బీజేపీ ముఖ్య నాయకులు! బాంబే హైకోర్టు తలుపు తట్టిన గడ్కరీఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ విధానంతో తన కుటుంబం లాభపడుతోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవాలని కోరుతూ నితిన్ గడ్కరీ ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేసేందుకు ఆయనకు హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. -
E20 వివాదం.. నితిన్ గడ్కరీ కీలక నిర్ణయం!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తనపై, తన కుటుంబంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమం ద్వారా తాను, తన కుటుంబం లాభపడుతున్నారంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బాంబే హైకోర్టు గడ్కరీకి సివిల్ కేసు దాఖలు చేసేందుకు అనుమతి ఇచ్చింది.మెటాకు చెందిన ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల మీద మాత్రమే కాకుండా.. ఎక్స్, గూగుల్ వంటి సోషల్ మీడియా సంస్థలతో పాటు తప్పుడు ప్రచారం చేస్తున్న గుర్తుతెలియని వ్యక్తులు, పేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.గడ్కరీ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని డీప్‌ఫేక్ వీడియోలు, మార్పింగ్ చేసిన ఫొటోలు, ఎడిట్ చేసిన వీడియోలు ప్రచారం అవుతున్నాయి. వీటిలో ఈ20 ఇథనాల్ కార్యక్రమం వల్ల తనకు, తన కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నట్లు చూపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమని గడ్కరీ తెలిపారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతే కాకుండా.. ఈ20 విధానం తన శాఖ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమం కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుందని తెలిపారు. ఈ విధానాన్ని రూపొందించడం, అమలు చేయడం లేదా నిర్వహించడంలో తనకు ఎలాంటి పాత్ర లేదని పేర్కొన్నారు.సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు పోస్టులను తొలగించాలని, వాటిని సృష్టించి ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గడ్కరీ కోర్టును కోరారు. భవిష్యత్తులో ఇలాంటి కంటెంట్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అయితే.. బాంబే హైకోర్టు ప్రస్తుతం గడ్కరీకి కేసు దాఖలు చేసేందుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. సోషల్ మీడియా పోస్టుల తొలగింపు వంటి తాత్కాలిక ఉపశమనాలపై తదుపరి దశలో విచారణ జరగనుంది. -
గడ్కరీ కీలక నిర్ణయం.. టెన్షన్ మొదలైందా?
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ గురించి గత కొన్నాళ్లుగా నడుస్తున్న రచ్చ(చర్చ) సంగతి తెలిసిందే. అయితే నీట్ వ్యవహారంతో ఇన్నాళ్లు ఈ అంశం కాస్త పక్కకు జరిగిపోయింది. అయితే.. ఇప్పుడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చుట్టూ కొత్త వివాదం మొదలైంది. ఈ20 ఇథనాల్ మిశ్రమ పెట్రోల్(E20) విధానంతో గడ్కరీ కుటుంబం లాభపడుతోందని.. ఆయన కూడా రాజీనామా చేయాల్సిందేనంటూ డిమాండ్ ఒకటి తెర మీదకు వచ్చింది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. E20 పెట్రోల్ విధానం కేవలం స్వార్థపూరితంగా ఆయన తెచ్చారని.. దాని వల్ల ఆయనకు, తన కుటుంబానికి లాభాలు వస్తున్నాయంటూ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారంపై ఆయన న్యాయపోరాటానికి దిగారు. తప్పుడు పోస్టులు, డీప్‌ఫేక్ కంటెంట్‌పై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.వీటిని పరువు నష్టం కలిగించే ప్రచారంగా పేర్కొన్న గడ్కరీ.. సంబంధిత సోషల్ మీడియా సంస్థలు, గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేసేందుకు కోర్టు అనుమతి కోరారు. ఈ విధానం వల్ల తనకు పైసా లాభం లేదని.. తమ కుటుంబం నిర్వహిస్తున్న చెరకు వ్యాపారంతో లాభాలు కూడా పెద్దగా రావని అందులో వివరించారు.సమగ్ర కథనం: ఇథనాల్ అంశం.. నా వాటా ఎంతంటే..: గడ్కరీబాంబే హైకోర్టును ఆశ్రయించిన గడ్కరీగడ్కరీ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలించిన బాంబే హైకోర్టు.. కేసు దాఖలుకు అనుమతి ఇచ్చింది. తనపై ప్రచారం జరుగుతున్న కంటెంట్ ముంబైలోనూ అందుబాటులో ఉందని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇదే అంశంపై నాగ్‌పూర్‌లో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ20 ఇథనాల్ విధానానికి సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేశారనే ఆరోపణలతో కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదు చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత.. గడ్కరీనే టార్గెట్?ఇటీవల నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో.. సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. తదుపరి టార్గెట్ నితిన్ గడ్కరీనే అంటూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఈ20 ఇంధనంపై గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం, వాహనదారుల నుంచి వస్తున్న అభ్యంతరాలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే గడ్కరీపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి అధికారిక నిర్ధారణ లేదు. ఇటు కేంద్రం కూడా ఇథనాల్ పెట్రోల్ విషయంలో ఎలాంటి పొరపాట్లు లేవని అంటోంది కూడా.అసలు ఈ20పై వివాదం ఏంటి?కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ20 ఇంధనం అంటే.. 80 శాతం పెట్రోల్‌కు 20 శాతం ఇథనాల్‌ను కలిపిన మిశ్రమం. ముడి చమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం, కాలుష్యాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు మాత్రం పాత వాహనాలపై ఈ20 ప్రభావం, మైలేజీ తగ్గుదల వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.కోర్టు బాట పట్టిన గడ్కరీతనపై జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేందుకు గడ్కరీ తీసుకున్న న్యాయపరమైన చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ20పై రాజకీయ విమర్శలు కొనసాగుతున్న వేళ.. తప్పుడు ప్రచారాలపై చట్టపరంగా ఎదుర్కొంటాననే సంకేతాన్ని ఆయన ఇచ్చినట్లు కనిపిస్తోంది. -
ఇక గడ్కరీకి ‘బొద్దింకల’ బెడద?
న్యూఢిల్లీ: దేశ రాజధాని రాజకీయాల్లో ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘బొద్దింకల’ హడావుడి మరింత పెరిగింది! పరీక్షల రచ్చతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టించిన ‘సీజేపీ’ బాటలోనే తాజాగా మరో వింత సంఘం తెరపైకి వచ్చింది. అదే ‘ఈ20 జనతా పార్టీ’ (ఈజేపీ). ఇప్పుడు ఈ కొత్త ఆన్లైన్ వేదిక కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని చుట్టుముట్టేందుకు పావులు కదుపుతోంది. ప్రభుత్వ ఇథనాల్ విధానాన్ని ఎండగడుతూ, కేంద్ర మంత్రిని టార్గెట్ చేస్తూ ఈ వర్గం సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న రచ్చ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారుతోంది.ఇథనాల్ కలిపిన పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా వాహనదారుల్లో ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, దీన్ని ఆసరాగా చేసుకుని ‘ఈ20 జనతా పార్టీ’ తెరపైకి వచ్చింది. ఇథనాల్ బ్లెండింగ్‌కు తాము వ్యతిరేకం కాదంటూనే, మరోవైపు నితిన్ గడ్కరీ అనుసరిస్తున్న ఇథనాల్ విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అసలు సిసలైన 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్‌ను అదనపు ఆప్షన్‌గా ఇవ్వాల్సిందేనంటూ గడ్కరీని ఇరుకున పెట్టేందుకు ఈ ‘బొద్దింకల’ స్ఫూర్తితో పుట్టుకొచ్చిన కొత్త బృందం సిద్ధమవుతోంది.‘మా డిమాండ్ ఒక్కటే.. స్వచ్ఛమైన పెట్రోల్ మా హక్కు’ అంటూ ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వేదికగా వీరు చేస్తున్న ప్రచారం ఇప్పుడు యువతను, వాహనదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. గడ్కరీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కీలకమైన ఇంధన విధానాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు ఎనర్జీ సెక్యూరిటీ అంటున్న ప్రభుత్వానికి, మరోవైపు వాహనాల మైలేజ్ పడిపోతోందని ఆవేదన చెందుతున్న వినియోగదారులకు మధ్య ఈ వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చుతోంది. మొత్తానికి, 'కాక్రోచ్ జనతా పార్టీ' బాటలోనే దూసుకొస్తున్న ఈ 'ఈ20 జనతా పార్టీ' ఉద్యమం.. రాబోయే రోజుల్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి, ప్రభుత్వానికి తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది!ఇది కూడా చదవండి: డిశ్చార్జ్ తర్వాత వాంగ్‌చుక్ ప్రణాళిక ఇదే.. -
ప్రీమియం పెట్రోల్‌లో ఇథనాల్ ఉండదు
ప్రభుత్వ రంగ ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ బంకులు.. ప్రీమియం పెట్రోల్‌ని ఇథనాల్ కలపకుండానే విక్రయించడాన్ని కొనసాగిస్తాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి స్పష్టం చేశారు. మొత్తం పెట్రోల్ విక్రయాల్లో ప్రీమియం వాటా 0.5 శాతమే ఉందని ఆయన చెప్పారు. అలాగే పెట్రోల్‌లో ఇథనాల్‌ని 20 శాతానికి మించి కలపడంపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదని వివరించారు.ఈ0, ఈ10 పెట్రోల్‌ని తిరిగి ప్రవేశపెట్టే యోచనేదీ లేదని తెలిపారు. ఇథనాల్ కలపని పెట్రోల్‌ని ఈ0గా, 10 శాతం కలిపితే ఈ10గా, 20 శాతం కలిపితే ఈ20గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బంకుల్లోను ఈ20 పెట్రోల్‌ని విక్రయించాలని ఆదేశాలు ఉన్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటివరకు దీని ప్రతికూల ప్రభావాలపై రూఢీగా ఎటువంటి ఫిర్యాదులు రాలేదని ఆయన తెలిపారు. పరిశోధనల్లో, ఫీల్డ్ ట్రయల్స్‌లో కూడా ఇంజిన్ మన్నిక, పనితీరు, వాహన జీవితకాలంపై ఈ20 వల్ల ప్రతికూల ప్రభావం ఉంటుందంటూ నిర్ధారణేమీ కాలేదని వివరించారు.ఇదీ చదవండి: ట్రాఫిక్ రూల్ అతిక్రమిస్తే డిజిటల్ వార్నింగ్ -
పెట్రోల్‌లో ఇథనాల్ పెంపు?.. కేంద్రం క్లారిటీ!
ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం విషయంలో గత కొంతకాలంగా పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందా? ఇంజిన్ పనితీరు దెబ్బతింటుందా? అనే అనుమానాలు చాలా మంది వాహనదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక విషయాలను స్పష్టం చేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్) అందుబాటులో ఉంది. అయితే భవిష్యత్తులో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతం కంటే ఎక్కువ పెంచే ఆలోచనపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.పెట్రోల్‌లో ఇథనాల్ శాతం పెంచాలంటే తొందరపడి నిర్ణయం తీసుకోబోమని, ముందుగా శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు చేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపీ తెలిపారు. అంతే కాకుండా.. ఆటోమొబైల్ కంపెనీలు, చమురు సంస్థలు, పరిశోధనా సంస్థలతో చర్చించిన తర్వాతే భవిష్యత్ నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు.ఇకపోతే.. అసలు ఇథనాల్‌ను పెట్రోల్‌లో ఎందుకు కలుపుతున్నారు అనే విషయానికి వస్తే, దీనికి ప్రధాన కారణం కాలుష్యాన్ని తగ్గించడం, ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల.. రైతులు ఆర్థికంగా ఎదుగుతారు. ఎందుకంటే వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది కాబట్టి.భారత్ ఇప్పటికే పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని చేరుకుంది. 2013-14లో కేవలం 1.5 శాతంగా ఉన్న ఇథనాల్ మిశ్రమం క్రమంగా పెరుగుతూ 2025-26 నాటికి 20 శాతానికి చేరుకుంది. భవిష్యత్తులో పెరుగుతుందా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ఆగస్టు నుంచి.. మారనున్న మారుతి కార్ల ధరలు! -
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నటుడు నరేష్ ఆందోళన
దేశంలో పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ఈ ఇంధనం వల్ల వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు వస్తుండగా తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ విజయకృష్ణ సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తాను దేశద్రోహిని కాదని స్పష్టం చేస్తూనే.. ఈ ఇథనాల్ పెట్రోల్ విధానం సామాన్య బైక్ వినియోగదారుల నుంచి లగ్జరీ కార్ల యజమానుల వరకు అందరికీ ఇబ్బందిగా మారిందని ఆయన విమర్శించారు.లక్షల రూపాయల నష్టం..తన స్నేహితుడు (బీజేపీ సానుభూతిపరుడు) ఇటీవల కొనుగోలు చేసిన టయోటా క్యామ్రీ కారులో ఇథనాల్ పెట్రోల్ ద్వారా ఇంజిన్ వాల్వ్‌లు దెబ్బతిన్నాయని, వాటిని మార్చడానికి రూ.3.5 లక్షలు ఖర్చయిందని నరేష్ పేర్కొన్నారు. ‘ఇదే పరిస్థితి నా కొత్త పోర్షే పనమెరా కారుకు వస్తే దాదాపు రూ.12 లక్షల వరకు నష్టం వస్తుంది. అందుకే నేను తప్పనిసరి పరిస్థితుల్లో లీటరు రూ.165 ధర పలికే ‘హై ఆక్టేన్ 100’ పెట్రోల్ వాడుతున్నాను’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధనవంతులు లగ్జరీ ఇంధనాలు వాడగలరని, కానీ నిత్యం బతుకుదెరువు కోసం చూసే సామాన్య బైక్ వినియోగదారుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు.I am not anti national but this ethanol Petrol is giving heart attacks from bike users to high-end car users . My friend( a sympathiser of BJP) who bought Toyota Camry recently had to change valves of the engine. Which cost him 3.5 lks . If the same happens to my new Porsche… pic.twitter.com/4ciFCJxRv4— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) July 19, 2026‘ఒక మాజీ బీజేపీ నాయకుడిగా నాకు తెలుసు.. పార్టీకి బలమైన థింక్ ట్యాంక్, ప్లాన్ A, B, C లు ఉంటాయి. కానీ కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి పర్యావరణాన్ని రక్షించాలనే ఈ నిర్ణయం చాలా హడావుడిగా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు కేవలం రెండేళ్ల సమయం మాత్రమే ఉంది. ఇది బీజేపీకి ఒక రెడ్ సిగ్నల్ లాంటిది’ అని నరేష్ విజయకృష్ణ తెలిపారు. బ్రెజిల్ వంటి చిన్న దేశాలు ఇథనాల్‌ను దశలవారీగా ప్రవేశపెట్టి విజయం సాధించాయని, భారతదేశంలో ఇంత హడావుడి ఎందుకని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం.. E20 పెట్రోల్‌పై ఆందోళన!
భారతదేశంలో కాలుష్యాన్ని తగ్గించడానికి మాత్రమే కాకుండా.., దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా పుట్టుకొచ్చిందే పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం. ప్రస్తుతం దేశంలో E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం) వినియోగం విస్తరిస్తోంది.ఈ20 పెట్రోల్ కారణంగా.. పాత పెట్రోల్ వాహనాల్లో ఇంజిన్ సమస్యలు, మైలేజ్ తగ్గడం, మరమ్మతుల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయని కొంతమంది వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలకు నష్టం జరిగితే.. పరిహారం కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చాలామంది వాహన యజమానులు చెబుతున్నారు.లోకల్ సర్వే నిర్వహించిన ఒక నివేదిక ప్రకారం.. ఈ20 పెట్రోల్ వల్ల తమ వాహనాలకు తీవ్రమైన నష్టం జరిగిందని భావించే వారిలో ఎక్కువ మంది పరిహారం కోసం ప్రయత్నించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ సర్వేలో దేశంలోని 316 జిల్లాలకు చెందిన 22 వేలకుపైగా పెట్రోల్ వాహన యజమానులు పాల్గొన్నారు.సర్వే ప్రకారం.. 31 శాతం మంది 'వినియోగదారుల కమిషన్'ను ఆశ్రయిస్తామని తెలిపారు. 14 శాతం మంది అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన మార్గాలను ఉపయోగిస్తామని వెల్లడించారు. అంటే మొత్తం 45 శాతం మంది న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.అదే సమయంలో 18 శాతం మంది వాహన తయారీ సంస్థతో పాటు ఇంధన కంపెనీ నుంచి పరిహారం కోరుతామని తెలిపారు. 9 శాతం మంది కేవలం వాహన తయారీదారు నుంచి పరిహారం కోరనున్నట్లు పేర్కొన్నారు.నిజానికి భారత్ ఈ20 పెట్రోల్ వైపు మారుతున్న సమయంలో, ముఖ్యంగా పాత పెట్రోల్ వాహనాల యజమానుల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి. 2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాలను కలిగిన వారిలో 55 శాతం మంది 2025 ప్రారంభం నుంచి వాహనంలో అసాధారణమైన అరుగుదల, ఎక్కువ మరమ్మతుల అవసరం కనిపించిందని తెలిపారని సర్వే ద్వారా తెలిసింది. గతంలో నిర్వహించిన మరో సర్వేలో 66 శాతం మంది వాహనదారులు 10 శాతానికి పైగా మైలేజ్ తగ్గిందని పేర్కొన్నట్లు సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: సంపద సృష్టించడం ఎలా..?: కియోసాకి సలహా -
ఇథనాల్ పెట్రోల్‌తో బండి ఖరాబు.. పరిహారంతో ఓనర్‌కు భారీ ఊరట!
పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుతున్న వేళ.. వాహనదారుల్లో కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం E20 పూర్తిగా సురక్షితమని, ఇది కాలుష్య నియంత్రణతో పాటు ముడిచమురు దిగుమతుల తగ్గింపులో కీలక అడుగు అని చెబుతోంది. అలాగే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ కొందరిపై కేసులు కూడా పెడుతోంది. ఈ నేపథ్యంలో ఈ20 పెట్రోల్‌తో తన బండి పాడైందన్న ఓ వాహనదారుడికి అనుకూలంగా తీర్పు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ కేసులో వాహనదారుడికి ఊరట కల్పించింది. వాహన మరమ్మతుల ఖర్చులతో పాటు మానసిక వేదన, న్యాయపరమైన ఖర్చులకు పరిహారం చెల్లించాలని వాహన తయారీ సంస్థ, డీలర్‌ను ఆదేశించింది. తద్వారా.. దేశంలో E20 పెట్రోల్ వినియోగానికి సంబంధించి వినియోగదారుల కోర్టు ఇచ్చిన తొలి తీర్పుగా ఇది ప్రాధాన్యం సంతరించుకుంది!.ఫిర్యాదుదారుడి వాదన ప్రకారం.. తన వాహనంలో E20 పెట్రోల్ నింపిన తర్వాత పనితీరు క్రమంగా తగ్గిపోయింది. ఇంజిన్‌లో మిస్‌ఫైరింగ్, మైలేజీ తగ్గడం, పనితీరు మందగించడం వంటి సమస్యలు ఎదురయ్యాయని తెలిపారు. సర్వీస్ సెంటర్లను ఆశ్రయించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని, చివరకు ఇంజిన్ మరమ్మతులకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.అయితే వాహన తయారీ సంస్థ, డీలర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. తమ వాహనం E20 ఇంధనానికి అనుకూలంగానే రూపొందించామని, సమస్యలకు ఇంధనం కారణం కాదని వాదించారు. సాధారణ అరుగుదల, నిర్వహణ లోపాలు లేదంటే ఇతర కారణాల వల్లే సమస్యలు వచ్చి ఉండొచ్చని పేర్కొన్నారు.వినియోగదారుల కమిషన్ ఏం చెప్పిందంటే.. కమిషన్ మాత్రం వాహనదారుడి వాదనలను పరిగణనలోకి తీసుకుంది. పదేపదే సర్వీసింగ్ చేయించినప్పటికీ సమస్యలు కొనసాగడం, లోపాలను పూర్తిగా పరిష్కరించడంలో విఫలమవడం వంటి అంశాలను పరిశీలించింది. దీంతో వాహనదారుడికి పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఈ తీర్పులో మరో కీలక అంశం E20 లభ్యత. ప్రస్తుతం దేశంలోని చాలా పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనమే సాధారణంగా అందుబాటులో ఉందని కమిషన్ పేర్కొంది. వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం పరిమితంగా ఉన్నప్పుడు.. E20 వాడినందుకు వారినే బాధ్యులను చేయలేమని అభిప్రాయపడింది.E20పై ఎందుకు చర్చ(రచ్చ)?పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన మిశ్రమాన్ని E20 పెట్రోల్ అంటారు. ముడిచమురు దిగుమతులపై ఆధారాన్ని తగ్గించడం, కాలుష్య ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే పాత వాహనాల ఇంజిన్లు, ఫ్యూయల్ సిస్టమ్‌పై E20 ప్రభావం చూపుతుందా? అనే అనుమానాలు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఐఐటీ కాన్పూర్ పరిశోధనల్లో E20 వల్ల ఇంజిన్ నష్టానికి స్పష్టమైన ఆధారాలు లభించలేదని పేర్కొన్న నివేదికలు కూడా ఉన్నాయి.కొత్త చర్చకు తెరదేశవ్యాప్తంగా E20 వినియోగం విస్తరిస్తున్న సమయంలో రాయ్‌పూర్ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఇంధన విధానం, వాహన తయారీ సంస్థల బాధ్యత, వినియోగదారుల హక్కులపై ఈ తీర్పు ప్రభావం చూపే అవకాశం ఉంది. -
మీకు ఈ20 పెట్రోల్ ఇబ్బందిని వివరిస్తా
న్యూఢిల్లీ: ఇంధన ప్రమాణాలకు అనుగుణంగా లేని వాహనాల్లో ఇథనాల్ కలిపిన ఈ20 పెట్రోల్ వాడాలనడంపై వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. పెట్రోల్ పంపుల్లో స్వచ్ఛమైన పెట్రోల్, ఈ20 పెట్రోల్‌ను ఎంపిక చేసుకునే అవకాశం వాహన యజమానులకు అందుబాటులో ఉండాలన్నారు. తక్కువ మైలేజీ ఇస్తుందన్న ఆందోళన నేపథ్యంలో ఈ20 పెట్రోల్ ధరను తగ్గించాలని కేజ్రీవాల్ కోరారు. వినియోగదారుల గళం వినిపించేందుకు తనకు అపాయింట్మెంట్ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరారు.ఈ మేరకు కేజ్రీవాల్ మంగళవారం ఒక లేఖ రాశారు. వివిధ వర్గాల ప్రజలను కలిసినప్పుడు వ్యక్తమైన అభిప్రాయాలు, ఇందులో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులను ప్రధాని మోదీకి వివరిస్తానన్నారు. ‘2023కు ముందు తయారైన 30 కోట్ల రిజిస్టర్డ్ ద్విచక్ర వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు ఈ20 ఇంధన ప్రమాణాలకు అనుకూలంగా లేవు.ఈ వాహనాల ఓనర్ మాన్యువల్స్‌లో సాధారణంగా స్వచ్ఛమైన పెట్రోల్, కొన్ని సందర్భాల్లో ఈ10 పెట్రోల్‌ను మాత్రమే ఉపయోగించాలని సూచించారని, ఈ20 పెట్రోల్‌ను కాదు’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ అంశంపై తమ పార్టీ ఆన్లైన్లో సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టిందని చెప్పారు. ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభిస్తే వీటిని కూడా ఆయనకు చూపెడతానని చెప్పారు. -
‘ఈ20’తో మైలేజ్ తగ్గిందా? అసలు నిజమిదే!
భారతదేశంలో ఈ20 (20% ఇథనాల్ కలిపిన పెట్రోల్) చుట్టూ గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ప్రముఖ యూట్యూబర్, వ్లాగర్ సౌరవ్ జోషి తన మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ ఎస్యూవీ (జీఎల్సీ) మైలేజ్ ఈ20 పెట్రోల్ వాడటం వల్ల భారీగా పడిపోయిందంటూ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, లగ్జరీ కార్ల దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ ఇండియా అధికారికంగా స్పందించడం, ఆ తర్వాత సదరు యూట్యూబర్ తన తప్పు తెలుసుకోవడంతో ఈ వివాదానికి తెరపడింది.వివాదానికి కారణం ఏంటి?సామాజిక మాధ్యమంలో అధిక ఫాలోవర్లు ఉన్న సౌరవ్ జోషి తన మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీలో లోకల్ బంకులో పెట్రోల్ కొట్టించిన 48 గంటల్లోనే మైలేజ్ లీటరుకు 17 కిలోమీటర్ల నుంచి ఏకంగా 5 కిలోమీటర్లకు పడిపోయిందని ఆరోపించారు. ఫుల్ ట్యాంక్ చేస్తే 800 కిమీ రావాల్సిన రేంజ్ కేవలం 480 కిమీ మాత్రమే చూపిస్తోందని డిజిటల్ మీటర్ స్క్రీన్‌ను వీడియోలో చూపించారు. ‘ఇదంతా ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వల్లే జరిగింది. ఇంజిన్ ఎప్పుడు పాడైపోతుందో అని భయమేస్తోంది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వాహనదారుల్లో ఆందోళన రేకెత్తించాయి.మెర్సిడెస్ బెంజ్ అధికారిక స్పందనఈ వీడియో వైరల్ కావడంతో మెర్సిడెస్ బెంజ్ ఇండియా స్పందిస్తూ కస్టమర్ అడ్వైజరీని విడుదల చేసింది. ‘మెర్సిడెస్ బెంజ్ సంస్థకు కస్టమర్ల భద్రత, వాహన విశ్వసనీయత అత్యంత ప్రాధాన్యత కలిగినవి. భారతదేశంలో విక్రయించే అన్ని మెర్సిడెస్ బెంజ్ (BS6) పెట్రోల్ వాహనాలు ఈ20 ఇంధనానికి పూర్తిగా అనుకూలమైనవి. మైలేజ్ తగ్గడానికి ఇంధనం మాత్రమే కారణం కాదని.. డ్రైవింగ్ శైలి, ట్రాఫిక్ పరిస్థితులు, టైర్ ప్రెజర్, ఇంజిన్ సెన్సార్ల వంటి పలు అంశాలపై అది ఆధారపడి ఉంటుంది’ అని కంపెనీ స్పష్టం చేసింది.యూట్యూబర్ యూ-టర్న్మెర్సిడెస్ బెంజ్ స్పందన తర్వాత, సౌరవ్ జోషి తన కారును కంపెనీ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ సాంకేతిక నిపుణులు తనిఖీ చేయగా అసలు సమస్య ఇంధనంలో లేదు, కారు ఇంజిన్‌లో ఉన్న ఒక సాంకేతిక లోపం వల్లే మైలేజ్ అంత దారుణంగా పడిపోయిందని తేలింది. దీనితో సౌరవ్ జోషి వెంటనే స్పందిస్తూ.. అవగాహన లోపంతో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈ20 ఇంధనం వల్ల సమస్య రాలేదని, ఇంజిన్ లోపం వల్లే అలా జరిగిందని స్పష్టం చేస్తూ తన పాత వీడియోలోని ఆ భాగాన్ని కూడా తొలగించారు.ఈ20 ఇంధనంపై నిపుణులు ఏమంటున్నారు?ఆటోమొబైల్ ఇంజినీర్ల ప్రకారం.. ఇథనాల్‌కు ప్యూర్ పెట్రోల్‌తో పోలిస్తే ఎనర్జీ డెన్సిటీ కాస్త తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఈ20 ఇంధనాన్ని వాడినప్పుడు సాధారణ మైలేజ్ కంటే కేవలం 3-5% వరకు మాత్రమే మైలేజ్ తగ్గే అవకాశం ఉంది. అంతేకానీ, లీటరుకు 17 కిమీ ఇచ్చే కారు 5 కిమీకి పడిపోయే అవకాశం లేదని చెబుతున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరల్లో స్పల్ప ఊరట -
E20పై రచ్చ.. మైలేజీపై గడ్కరీ ‘లాజిక్’ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎథనాల్ కలిపిన పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ మరింత వేడెక్కింది. E20 వాడకంతో వాహనాల మైలేజీ తగ్గుతోందంటూ పలువురు వాహనదారులు ఫిర్యాదులు చేస్తున్న వేళ.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మైలేజీ తగ్గిందనే వాదనలపై స్పందించిన ఆయన.. సాధారణంగా వాహనదారులు మైలేజీని కచ్చితంగా కొలవలేరని అంటున్నారు.ఓ ఇంటర్వ్యూలో ఓ జర్నలిస్ట్ తన కారు మైలేజీ E20 పెట్రోల్ వాడకం తర్వాత భారీగా తగ్గిందని ప్రస్తావించారు. 2023లో కొనుగోలు చేసిన తన కారు గతంలో లీటర్‌కు 11 కిలోమీటర్లు ఇచ్చేదని, ప్రస్తుతం 7 కిలోమీటర్లకు పడిపోయిందని ఆమె తెలిపారు. దీనిపై స్పందించిన గడ్కరీ.. మైలేజీని ఎలా లెక్కించారని ప్రశ్నించారు.డ్యాష్‌బోర్డ్‌లో కనిపించే మైలేజీ ఆధారంగానే లెక్కించినట్లు జర్నలిస్ట్ చెప్పగా.. "కారు మైలేజీని మీరు, నేను కచ్చితంగా చెక్ చేయలేం. కంపెనీ అధీకృత డీలర్ వద్ద ఉన్న పరికరాలతోనే సరైన పరీక్ష చేయగలం" అని గడ్కరీ పేర్కొన్నారు. సరైన అంచనా కోసం కంపెనీ అధీకృత డీలర్ల వద్ద పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు.మైలేజీ అంటే ప్రయాణించిన దూరాన్ని ఖర్చైన ఇంధన లీటర్లతో భాగించడం మాత్రమే కాదు. అలా లెక్కించడం ఒక అపోహ. వాహనం అసలు మైలేజీ తెలుసుకోవాలంటే ప్రత్యేకమైన పరికరాలతో సర్వీస్ సెంటర్లో పరీక్షించాలి.Mileage is not distance divided by litres of fuel burnt. This is a misconception. You have to go to a service station where a special mileage computer can only tell the mileage. Science is done, now finish the mathspic.twitter.com/5YtZJOk53t— Kamlesh Singh / Tau (@kkstau) July 13, 2026E20పై ఎందుకు వివాదం?కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ కలిపిన E20 ఇంధనాన్ని దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, రైతులకు ప్రయోజనం కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే E20 పెట్రోల్ కారణంగా వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతోందని కొంతమంది వాహనదారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పాత మోడల్ కార్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ కూడా కొన్ని వాహనాల్లో E20 వల్ల 3 నుంచి 5 శాతం వరకు ఇంధన సామర్థ్యం తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. అయితే మైలేజీ ఒక్కటే వాహనం పనితీరును అంచనా వేసే ప్రమాణం కాదని స్పష్టం చేసింది.మైలేజీని ఎలా లెక్కించాలి?ఆటోమొబైల్ నిపుణుల ప్రకారం.. కార్లలో కనిపించే డిజిటల్ మైలేజీ రీడింగ్ ఒక అంచనా మాత్రమే. వాస్తవ మైలేజీ తెలుసుకోవడానికి సాధారణంగా "ఫుల్ ట్యాంక్ మెథడ్"ను ఎక్కువగా నమ్ముతారు. దీని ప్రకారం.. ముందుగా ఇంధన ట్యాంక్‌ను పూర్తిగా నింపుకుని ట్రిప్ మీటర్‌ను రీసెట్ చేయాలి. ఆ తర్వాత సాధారణంగా వాహనం నడిపి, మళ్లీ ట్యాంక్ నింపినప్పుడు ఎన్ని లీటర్ల ఇంధనం పట్టిందో లెక్కించాలి. ప్రయాణించిన దూరాన్ని వినియోగించిన ఇంధనంతో భాగిస్తే వాస్తవ మైలేజీకి దగ్గరగా అంచనా వస్తుంది.డీలర్ టెస్టులో ఏం చూస్తారు?కంపెనీ అధీకృత డీలర్ల వద్ద ఉండే డయాగ్నస్టిక్ పరికరాలు కేవలం మైలేజీనే కాకుండా.. ఇంజిన్ పనితీరు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, ఆక్సిజన్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ (ECU)లోని వివరాలను కూడా పరిశీలిస్తాయి. ఇంధన వినియోగం పెరగడానికి కారణమయ్యే సాంకేతిక లోపాలను గుర్తించడంలో ఇవి ఉపయోగపడతాయి. అయితే వాహనం నడిపే విధానం, ట్రాఫిక్ పరిస్థితులు, ఏసీ వినియోగం, టైర్ ప్రెజర్, వాహన బరువు వంటి అంశాలు కూడా మైలేజీపై ప్రభావం చూపుతాయి.విధానానికి మద్దతు.. వినియోగదారుల సందేహాలుE20 విధానాన్ని కేంద్రం ఇంధన భద్రత, పర్యావరణ ప్రయోజనాల కోణంలో సమర్థిస్తోంది. మరోవైపు వాహనదారులు మాత్రం తమకు ఎదురవుతున్న మైలేజీ సమస్యలపై స్పష్టత కోరుతున్నారు. ఈ నేపథ్యంలో గడ్కరీ వ్యాఖ్యలు E20పై జరుగుతున్న చర్చకు మరో కోణాన్ని జోడించాయి. మైలేజీ తగ్గుదలపై నిజమైన అంచనాకు సరైన పరీక్షా విధానం అవసరమని ఆయన సూచించగా.. వినియోగదారుల అనుభవాలు, ప్రభుత్వ వాదనల మధ్య చర్చ మాత్రం కొనసాగుతోంది. -
దేశంలో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా?
న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో పలు అంశాలపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో దీని ప్రభావం ఇంధన రవాణాపై మరోసారి పడే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జూలై 19న ఈ సమావేశం జరగనుంది. ఇందులో ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ఉత్కంఠ నెలకొంది. దేశంలో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. వాటికి ఒక రోజు ముందు (జులై 19న) ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ప్రాధాన్యం ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరాలు తెలియజేయనుందని చెబుతున్నారు.జులై 19 ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందువల్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎజెండాపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, వారి ప్రతినిధులకు ఆహ్వానం పంపుతోంది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు తమ ప్రశ్నలను కూడా ప్రభుత్వం ముందుంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఇదిలా ఉంటే, ఈ వర్షాకాల సమావేశాల్లో దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. చట్టం-శాంతిభద్రతల నుంచి సరిహద్దు భద్రత వరకు పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం అంశంతో పాటు రామ మందిరంలో విరాళాల చోరీ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది. -
‘‘ఈ20 పెట్రోల్‌తో మైలేజ్ ఎన్నడూ లేనంతగా పడిపోయింది’’
భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్లాగర్ సౌరవ్ జోషి ఈ20 పెట్రోల్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. "కారు ఇంతకుముందు 17 కిలోమీటర్లు/లీటర్ మైలేజ్ ఇచ్చేది. అది మొదట 9 కిలోమీటర్లు/లీటర్‌కు పడిపోయింది. ఇప్పుడు మరింత తగ్గి కేవలం 5 కిలోమీటర్లు/లీటర్ మాత్రమే ఇస్తోంది" అని తెలిపారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్లే తన కారు మైలేజ్ భారీగా పడిపోయిందని ఆయన ఆరోపించారు. 41 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లున్న తన యూట్యూబ్ ఛానల్లో ఇటీవల అప్లోడ్ చేసిన ‘రేస్ విత్ బ్రదర్స్. కోన్ జీతేగా?’ అనే వీడియో వ్లాగ్‌లో, తన మెర్సిడెస్-బెంజ్ ఎస్యూవీ డ్యాష్‌బోర్డ్‌లో కనిపిస్తున్న వివరాలను చూపిస్తూ అసహనం వ్యక్తం చేశారు.సౌరవ్ జోషి ఏమన్నారు? ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న జోషి.. కేవలం 48 గంటల్లోనే తన కారు మైలేజ్ ఎన్నడూ లేనంతగా పడిపోయిందని చెప్పారు. “నిన్న మన కారు మైలేజ్ 17 నుంచి నేరుగా 9కి పడిపోయిందని చూపించాను. ఈ రోజు అది ఎంత అయిందో తెలుసా? ఇప్పుడు అది 5కి చేరింది... చూడండి, మైలేజ్ 5 అని చూపిస్తోంది” అని జోషి చెప్పారు.పూర్తి వీడియో ఇది.. ఈ వీడియోలో 4 నిమిషాల తర్వాత జోషి ఈ20 గురించి మాట్లాడారు.. స్థానిక పెట్రోల్ బంకుల్లో లభిస్తున్న ఇంధనంపైనే జోషి నింద మోపారు. “ఇథనాల్ వల్లే ఇలా జరిగింది” అని ఆయన అన్నారు. ఆయనతో పాటు వ్లాగ్‌లు చేసే ఆయన భార్య అవంతికా భట్ కూడా స్పందిస్తూ.. “ఈ కారు కోసం ఎంత డబ్బు ఖర్చు చేశాం!” అని అన్నారు.గతంలో ఒకసారి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ నింపితే సుమారు 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని చూపించేదని, ఇప్పుడు మాత్రం ట్యాంక్ నింపిన వెంటనే కేవలం 480 కిలోమీటర్ల రేంజ్ మాత్రమే చూపిస్తోందని చెప్పారు. ఈ భారీ తగ్గుదల వల్ల జర్మనీకి చెందిన ఈ ఎస్‌యూవీలోని పెట్రోల్ ఇంజిన్ దెబ్బతింటుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.“ఈ కారు ఎప్పుడు ఆగిపోతుందో నాకు తెలియదు... ఇప్పుడు పెట్రోల్ నింపించాలంటేనే భయంగా ఉంది” అని చెప్పారు. తన దగ్గర మరో మెర్సిడెస్ ఎస్యూవీ జీ-వాగన్ విద్యుత్ వెర్షన్ కూడా ఉందని, దాంతో ఇథనాల్‌పై ఆందోళన ఉండదని చెప్పారు. విలాసవంతమైన కారులో యాంత్రిక లోపం వస్తే నగర శివార్లు, చిన్న పట్టణాల్లో నివసించే వారికి పెద్ద ఇబ్బందిగా మారుతుందని కూడా చెప్పారు.“ఇది మెర్సిడెస్ కారు కదా. సమస్య వస్తే ఢిల్లీకి పంపాల్సి వస్తుంది... పెట్రోల్ ఖరీదైనదే కాదు, కారు చెడిపోతే మరమ్మతుల ఖర్చు కూడా చాలా ఎక్కువ” అని చెప్పారు. ఈ వీడియోలోని భాగం ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది.ప్రభుత్వం ఏమంటోంది?కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాకుండా, ముడి చమురు దిగుమతులను తగ్గించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) అందుబాటులోకి తీసుకురావాలని భారత్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. అయితే, ఎక్కువ ఇథనాల్ ఉన్న ఇంధనాన్ని పాత ఇంజిన్లు తట్టుకోగలవా అనే ఆందోళనను కారు యజమానుల్లో కనపడుతోంది.కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఈ20 పెట్రోల్ వల్ల తుప్పు వస్తుందనే ఆరోపణలను తిరస్కరించారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పోస్టులను తప్పుడు ప్రచారంగా పేర్కొన్నారు. విమర్శలు చేస్తున్నవారు స్పష్టమైన ఆధారాలు చూపాలని సవాలు చేశారు. “ఈ20 పెట్రోల్ వల్ల ఏ కారూ సమస్య ఎదుర్కొన్న ఉదాహరణ లేదు... సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం అంతా సమన్వయంతో చేస్తున్న తప్పుడు కథనం” అని చెప్పారు.Vlogger Saurabh Joshi"My car mileage has dropped from 17 to 9, today it further dropped to 5All this is because of Ethanol, it's so dishearteningI spent so much money on this car and look at the condition,all becoz of Ethanol"The relaity is slowly hitting everyone !! pic.twitter.com/LPU0l2pomr— Nehr_who? (@Nher_who) July 12, 2026 -
అవును, ఈ20తో మైలేజీ కట్!
న్యూఢిల్లీ: ఇథనాల్ కలిపిన పెట్రోల్ కారణంగా మైలేజీ పడిపోతోందని, వాహనాల ఇంజిన్లు పాడైపోతున్నాయంటూ దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు చెలరేగుతున్న నేపథ్యంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖ దీనిపై శుక్రవారం కీలక వివరణ ఇచ్చింది. 20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ20) కారణంగా మైలేజీ 3–5 శాతం మేర తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది. అయితే, అధిక ఆక్టేన్ రేటింగ్, మెరుగైన పికప్, స్మూత్ యాక్సెలరేషన్, తక్కువ కాలుష్యం వల్ల పర్యావరణానికి మేలు, దేశానికి ఇంధన భద్రత వంటి పలు ప్రయోజనాలతో పోలిస్తే, ఈ ప్రభావం చాలా తక్కువేనని వాదించడం విశేషం. ఈ10 లేదా స్వచ్ఛమైన పెట్రోల్ తో పోలిస్తే ఈ20 మరింత పర్యావరణహితమైనదే కాకుండా అధిక నాణ్యత, సామర్థ్యంతో కూడినదని పేర్కొంది. చాలా ఏళ్ల శాస్త్రీయ పరీక్షలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలతో సంప్రదింపులతో పాటు దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి పెంచిన తర్వాతే దీన్ని ప్రవేశపెట్టామని తెలిపింది. 2001లోనే పైలట్ ప్రాజెక్టులు... పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే కార్యక్రమాన్ని చాలా వేగంగా అమల్లోకి తెచ్చారన్న ఆందోళనలను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కు సంబంధించిన పైలట్ ప్రాజెక్టులను 2001లోనే భారత్ మొదలు పెట్టిందని, 2006లో దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో 5% మిశ్రమంతో దీన్ని ప్రారంభించినట్లు వివరించింది. కాగా, 2014 వరకు ఇథనాల్ మిశ్రమం 1.5% స్థాయిలోనే ఉండగా.. 2018లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ బయో ఇంధన పాలసీ, ఫీడ్‌స్టాక్‌గా చెరకుతో పాటు ఇతర వనరులను చేర్చడంతో జోరందుకుంది. ఇథనాల్ మిశ్రమం 2022లో 10%కి, 2025–26లో 20%కి చేరుకుందని పెట్రోలియం శాఖ పేర్కొంది. పాత వాహనాల్లో సమస్యలు తలెత్తుతున్నాయన్న ఆందోళనపై స్పందిస్తూ.. దేశవ్యాప్తంగా ఈ20ని ప్రవేశపెట్టడానికి ముందే ఇంజిన్ మన్నిక నుంచి ఫ్యూయల్ సిస్టమ్స్, డ్రైవింగ్ పరిస్థితులు, కాలుష్య ఉద్గారాల వంటి వాటిపై విస్తృతమైన పరీక్షలు జరిగాయని స్పష్టం చేసింది. మారుతీ, హీరో మోటోకార్ప్ సహా పలు వాహన కంపెనీలు కూడా ఈ20 వల్ల విడిభాగాలు తుప్పుపట్టడం, అసాధారణమైన సమస్యలు లేదా దెబ్బతినడం వంటివేమీ లేవని నివేదించాయని తెలిపింది. మరోపక్క, బంకుల్లో ప్యూర్ పెట్రోల్‌తో పాటు ఈ10, ఈ20.. ఇలా వివిధ గ్రేడ్లను అందుబాటులో ఉంచాలన్న డిమాండ్లను మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. 1 లక్షకు పైగా ఉన్న బంకుల్లో ఇలా నిర్వహించాలంటే, రవాణా ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో పాటు ఇంధన పంపిణీ సంక్లిష్టంగా మా రుతుందని తేల్చిచెప్పింది.రూ.1.97 లక్షల కోట్లకు పైగా ఆదా ఇథనాల్ మిశ్రమ ప్రోగ్రామ్ ముఖ్యోద్దేశం, పెట్రోలు ధరల తగ్గింపు కంటే క్రూడ్ దిగుమతులపై ఆధారపడటాన్ని భారీగా తగ్గించడమేనని పెట్రోలియం శాఖ పేర్కొంది. తద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు ధరల స్థిరీకరణకు వీలవుతుందని అభిప్రాయపడింది. ఇథనాల్ మిశ్రమంతో రూ.1.97 లక్షల కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందని, 316 లక్షల టన్నుల క్రూడ్ దిగుమతులు తగ్గాయని తెలిపింది. 952 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గడంతో పాటు 2014–15 నుంచి చూస్తే, రైతులకు రూ.1,66 లక్షల కోట్లకు పైగా దక్కిందని వివరించింది.రవాణా రంగానికి భవిష్యత్తు హైడ్రోజన్: గడ్కరీ దేశంలో రవాణా పరిశ్రమకు భవిష్యత్తులో హైడ్రోజన్ ఇంధనమే దన్నుగా నిలుస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. దీన్ని భవిష్యత్తు ఇంధనంగా అభివరి్ణంచారు. దేశవ్యాప్తంగా 10 రూట్లలో హైడ్రోజన్ ఇంధన వాడకంపై ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో నోయిడా–ఢిల్లీ–ఆగ్రాతో పాటు ఎన్‌హెచ్ 16 విశాఖపట్నం–బయ్యవరం రూట్ ఉందన్నారు. -
‘మైలేజీ తగ్గుతుంది.. కానీ..’
దేశంలో పెరుగుతున్న కాలుష్యం, ఇంధన దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ20 (20% ఇథనాల్ మిశ్రమ పెట్రోల్) ఇంధనంపై వాహనదారుల్లో ఉన్న పలు అనుమానాలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెరదించారు. ఈ20 ఇంధనం వల్ల కారు మైలేజీ కొంతవరకు తగ్గుతుందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. అయితే, దీనివల్ల ఇంజిన్లు దెబ్బతింటాయనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.మైలేజీ తగ్గడానికి కారణం ఇదే..!సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ కేలరీల విలువ తక్కువగా ఉండటం వల్లే మైలేజీలో స్వల్ప వ్యత్యాసం ఉంటుందని గడ్కరీ వివరించారు. ‘ఇథనాల్, పెట్రోల్ మధ్య కేలరీల విలువలో వ్యత్యాసం ఉండటం వాస్తవం. అయితే మైలేజ్ అనేది కేవలం ఇంధనం పైనే కాకుండా డ్రైవింగ్ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ట్రాఫిక్ కారణంగా వాహనాలు తక్కువ గేర్లలో నడుస్తాయి. స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌లో నిరంతరం బ్రేకులు వేయడం వల్ల మైలేజ్ తగ్గుతుంది. అదే హైవేలపై గంటకు 100 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో వెళ్తే మైలేజీలో కొంత వ్యత్యాసాన్ని మాత్రమే గమనించవచ్చు’ అని నితిన్ గడ్కరీ అన్నారు.ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) నివేదిక ప్రకారం.. ప్రత్యేకంగా ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్లతో రూపొందించిన వాహనాలకు మైలేజ్ సామర్థ్యంతో ఎటువంటి సమస్య ఉండదని, అందుకే భవిష్యత్తులో ఫ్లెక్స్ ఇంజిన్ టెక్నాలజీని మరింత విస్తరించడంపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు.ఇంజిన్ దెబ్బతింటుందనేది తప్పుడు ప్రచారంఈ20 ఇంధనం వల్ల వాహన భాగాలు పాడవుతున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర మంత్రి ఖండించారు. ఇదంతా ఒక తప్పుడు కథనం సృష్టించే ప్రయత్నంలో భాగమేనన్నారు. ‘ఏఆర్ఏఐ, వాహన తయారీదారులు ఎన్నో క్షేత్రస్థాయి పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఈ20 ఇంధనాన్ని మార్కెట్లోకి తెచ్చారు. కొన్ని పాత మోడల్ వాహనాల్లో కొన్ని భాగాలపై స్వల్ప ప్రభావం ఉండే అవకాశం ఉంది. అందుకే, సర్వీసింగ్ సమయంలో ఆయా భాగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే వాహన తయారీ సంస్థలను కోరింది. ఈ20 ఇంధనం కారణంగా దెబ్బతిన్న ఒక్క కారునైనా నాకు చూపించండి’ అని గడ్కరీ సవాల్ విసిరారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
ఇథనాల్ ఇంధనంపై ముదిరిన వివాదం!
దేశవ్యాప్తంగా వాహనదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ20 (20 శాతం ఇథనాల్ మిశ్రమం) పెట్రోల్ వాడకంపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆటోమొబైల్ దిగ్గజాలకు ప్రశ్నలేవనెత్తారు. 2023 కంటే ముందు తయారైన పాత వాహనాల్లో ఈ ఇంధనాన్ని ఉపయోగించడం ఎంతవరకు సురక్షితమనే అంశంపై దేశంలోని ప్రముఖ 29 ఆటోమొబైల్ తయారీ సంస్థలకు ఆయన లేఖలు రాశారు. కంపెనీల అధికారిక మేనేజ్మెంట్ మాన్యువల్స్‌లో ఒకలా, ప్రభుత్వ వేదికలపై కంపెనీ ప్రతినిధులు మరోలా మాట్లాడుతున్నారని ఈ వైరుధ్యంపై వారంలోగా స్పష్టమైన లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీ ఆప్ యూనిట్ అధ్యక్షుడు సౌరభ్ భరద్వాజ్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ ఈ వివరాలను వెల్లడించారు.కంపెనీల ద్వంద్వ వైఖరిదేశంలోని ద్విచక్ర, నాలుగు చక్రాల వాహన తయారీదారులను ప్రశ్నిస్తూ కేజ్రీవాల్ రెండు రకాల లేఖలను పంపారు. మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్, హీరో మోటోకార్ప్ సంస్థలకు ప్రత్యేకంగా లేఖలు పంపారు. జులై 4న జరిగిన ప్రభుత్వ విలేకరుల సమావేశంలో ఈ మూడు కంపెనీలు మాట్లాడుతూ.. పాత వాహనాల్లో ఈ20 ఇంధనం వాడినా ఎటువంటి నష్టం జరగదని, మైలేజీ కేవలం 3% నుంచి 5% మాత్రమే తగ్గుతుందని పేర్కొన్నాయి. దేశంలోని మిగతా 26 ఆటోమొబైల్ కంపెనీలకు పంపిన లేఖలో.. పాత వాహనాల్లో ఈ20 వాడకంపై వారి అధికారిక స్టాండ్ ఏంటో స్పష్టం చేయాలని కోరారు.ఆందోళనకర వైరుధ్యం ఇదే!‘కంపెనీలు ప్రభుత్వ సమావేశంలో చెప్పే మాటలకు, వారు వినియోగదారులకు ఇచ్చే ఓనర్ మాన్యువల్స్‌కు పొంతన లేదు. 2023 కంటే ముందు తయారైన వాహనాల్లో 10% కంటే ఎక్కువ ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకూడదని ఆ మాన్యువల్స్‌లో స్పష్టంగా రాసి ఉంది. మరి ప్రభుత్వ ప్రెస్మీట్లో అంతా సురక్షితమేనని ఎలా చెబుతున్నారు? ఇది వినియోగదారులను మోసం చేయడం కాదా?’ అని అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.వాహనదారులకు నష్టపరిహారం ఇస్తారా?కంపెనీల ముందు కేజ్రీవాల్ ప్రధానంగా రెండు డిమాండ్లను ఉంచారు. ఒకవేళ E20 పెట్రోల్ సురక్షితమేనని కంపెనీలు లిఖితపూర్వకంగా చెబితే కింద పేర్కొన్న అంశాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.1. మైలేజీ నష్టానికి పరిహారం: కంపెనీలు చెబుతున్న 4% నుంచి 5% కంటే ఎక్కువగా (ఉదాహరణకు 10% పైగా) మైలేజీ పడిపోతే సదరు వినియోగదారుడికి కంపెనీలు నష్టపరిహారం చెల్లిస్తాయా?2. ఇంజన్ భాగాల వైఫల్యం: E20 ఇంధనం వాడకం వల్ల ఫ్యుయెల్ పంపులు, ఇంజన్ భాగాలు దెబ్బతింటే ఆ నష్టాన్ని భరించి ఉచితంగా రీప్లేస్ చేస్తామని కంపెనీలు గ్యారెంటీ ఇస్తాయా?గ్రౌండ్ రిపోర్ట్ కోసం పర్యటనలుప్రభుత్వం మొండిగా ప్రజలపై ఈ నిర్ణయాన్ని రుద్దుతోందని విమర్శించిన కేజ్రీవాల్ తన తదుపరి కార్యాచరణను ప్రకటించారు. క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలు తెలుసుకోవడానికి తానే స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు చెప్పారు. పలు పెట్రోల్ బంకులు, సర్వీస్ సెంటర్లు, మెకానిక్ షాపులను సందర్శించి వాహనదారుల, నిపుణుల ప్రత్యక్ష అనుభవాలను సేకరించనున్నారు.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ శాటిలైట్ ఫోన్ లాంచ్! -
ఈ85 పెట్రోల్ ఇంకా చౌక.. ఎంత తక్కువంటే..
దేశంలో ఇథనాల్ వినియోగాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. E85 (85 శాతం ఇథనాల్, 15 శాతం పెట్రోల్) ఇంధనాన్ని దశలవారీగా ప్రవేశపెడుతోంది. E85 ఫ్యూయల్ ధర E20 పెట్రోల్‌తో పోలిస్తే లీటరుకు సుమారు రూ.20 తక్కువ ఉండే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు.అయితే ఈ ఇంధనాన్ని ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ చమురు సంస్థల 48 పెట్రోల్ బంకుల్లో E85 విక్రయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.సీఎన్ఎన్-న్యూస్18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి మాట్లాడుతూ, ఇంధన వ్యయాన్ని తగ్గించడం, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధార పడటాన్ని తగ్గించడం, దేశీయ ఇథనాల్ ఉత్పత్తికి ఊతమివ్వడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు. ఇథనాల్ మిశ్రమాలపై నడిచే వాహనాలకు వారంటీ, బీమా వంటి అంశాలపై ఉన్న సందేహాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు.E20పై అపోహలు అవసరం లేదుE20 పెట్రోల్ వాడితే ఇంజిన్ దెబ్బతింటుందనే ప్రచారాన్ని కేంద్ర మంత్రి ఖండించారు. కోట్లాది ద్విచక్ర, లక్షలాది నాలుగు చక్రాల వాహనాలు ఇప్పటికే E20పై ఎలాంటి ప్రధాన సమస్యలు లేకుండా నడుస్తున్నాయని, వాహన తయారీ సంస్థలు కూడా యాంత్రిక లోపాలపై విస్తృతంగా ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని చెప్పారు. ఇథనాల్ వల్ల మైలేజ్‌లో స్వల్ప తగ్గుదల ఉండొచ్చని అంగీకరించినప్పటికీ, తక్కువ కార్బన్ ఉద్గారాలు, విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం వంటి ప్రయోజనాలు మరింత ముఖ్యమని వివరించారు.E25 ఇంకా పరీక్షల దశలోనే..ఇక E25 (25 శాతం ఇథనాల్ మిశ్రమం)ను వెంటనే మార్కెట్లోకి తీసుకురావడం లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం విస్తృత పరీక్షలు జరుగుతున్నాయని, వాటి ఫలితాలు వచ్చిన తర్వాత వాహన తయారీ సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చించి మాత్రమే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కాబట్టి E25 వాణిజ్య విక్రయంపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.ప్రభుత్వం జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విస్తరణకూ సమాన ప్రాధాన్యం ఇస్తోందని, ఇంధన భద్రత, పర్యావరణ పరిరక్షణ, రైతుల ఆదాయ వృద్ధి లక్ష్యాలతో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఈ చర్యలు కొనసాగుతాయని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. -
ఇథనాల్ పెట్రోల్.. నాకు, నా కుటుంబానికి పైసా లాభం లేదు: గడ్కరీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌పై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటు రాజకీయంగానూ కొంతకాలంగా.. కొన్ని రకాల ప్రచారాలు, ఊహాగానాలు, ఆరోపణలు తెర మీదకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ పెట్రోల్‌తో గడ్కరీ కుటుంబం విపరీతంగా లాభపడుతోందని.. ఆ ఉద్దేశంతో ఆయన ఈ విధానాన్ని ప్రొత్సహిస్తున్నారన్నది ఆ ఆరోపణల సారాంశం. అయితే ఇథనాల్ విధానాన్ని తానే రూపొందించి.. వ్యక్తిగతంగా లాభపడుతున్నానన్న ఆరోపణలను ఆయన పూర్తిగా కొట్టిపారేశారు. అంతేకాదు ఈ20 పెట్రోల్‌తో వాహనాలు దెబ్బతింటున్నాయనే ఘటనకు ఆధారాలు ఉంటే చూపించాలని సవాల్ విసిరారు. తాజాగా ఆయన ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇథనాల్ మిశ్రమ ఇంధన విధానం ఒక వ్యక్తి నిర్ణయం కాదు. దాని వెనుక నేను మాత్రమే ఉన్నానన్నది ఆరోపణలే. శాస్త్రీయ పరిశోధనలు, పెట్రోలియం శాఖ, కేంద్ర మంత్రివర్గం సంప్రదింపుల తర్వాతే అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఇథనాల్ ఉత్పత్తి చేసే కంపెనీల్లో తన కుటుంబానికి(కుమారులకు) సంబంధాలున్నాయనే విమర్శలపై స్పందించిన గడ్కరీ.. తమ కుటుంబం చెరుకు పరిశ్రమలో చాలాకాలం కిందటే ఉందని గుర్తుచేశారు. అంతేకాదు.. ప్రస్తుతం దేశంలో సుమారు 550 ఇథనాల్ ఉత్పత్తి యూనిట్లు ఉండగా.. అందులో తన వాటా చాలా కొద్దిమాత్రమేనని చెప్పారు. "నా వాటా 0.07 శాతం మాత్రమే. అంత చిన్న వాటాతో దేశ ఇథనాల్ విధానాన్ని నా ప్రయోజనం కోసం ప్రభావితం చేయడం అసాధ్యం. ఈ విధానం వల్ల నాకు వ్యక్తిగతంగా ఎలాంటి లాభం లేదు. పైసా రాదు" అని గడ్కరీ స్పష్టం చేశారు.ఆధారాలు చూపండి.. ఈ20 పెట్రోల్ వాడితే ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలపై కూడా గడ్కరీ తీవ్రంగా స్పందించారు. "ఈ20 వల్ల ఎవరి వాహనం దెబ్బతిన్నా డీలర్‌కు, మా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేయండి. మేం విచారణ చేసి న్యాయం చేస్తాం. మీకు వ్యక్తిగతంగా తెలిసిన ఇద్దరి వాహనాలైనా ఈ20 కారణంగా దెబ్బతిన్నాయని చెప్పగలరా?" అంటూ ప్రశ్నించారు.ప్రముఖ కంపెనీల నుంచి ఫిర్యాదుల్లేవుదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలైన మారుతీ సుజుకీ, టయోటా, టాటా మోటర్స్, మహీంద్రా&మహీంద్రా నుంచి ఈ20 ఇంధనం కారణంగా వాహనాలు దెబ్బతిన్నాయని ఎలాంటి అధికారిక ఫిర్యాదులు రాలేదని మంత్రి తెలిపారు. ఇటీవల టయోటా కారుకు సంబంధించిన ఓ ఘటనలో కూడా ఇథనాల్ కారణం కాదని.. ఇంధనంలో నీరు కలవడమే సమస్యకు కారణమని విచారణలో తేలిందని చెప్పారు.నాలుగేళ్ల పరీక్షల తర్వాతే అనుమతిఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని హడావుడిగా తీసుకొచ్చిన ప్రాజెక్ట్ కాదని గడ్కరీ వివరించారు. వాహనాలను నాలుగేళ్లపాటు పరీక్షించి, లక్షల కిలోమీటర్లు నడిపిన తర్వాతే అనుమతులు ఇచ్చారని చెప్పారు. ఇది ప్రయోగాత్మక విధానం కాదని, శాస్త్రీయంగా నిర్ధారించిన ప్రక్రియ అని పేర్కొన్నారు.రైతులకు లాభం.. దిగుమతులు తగ్గుతాయితాను ఇథనాల్‌ను మాత్రమే కాదు, ప్రత్యామ్నాయ ఇంధనాలన్నింటినీ ప్రోత్సహిస్తున్నానని గడ్కరీ తెలిపారు. ఇథనాల్ వినియోగం పెరగడం వల్ల విదేశాల నుంచి ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని చెప్పారు. దేశ ఇంధన భద్రతకు కూడా ఇది కీలకమని అభిప్రాయపడ్డారు.నాపై దుష్ప్రచారం చేస్తోంది.. ఇథనాల్ విధానంపై వస్తున్న వివాదం వెనుక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయని గడ్కరీ ఆరోపించారు. తన ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు ఇథనాల్ కార్యక్రమాన్ని అపఖ్యాతిపాలు చేయాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు.ప్రపంచమంతా ఇదే దారిఇథనాల్ వినియోగంలో భారత్ కొత్త ప్రయోగం చేయడం లేదని గడ్కరీ గుర్తు చేశారు. అమెరికా, బ్రెజిల్, జపాన్, జర్మనీ, థాయ్‌లాండ్, స్వీడన్ ఇలా.. అనేక దేశాల్లో ఇప్పటికే ఇథనాల్ మిశ్రమ ఇంధనం విజయవంతంగా వినియోగిస్తున్నారని చెప్పారు.అసలు ఈ20 వివాదం ఏంటి?ఈ20 అంటే 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమం. కాలుష్యం తగ్గించడం, చమురు దిగుమతులను తగ్గించడం, చెరకు వంటి పంటలకు డిమాండ్ పెంచి రైతుల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన లక్ష్యాలు. అయితే పాత మోడల్ వాహనాల్లో దీర్ఘకాలంలో ఇంజిన్, మైలేజ్‌పై ప్రభావం ఉంటుందా అనే సందేహాలు కొందరు వాహనదారులు, ఆటోమొబైల్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ20 వల్ల వాహనాలకు నష్టం జరిగిందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతోంది. -
ఇథనాల్ వినియోగం.. ప్రభుత్వం కొత్త ప్లాన్!
భారతదేశంలో పెట్రోల్ వినియోగంలో మరో కీలక మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ అందుబాటులో ఉండగా, త్వరలో E25 పెట్రోల్ (75 శాతం పెట్రోల్ + 25 శాతం ఇథనాల్) తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ప్రస్తుతం ఈ20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజిన్ పనితీరు, మైలేజీ, ఇంధన వ్యవస్థలపై ఎలాంటి ప్రభావం పడుతోందో అనే అంశాల గురించి కేంద్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే.. ఆటోమొబైల్ కంపెనీలు, ఇంధన రంగ నిపుణుల నుంచి వచ్చిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకుంటోంది. కాబట్టి ఈ25 పెట్రోల్ అమలుకు సంబంధించిన ప్రకటన త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంటుంది.ఇథనాల్ మిశ్రమాన్ని పెంచే విషయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు.. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంధనంలో ఇథనాల్ శాతం పెరిగితే వాహనాల పనితీరుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.ఇప్పటికే దేశంలోని చమురు శుద్ధి సంస్థలు E25 పెట్రోల్ సరఫరాకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే.. కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతి వచ్చిన తర్వాత మాత్రమే మార్కెట్లో E25 ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి. భారత్ ఇప్పటికే ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ కార్యక్రమంలో మంచి పురోగతి సాధించింది.2030 నాటికి దేశవ్యాప్తంగా E20 అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆ లక్ష్యం ఐదేళ్ల ముందే సాధ్యమైంది. అయితే ఇప్పుడు అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాల కోసం ప్రభుత్వం కొన్ని కీలక చర్యలు చేపట్టింది. E25 మాత్రమే కాకుండా E22, E27, E30 పెట్రోల్‌కు సంబంధించిన ప్రమాణాలను కూడా ప్రకటించింది. అంతేకాకుండా.. అధిక ఇథనాల్ కలిగిన పెట్రోల్‌కు పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కూడా తగిన సన్నాహాలు చేస్తోంది.ఇదీ చదవండి: E20తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ..!అయితే.. E25 పెట్రోల్ ఎప్పుడు పూర్తిస్థాయిలో మార్కెట్లోకి వస్తుందనే విషయంపై ప్రభుత్వం అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తే, భవిష్యత్తులో ఇథనాల్ శాతం మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. -
E20తో మైలేజీ తగ్గొచ్చు.. కానీ..!
భారత్‌లో E20 పెట్రోల్‌పై పెద్ద చర్చ జరుగుతున్న తరుణంలో.. మహీంద్రా కంపెనీ కీలక ప్రకటన చేసింది. తమ వాహనాల్లో E20 వినియోగంపై కీలక స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.కంపెనీ అధికారికంగా ఇచ్చిన ప్రకటనలో, తమ వాహనాల్లోని ఇంజిన్లు ప్రస్తుత పెట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, అన్ని వాహనాలు E20తో పనిచేస్తాయని పేర్కొంది. అయితే.. 2025 ఏప్రిల్ 1 తర్వాత తయారైన కొత్త మోడళ్లు ప్రత్యేకంగా E20 కోసం ట్యూన్ చేసినట్లు వెల్లడించింది. వీటిలో మెరుగైన యాక్సిలరేషన్, ఇంధన సామర్థ్యం ఉండేలా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది.2025 ఏప్రిల్‌కు ముందు తయారైన వాహనాలు కూడా E20 పెట్రోల్‌తో సురక్షితంగానే నడుస్తాయని మహీంద్రా స్పష్టం చేసింది. అయితే డ్రైవింగ్, రోడ్డు పరిస్థితులపై ఆధారపడి మైలేజీలో లేదా పికప్‌లో చిన్న మార్పులు కనిపించవచ్చని పేర్కొంది.ఈ20 పెట్రోల్ ఇంజిన్‌కు హాని చేయదు, కేవలం ఇంధనంలో ఎనర్జీ కంటెంట్ కొంచెం తక్కువగా ఉండటం వల్ల మైలేజీ స్వల్పంగా తగ్గే అవకాశం మాత్రమే ఉంటుందని మహీంద్రా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో E20పై అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో కంపెనీ ఈ వ్యాఖ్యలు చేసింది.ఇతర కంపెనీల స్పందనE20 పెట్రోల్ విడుదలను సమర్థిస్తూ టయోటా, మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్, హ్యుందాయ్ ప్రతినిధులు పాల్గొన్న ప్రభుత్వ పత్రికా సమావేశం జరిగిన కొద్దిసేపటికే మహీంద్రా ఈ వివరణ ఇచ్చింది.అయితే కొంతమంది వాహన వినియోగదారులు మైలేజీ తగ్గిందని చెబుతున్నారని కూడా వారు అంగీకరించారు. -
E20తో మైలేజీ తగ్గిందా?: సర్వేలో సంచలన విషయాలు!
దేశం ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, రైతులకు అదనపు ఆదాయం కల్పించడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచుతోంది. ఇందులో భాగంగానే E20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్) వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. అయితే.. ఈ నిర్ణయం పాత పెట్రోల్ వాహనాల యజమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.ఇటీవల లోకల్‌సర్కిల్స్ ఒక సర్వే నిర్వహించింది. ఇందులో దేశంలోని 316 జిల్లాలకు చెందిన 22,567 మంది పెట్రోల్ వాహన యజమానులు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది E20 పెట్రోల్ అమలు విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.సర్వేలో పాల్గొన్న వారిలో 53 శాతం మంది రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మంత్రిత్వ శాఖ E20 అమలు విధానాన్ని తప్పుబట్టారు. 42 శాతం మంది ఈ విధానాన్ని విపత్తుగా అభివర్ణించారు. కొంతమంది మాత్రమే ప్రభుత్వ చర్యలను మెచ్చుకున్నారు.2023కు ముందు తయారైన పెట్రోల్ వాహనాలను వినియోగిస్తున్న యజమానుల్లో 66 శాతం మంది E20 పెట్రోల్ వాడిన తర్వాత తమ వాహనాల మైలేజీ 10 శాతం కంటే ఎక్కువ తగ్గిందని తెలిపారు. ఇథనాల్ శక్తి సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే.. తక్కువగా ఉండటంతో, అదే దూరం ప్రయాణించడానికి ఎక్కువ ఇంధనం అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాత వాహనాల్లో మైలేజీ తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.సర్వేలో పాల్గొన్న వారిలో 45 శాతం మంది తమ వాహనాల్లో విడిభాగాలు అరిగిపోవడం, మరమ్మతుల అవసరం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకించి ఇథనాల్‌కు అనుకూలంగా రూపొందించని పాత ఫ్యూయల్ పైపులు, రబ్బరు సీల్స్, గ్యాస్కెట్లు, ఫ్యూయల్ పంప్ వంటి భాగాలపై ప్రభావం పడే అవకాశముందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.భారత్‌లో 2023 ఏప్రిల్‌కు ముందు తయారైన చాలా పెట్రోల్ వాహనాలు E10 (10 శాతం ఇథనాల్) మిశ్రమానికి అనుగుణంగా ఉన్నాయి. 2025 ఏప్రిల్ తర్వాత తయారైన వాహనాలే పూర్తిగా E20కు అనుకూలంగా తయారవుతున్నాయి. కాబటి ప్రస్తుతం రోడ్లపై నడుస్తున్న కోట్లాది పాత వాహనాల యజమానులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారని సర్వే సూచిస్తోంది.సర్వేలో మరో ఆసక్తికర అంశం వెలుగుచూసింది. 2023కు ముందు తయారైన వాహనాల యజమానుల్లో 31 శాతం మంది, ధర ఎక్కువైనా E0 (ఇథనాల్ లేని పెట్రోల్) లేదా E10 పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఉంటే దానినే ఎంచుకుంటామని తెలిపారు. అంటే.. ప్రజలు ఇథనాల్ మిశ్రమాన్ని పూర్తిగా వ్యతిరేకించడం కాదు. తమ వాహనానికి సరిపోయే ఇంధనాన్ని ఎంచుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. -
అందుకే E20 పెట్రోల్ మాకొద్దు.. భూటాన్ స్పష్టం!
భారతదేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపే E20 ఇంధన విధానం అమలులోకి వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొందరు వాహనదారులు మైలేజ్ తగ్గడం, ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుందంటూ.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో భారత్ నుంచి పూర్తిగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పొరుగు దేశం భూటాన్ మాత్రం E20 పెట్రోల్‌ను తీసుకోవడానికి నిరాకరించింది. సాధారణ పెట్రోల్ అందుబాటులో ఉన్నంత వరకు అదే సరఫరా చేయాలని భారత చమురు సంస్థలను కోరింది.భూటాన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం.. అక్కడి పాత ఇంధన నిల్వ వ్యవస్థ ఉండటమే. దేశంలోని చాలా ఫ్యూయల్ ట్యాంకులు భూగర్భంలో ఉండటంతో వాటిలోకి నీరు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ తేమను త్వరగా ఆకర్షించే స్వభావం కలిగి ఉండటంతో, నీరు కలిసితే ఇంధనం నాణ్యత దెబ్బతింటుంది. అంతేకాదు, ట్యాంకులు, పైప్లైన్లలో తుప్పు పట్టే ప్రమాదం పెరిగి, దీర్ఘకాలంలో వాహనాల ఇంజిన్లపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భూటాన్ అధికారులు చెబుతున్నారు.అంతేకాకుండా.. భూటాన్ ఎక్కువ భాగం పర్వత ప్రాంతం కావడం, అక్కడ అధిక తేమ ఉండటం కూడా మరో సవాలుగా మారింది. కొండ ప్రాంతాల్లో వాహనాలకు పూర్తి శక్తితో పనిచేసే ఇంధనం అవసరం కావడంతో E20 ఇంధనం ఆశించిన స్థాయిలో పనితీరు ఇవ్వకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
చీమలు పడతాయా? ఇంజిన్లు పాడైపోతున్నాయా?
కొత్త వాహనం కొంటే ఈ20 పెట్రోల్ పోయొచ్చా? కొత్తగా వచ్చిన ఈ పెట్రోల్ అసలు పాత బండ్లకు పనికొస్తుందా?. ఇథనాల్‌తో ఇంజిన్ పాడు కాదా? మైలేజ్ తగ్గిపోదా? చెరకు నుంచి తయారయ్యే ఇథనాల్ కోసం నీటిని విచ్చలవిడిగా వాడుతున్నారా? తీపి గుణం వల్ల బండికి చీమలు పడుతున్నాయా? దీని తయారీలో పర్యావరణ కాలుష్యం జరుగుతుందా?.. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ క్లెయిమ్స్‌తో ఈ ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కేంద్రం ఈ20ను "ప్రయోగం"గా అభివర్ణించిందంటూ వచ్చిన వార్తలు మరింత గందరగోళానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి రంగంలోకి దిగింది.ఈ20 ఎలాంటి ప్రయోగం కాదని.. శాస్త్రీయ పరీక్షలు, ఆటోమొబైల్ తయారీ సంస్థలతో విస్తృత సంప్రదింపులు, నిపుణుల సిఫార్సుల తర్వాతే దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నామని తెలిపింది. 2023 నుంచి తయారవుతున్న చాలా కొత్త వాహనాలు ఈ20 ఇంధనాన్ని దృష్టిలో పెట్టుకునే రూపొందించబడినవేనని పేర్కొంది.సోషల్ మీడియాలో ప్రచారం.. కేంద్రం వివరణ👉"ఈ20 వల్ల ఇంజిన్ పాడవుతుంది" అనేదే. దీనిపై కేంద్రం స్పష్టంగా స్పందించింది. ఈ20కు అనుకూలంగా రూపొందించిన వాహనాల్లో ఇంజిన్ దెబ్బతింటుందనే వాదనకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపింది. ఇప్పటికే లక్షలాది వాహనాలు ఈ20ను ఉపయోగిస్తున్నప్పటికీ, పెద్దఎత్తున ఇంజిన్ సమస్యలు నమోదైన దాఖలాలు లేవని వివరించింది.👉ఇథనాల్ ఎక్కువగా నీటిని పీల్చుకుంటుందన్న ప్రచారాన్ని కూడా ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇంధన ట్యాంకులోకి నీరు చేరడం ఏ రకమైన పెట్రోల్కైనా సమస్యేనని, అది ఈ20కు మాత్రమే సంబంధించిన అంశం కాదని వివరించింది. ఆధునిక వాహనాల్లో ఇందుకు తగిన సాంకేతిక భద్రతా వ్యవస్థలు ఉన్నాయని తెలిపింది.👉మరోవైపు చెరకు రసాన్ని నేరుగా పెట్రోల్‌లో కలుపుతున్నారు. ఇథనాల్ వల్ల బండికి చీమలు వస్తున్నాయి అంటూ సో.మీ.లో జరుగుతున్న ప్రచారాలను కూడా కేంద్రం అవాస్తవాలుగా కొట్టిపారేసింది. ఇంధనంగా వినియోగించే ఇథనాల్ అనేది చెరకు రసం, మొలాసిస్, మొక్కజొన్న, విరిగిన బియ్యం వంటి ముడి పదార్థాల నుంచి పలు పారిశ్రామిక ప్రక్రియల ద్వారా తయారవుతుందని వివరించింది. అందులో చక్కెర ఉండదని, కాబట్టి చీమలు వస్తాయన్న వాదనకు శాస్త్రీయ ఆధారం లేదని స్పష్టం చేసింది.👉ఈ20 వాడితే వాహన బీమా చెల్లదన్న ప్రచారాన్నీ కేంద్రం ఖండించింది. బీమా సంస్థల నిబంధనల్లో అలాంటి షరతులేమీ లేవని తెలిపింది. అలాగే ఈ20 ఇంధనం భారత్‌కు కొత్తైనా... ప్రపంచానికి కొత్త కాదని గుర్తు చేసింది. బ్రెజిల్లో ఈ27, అమెరికాలో ఈ15, ఈ85 వంటి ఇథనాల్ మిశ్రమ ఇంధనాలు చాలాకాలంగా వినియోగంలో ఉన్నాయని వివరించింది.ఇలా.. ఈ20పై వైరల్ అవుతున్న ప్రతి అపోహకు ఒక్కొక్కటిగా సమాధానం చెప్పింది. వాస్తవానికి ఈ వివాదానికి కారణం సుప్రీంకోర్టులో జరిగిన ఓ విచారణ. ఇథనాల్ కేటాయింపులకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ20 కార్యక్రమం ఇంకా ప్రయోగ దశలోనే ఉందని కోర్టుకు చెప్పిందంటూ కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో "ప్రజలపై ప్రయోగం చేస్తున్నారా?" అంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఈ వార్తలను అటార్నీ జనరల్ కార్యాలయం వెంటనే ఖండించింది. కోర్టులో ప్రభుత్వం అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదని, న్యాయవాదనలను తప్పుగా అర్థం చేసుకుని కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేశాయని స్పష్టం చేసింది. ఇటు.. పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ కూడా పూర్తి వివరణ విడుదల చేసింది.ఈ20 కార్యక్రమం వల్ల దేశానికి కలుగుతున్న ప్రయోజనాలను కూడా ప్రభుత్వం వివరించింది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో ఇప్పటివరకు రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని తెలిపింది. రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని, కార్బన్ ఉద్గారాలు తగ్గుతున్నాయని పేర్కొంది. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంలో ఈ20 కీలక పాత్ర పోషిస్తోందని వెల్లడించింది.సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై వచ్చిన గందరగోళం, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అపోహలు... ఈ రెండింటి నేపథ్యంలో కేంద్రం స్వయంగా వివరణ ఇవ్వడం ఇప్పుడు ఈ20పై నెలకొన్న అనేక సందేహాలకు తెరదించింది. అయినప్పటికీ పాత వాహనాల్లో ఈ20 వినియోగానికి సంబంధించి తయారీ సంస్థల సూచనలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
E20తో మైలేజ్ తగ్గుతుందా?: కేంద్ర మంత్రి క్లారిటీ!
ఈ20 ఫ్యూయెల్ గురించి సోషల్ మీడియాలో అనేక విమర్శలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా E20 ఇంధనం వాడితే వాహనం మైలేజ్ తగ్గుతుందని, ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతాయనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అంశాలపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. అంతే కాకుండా.. మధ్యప్రాచ్య సంక్షోభం కారణంగా పెరిగిన ఇంధన ధరలపై కూడా ఆయన స్పందించారు.E20 ఫ్యూయెల్ అంటే?E20 ఫ్యూయెల్ అంటే.. 20 శాతం ఇథనాల్, 80 శాతం పెట్రోల్ కలిపిన ఇంధనం. ఇథనాల్ అనేది చెరకు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటల నుంచి తయారయ్యే జీవ ఇంధనం (Biofuel). దీని వినియోగం వల్ల దిగుమతి చేసుకునే ముడి చమురు అవసరం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా కొంత మేర తగ్గుతుంది.ఈ20 ఇంధనం వల్ల మైలేజ్ తగ్గుతుందా?ఈ20 ఫ్యూయెల్ వాడితే మైలేజ్ కొంత తగ్గే అవకాశం ఉందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి అంగీకరించారు. అయితే.. ఆ తగ్గుదల చాలా స్వల్పమని, అది వాహనం పరిస్థితి, డ్రైవింగ్ విధానం, రోడ్డు పరిస్థితులు వంటి అనేక అంశాలపై కూడా ఆధారపడి ఉంటుందని తెలిపారు.ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై స్పష్టతఈ20 ఫ్యూయల్ వాడితే వెహికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు తిరస్కరణకు గురవుతాయని వస్తున్న వార్తలను మంత్రి పూర్తిగా ఖండించారు. ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ కూడా ఇచ్చాయి. కాబట్టి ఈ20 పెట్రోల్ ఉపయోగించడం వల్ల ఇన్సూరెన్స్ రద్దు అవుతుందనే ప్రచారం నిజం కాదని చెప్పారు.ప్రస్తుతం దేశంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలులో ఉంది. భవిష్యత్తులో 25 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ మిశ్రమం (E25, E27, E30) ప్రవేశపెట్టే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. అయితే అందుకు ముందు అవసరమైన అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తయిన తర్వాత మాత్రమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికే 22 శాతం, 25 శాతం, 27 శాతం, 30 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్‌కు సంబంధించిన BIS ప్రమాణాలను రూపొందించింది. అలాగే ఈ ఇంధనాలకు ఎక్సైజ్ సుంకంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. అయితే ఇవి కేవలం నియంత్రణ పరమైన చర్యలేనని, వెంటనే అధిక ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టే ఉద్దేశం కాదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా ప్రస్తుతం ఈ80 ఫ్యూయెల్ వినియోగించడానికి అనుకూలమైన కార్లు కూడా అందుబాటులో ఉన్నాయి. -
E20 పెట్రోల్ సేఫేనా?.. సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) పెట్రోల్ పై వినియోగదారులు, ఆటోమొబైల్ రంగంలో వ్యక్తమవుతున్న ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. E20 ఇంధన విధానం ప్రస్తుతం ప్రయోగ దశలోనే ఉందని, కాబట్టి సురక్షితమా? కాదా? అని తేలడానికి ఇంకా సమయం పడుతుందని సుప్రీంకోర్టుకు కేంద్రం వెల్లడించింది.కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఓ ఉత్తర్వును సవాల్ చేస్తూ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ వ్యాఖ్యలు చేశారు. 20 శాతం ఇథనాల్ మిశ్రమం ప్రభుత్వ విధానంలో భాగమైనప్పటికీ, దాని ప్రభావాన్ని నిరంతరం పరిశీలిస్తున్నామని కోర్టుకు తెలిపారు.ఇటీవల E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల ఇంజిన్లకు నష్టం కలుగుతుందా? మైలేజ్ తగ్గుతుందా?.. కాలుష్యం జరుగుతుందా? అనే సందేహాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. అయితే ఈ ఆందోళనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. E20 ఇంధనం వల్ల వాహనాలకు నష్టం జరుగుతుందనే నిర్ధారిత ఆధారాలు ఇప్పటివరకు లేవని ప్రభుత్వం పేర్కొంది.ఇంకా ఇథనాల్ మిశ్రమం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గడం, విదేశీ మారకద్రవ్య ఆదా, రైతులకు అదనపు ఆదాయం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు వంటి ప్రయోజనాలు ఉన్నాయని కేంద్రం మరోసారి నొక్కి చెప్పింది. ఈ విధానం ద్వారా భారత్ ఇప్పటికే రూ.1.4 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసిందని తెలిపింది.దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం (E20) అమలు లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించిన గడువు(2030) కంటే ముందుగానే సాధించింది. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ సరఫరా ప్రారంభమైంది. ఇప్పుడు 2030 నాటికి ఇథనాల్ మిశ్రమాన్ని 30 శాతానికి పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.అయితే E20పై వినియోగదారుల సందేహాలు కొనసాగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది నాటికి ఈ విధానం ప్రభావంపై స్పష్టమైన అంచనా వస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
పాత కార్లకు E20 పెట్రోల్ ప్రమాదమేనా?
ప్రభుత్వం ఈ20 పెట్రోల్ (20 శాతం ఇథనాల్+ 80 శాతం పెట్రోల్) వినియోగాన్ని వేగంగా పెంచుతోంది. దేశం తన ఈ20 లక్ష్యాన్ని ముందుగానే చేరుకోవడంతో, ఈ ఇంధనం ఇప్పుడు ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది. అయితే వాహన యజమానుల్లో 'E20 పెట్రోల్ వాడితే ఇంజిన్‌కు నష్టం జరుగుతుందా?' అనే అనుమానం మాత్రం అలాగే ఉంది.నిపుణుల ప్రకారం.. అన్ని వాహనాలకు ఈ20 పెట్రోల్ హానికరం కాదు. ముఖ్యంగా ఏప్రిల్ 2023 తర్వాత తయారైన వాహనాలు ఇప్పటికే ఈ20 ఇంధనానికి అనుగుణంగా తయారయ్యాయి. ఈ కార్లు ఈ ఫ్యూయల్‌తో సజావుగా పనిచేస్తాయి. కానీ 2023కి ముందు తయారైన పాత వాహనాలు సాధారణంగా ఈ10 లేదా ప్యూర్ పెట్రోల్‌కు మాత్రమే అనుకూలంగా ఉంటాయి. అందువల్ల వాటిలో ఈ20 వాడితే కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.పాత వాహనాల్లో సమస్యలు రావడానికి ప్రధాన కారణం.. ఇథనాల్ స్వభావం. ఇథనాల్ నీటిని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. దీని వల్ల ఫ్యూయల్ ట్యాంక్‌లో తేమ చేరి తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి రబ్బర్ సీల్స్, ప్లాస్టిక్ ఫ్యూయల్ లైన్స్ వంటి భాగాలు కాలక్రమేణా దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌లో మురికి పేరుకుపోయి పనితీరు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా.. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ తక్కువగా ఉండటంతో మైలేజ్ కొంత తగ్గుతుంది.ఇదీ చదవండి: రూ.20 లక్షల కారు కొనడంపై ChatGPT క్లారిటీఅయితే.. పాత వాహన యజమానులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ20 వల్ల కలిగే సమస్యలను తగ్గించుకోవచ్చు. ఫ్యూయల్ అడిటివ్స్ వాడడం ఒక సులభమైన మార్గం. ఇవి ఇంధనంలోని ఇథనాల్ ప్రభావాన్ని కొంతవరకు నియంత్రించగలవు. అలాగే.. పాత ఫ్యూయల్ లైన్స్‌ను PTFE లేదా బ్రైడెడ్ స్టీల్ లైన్స్‌తో మార్చడం ద్వారా దీర్ఘకాలిక రక్షణ పొందవచ్చు. ఇంజిన్ సీల్స్‌ను విటాన్ వంటి మెటీరియల్స్‌తో అప్‌గ్రేడ్ చేయడం కూడా ఉపయోగకరం.మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఉన్న వాహనాల్లో తుప్పు రాకుండా స్పెషల్ కోటింగ్ చేయించుకోవచ్చు. వాహనాల్లో ఈసీయూ ట్యూనింగ్ లేదా అప్డేటెడ్ మ్యాపింగ్ ద్వారా కూడా ఈ20 అనుకూలతను మెరుగుపరచవచ్చు. కాబట్టి పాత వాహనాలను ఉపయోగించేవాళ్లు ఈ విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. -
‘ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితమే’
న్యూఢిల్లీ: ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితమేనని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై వినియోగదారుల్లో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో సందేహాలను తొలగించే ప్రయత్నం చేసింది. 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20) ప్రస్తుతం దేశవ్యాప్తంగా విక్రయాలకు అందుబాటులో ఉండడం గమనార్హం. దీన్ని వినియోగించడం వల్ల వాహన బీమా క్లెయిమ్‌పై ప్రభావం పడుతుందన్న ఆందోళనలు కూడా వచ్చాయి.దీంతో కేంద్ర పెట్రోలియం శాఖ స్పందిస్తూ.. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వినియోగదారులకు అనుకూలమని, ఆర్థికంగా ప్రయోజనకరమని స్పష్టం చేసింది. ఈ20 పెట్రోల్ వినియోగించడం వల్ల వాహన బీమా క్లెయిమ్ లభించందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని పేర్కొంది. ‘‘ఇథనాల్ మిశ్రమం అన్నది అంతర్జాతీయంగా ఆమోదంలో ఉన్న విధానమే. యూఎస్, బ్రెజిల్, జపాన్ తదితర దేశాల్లో విజయవంతంగా అమలవుతోంది’’అని పెట్రోలియం శాఖ ప్రకటన విడుదల చేసింది.బ్రెజిల్ అయితే పెట్రోల్‌లో ఇథనాల్‌ను మరింత ఎక్కువగా కలుపుతోందని, ఈ27 అక్కడ అమల్లో ఉందని పేర్కొంది. ఇథనాల్‌ను కలపడం వల్ల పెట్రోల్ దిగుమతులను తగ్గించుకోవచ్చంటూ, ఈ రూపంలో ఇప్పటి వరకు రూ.1.4 లక్షల కోట్ల మేర విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసినట్టు తెలిపింది. మరోవైపు ఇథనాల్ తయారీలోకి వినియోగించే వ్యవసాయ ముడి సరుకులకు స్థిరమైన డిమాండ్ ఏర్పడినట్టు, అది రైతులకు ఆదాయాన్ని పెంచి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సాయపడుతున్నట్టు వెల్లడించింది.‘‘దేశ ఇందన భద్రతలో ఇథనాల్ కీలక పాత్ర పోషిస్తోంది. కర్బన ఉద్గారాల విడుదలను తగ్గించి, పర్యావరణ అనుకూలమైన రవాణాకు తోడ్పడుతోంది’’అని పెట్రోలియం శాఖ ప్రకటించింది. -
ఈ–20... మనకేంటి?
ఇథనాల్!!. దీనిచుట్టూ ముఖ్యమైన ఆర్థికాంశాలున్నాయి. దాన్ని మించిన రాజకీయాలున్నాయి. వీటన్నిటినీ మించిన ప్రచార హోరు ఉంది. సరే! మరి వాస్తవాలేంటి? ఈ–20, ఈ–30 నుంచి మనమిప్పుడు ఈ–85కు వచ్చేశామని కేంద్రం ఘనంగా ప్రకటిస్తోంది. అంటే... 85 శాతం ఇథనాల్, మిగిలిన 15 శాతం పెట్రోల్ కలిపి వాహనాల్లో ఇంధనంగా వాడతారన్న మాట. మరి ఇలా వాడటం వల్ల ఎవరికెంత లాభం? ఎవరికెంత నష్టం? మన వాహనాలు వీటన్నిటికీ రెడీయేనా? ఇదంతా కేవలం ప్రభుత్వ దిగుమతి బిల్లు తగ్గించుకోవటానికేనా? పర్యావరణ హితమని చెబుతున్నదాంట్లో నిజమెంత? ఇవన్నీ వివరించేదే ఈ ప్రత్యేక కథనం..రూపాయి పతనాన్ని అడ్డుకోవాలన్నా... డాలర్ కాస్త దిగిరావాలన్నా మొదట మనం చమురు, బంగారం దిగుమతులు తగ్గించుకోవాలి. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపేసి విక్రయించటం మొదలుపెట్టింది కూడా అందుకే. నిజానికి ఇథనాల్ బ్లెండింగ్ 2001లో మొదలైంది. ప్రయోగాత్మకంగా కొన్ని రాష్ట్రాల్లో మొదలై... రకరకాల దశలు దాటుతూ చివరకు 2014 నాటికి బ్లెండింగ్ 2 శాతానికి చేరింది. అప్పట్లో ఇథనాల్ ఉత్పత్తి భారీగా లేకపోవటమూ దీనిక్కారణమే. కానీ తరవాత కేంద్రం వేగంగా కదిలి.. ఉత్పత్తిని పెంచే చర్యలు తీసుకోవటంతో ఇపుడు పెట్రోల్‌లో ఇథనాల్ 20 శాతానికి చేరిపోయింది. ఇపుడు దేశంలో ఏకంగా రోజుకు 20 బిలియన్ లీటర్ల ఇథనాల్ ఉత్పత్తవుతోంది. దీనిలో 12 బిలియన్ లీటర్లను మాత్రమే ఈ–20 రూపంలో కలపగలుగుతున్నారు. మిగిలిన ఇథనాల్‌ను కూడా వాడకంలోకి తెచ్చేందుకే ఇపుడు ఏకంగా ఈ–85 అంటూ ఫ్లెక్స్ ఇంధనాన్ని అమల్లోకి తెచ్చారు. దీనికోసం పలు కంపెనీలు ఫ్లెక్స్ వాహనాలను కూడా తయారు చేయటం మొదలెట్టాయి. జనం ఆందోళనేంటి? అందులో నిజమెంత? ఈ–85 ఫ్లెక్స్ ఇంధనాన్ని దానికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫ్లెక్స్ వాహనాల్లో వాడతారు కనక ఇబ్బందులుండవు. కానీ ఈ–20 అనేది చాలా వేగంగా సాధించిన బ్లెండింగ్. ఈ బ్లెండింగ్ పెరిగినంత వేగంగా దాన్ని తట్టుకునే వాహనాలను కంపెనీలు తయారు చేయలేదు. 2023 ఏప్రిల్ నుంచీ ఈ–20 మిశ్రమాన్ని తట్టుకునే వాహనాలనే తయారు చేయాలని కేంద్రం నిబంధనలు తెచ్చింది. 2025 నుంచి ఈ–20ని మరింత సమర్థంగా మార్చే వాహనాల్ని తయారు చేయాలని కేంద్రం ఆదేశాలిచ్చింది. ఇదంతా బాగానే ఉంది. కానీ 2023కు ముందు రోడ్లపైకి వచ్చిన వాహనాల సంగతేంటి? అవి ఈ–20ని తట్టుకోగలవా? వాహనాలు పాడైపోవా? జవాబుదారీ ఎవరిది? ఇదే జనం ఆందోళన. వాటిలో నిజానిజాలేంటో ఒకసారి చూద్దాం... ఈ–10 వరకూ ఫర్వాలేదు... ఈ–10 వరకూ ఏ వాహనమైనా ఓకే. ప్రపంచవ్యాప్తంగా వాహనాలన్నీ ఈ–10తో పెద్ద సమస్యలు లేకుండానే నడుస్తున్నాయి. వాహనాల జీవితకాలం పెద్దగా తగ్గటమంటూ ఉండదు. ఈ–20.. ఆధునిక వాహనాలైతే ఓకే... వీటికోసం ప్రత్యేకంగా తయారు చేసిన వాహనాలైతే (2023 ఏప్రిల్ తర్వాత వచ్చినవి) ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఎందుకంటే వాహనాల ఫ్యూయల్ పంప్‌లను, ఇంజెక్టర్లను, ఫ్యూయల్ లైన్స్‌ను, ఇంజిన్ కాలిబరేషన్ను కంపెనీలు మార్చాయి. కానీ ఇలా మార్చని వాహనాల్లో ఈ–20 వాడితే కొంత ఇబ్బందేనన్నది నిపుణుల మాట. ట్యాంకు, పంపు, పైపులు, ఇంజెక్టర్లు, రబ్బర్ సీల్స్‌తో కూడిన ఇంజిన్ సిస్టమ్ దీర్ఘకాలంలో అరిగి దెబ్బతినే అవకాశాలు ఎక్కువన్నది వారి వారి్నంగ్. ఈ–85, ఈ–100... ఫ్లెక్స్ వాహనాలకే ఈ ఇంధనాన్ని వాడాలంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉన్న వాహనాలు కావాలి. సాధారణ వాహనాల్లో ఈ ఇంధనం వాడలేం. దీనికి విభిన్నమైన ఫ్యూయల్ మ్యాపింగ్, సెన్సర్లు, భిన్నమైన భాగాలుంటాయి కనక ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. ఈ రకం వాహనాలను ఇప్పటికే బ్రెజిల్లో లక్షల కొద్దీ వాడుతున్నారు. మన దేశంలోనూ పలు కంపెనీలు ప్రత్యేక ఫ్లెక్స్ వాహనాలను తయారు చేసి ఇప్పటికే విడుదల చేశాయి.పికప్, మైలేజీ సంగతేంటి?ఇథనాల్‌ను పెట్రోల్‌తో పోలిస్తే ఆక్టేన్ రేటింగ్ ఎక్కువ. దీంతో ఇంజిన్ న్యాకింగ్ను బాగా తట్టుకుంటుంది. సామర్థ్యం ఎక్కువ. పికప్ బాగుంటుంది. కాకపోతే మైలేజీ మాత్రం పెట్రోల్‌తో పోలిస్తే తక్కువే. ఎందుకంటే పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్‌లో 30– 35 శాతం ఎనర్జీ తక్కువ. దీనివల్ల ఈ–20 అయితే 3–8 శాతం... ఈ–85 అయితే 20–30 శాతం, ఈ–100 అయితే 25–35 శాతం మైలేజీ పడిపోయే అవకాశం ఎక్కువ. అంటే ఇథనాల్‌తో మైలేజీ తగ్గటమన్నది వాస్తవం. ఇక ఇంజిన్ విషయానికొస్తే కొత్త వాహనాలకైతే ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. 2023కు ముందు వాహనాలైతే కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదన్నది నిపుణుల మాట. పైపెచ్చు ఇథనాల్ గాలి నుంచి ఎక్కువ తేమను లాక్కుంటుంది. దీనివల్ల దీర్ఘకాలం వాడకుండా ఉంచితే పనిచేయటం మానేయొచ్చు. బోట్లు, జనరేటర్లలోనూ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి.లాభమెవరికి... నష్టమెవరికి?దిగుమతుల కోసం భారీగా డాలర్లు వెచ్చిస్తున్న మన కేంద్ర ప్రభుత్వానికి ఇథనాల్ కాస్త ఊరటనే చెప్పాలి. దీనివల్ల కొంతయినా దిగుమతుల బిల్లు తగ్గుతోంది. చెరకు రైతులకూ కొంతవరకూ లాభమే. గ్రామాల్లో డిస్టిలరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. లాజిస్టిక్స్ అవసరాలు పెరుగుతాయి. కాకపోతే... భారీగా చెరకు, జొన్న, ఆహారధాన్యాలు అవసరమవుతాయి. పైపెచ్చు చెరకు పంటకు విపరీతమైన నీటి వనరులు కావాలి. భారీగా పండించాలంటే భారీగా జలవనరులూ కావాలి. ఇదే పలువురి ఆందోళనకు కారణమవుతోంది. పంటలను ఆహారానికి ఖర్చు చేయాలా? ఇంధనానికి ఖర్చు చేయాలా? అన్న చర్చ కూడా మొదలైంది. వీటన్నిటికీ కేంద్రం సరైన సమాధానం చెప్పగలిగినప్పుడే ఇథనాల్ ఎకానమీ ప్రశాంతంగా ముందుకెళుతుంది.ఇదీ... ఫ్లెక్స్ ఎకానమీ ఈ–85 ఇంధనాన్ని ఈ–20 కన్నా లీటరుకు రూ.20 తగ్గించి విక్రయిస్తున్నారు. దీన్నో ఆకర్షణీయ డిస్కౌంట్‌గా ప్రభుత్వం చెబుతున్నా... తగ్గుతున్న మైలేజీతో పోలిస్తే ఈ డిస్కౌంట్ వల్ల ఏమాత్రం లాభం లేదన్నది సామాన్యుల మాట. ప్రభుత్వం మాత్రం ఈ ఏడాది చివరి నాటికి ఈ–85 ఇథనాల్ స్టేషన్లను 500 ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ సంఖ్యను 5వేలకు చేర్చాలనేది లక్ష్యం. ఇక వాహన తయారీ కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి కొత్త మోడళ్లు తెచ్చేశాయి. మారుతీ సుజుకీ వ్యాగన్–ఆర్, హీరో సంస్థ స్ప్లెండర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్‌లో ఫ్లెక్స్ మోడళ్లు తెచ్చాయి. మిగిలిన కంపెనీలూ పలు మోడళ్ల తయారీలో ఉన్నాయి.ఏంటీ ఇథనాల్? ఎలా వస్తుంది?ఇథనాల్ అంటే... చక్కెరలు, పిండిపదార్థాలు పులియబెట్టడం ద్వారా తయారయ్యే ఆల్కహాల్. సాధారణంగా చెరకురసం, చక్కెర పరిశ్రమలో వచ్చే మొలాసిస్, జొన్న, పాడైన ఆహారధాన్యాలు, వరి, గోధుమ, వ్యవసాయ వ్యర్థాల నుంచి దీన్ని తయారు చేస్తుంటారు.స్టాక్ మార్కెట్లో లబ్ధిదారులు ఎవరు?భారత్‌లో ఇథనాల్ మిశ్రమ ఇంధనాల (ఈ20, ఈ85, ఈ100) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ఇథనాల్ సంబంధిత కంపెనీలు సమానంగా లాభపడవు. కొన్ని ప్రత్యక్షంగా, మరికొన్ని పరోక్షంగా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.ఇథనాల్ ఉత్పత్తి కంపెనీలుబల్రామ్పూర్ చినీ మిల్స్ దేశంలోని అతిపెద్ద ఇథనాల్ ఉత్పత్తిదారుల్లో ఒకటి. భారీ స్థాయిలో డిస్టిలరీల విస్తరణ. చక్కెర, ఇథనాల్ వ్యాపారాల సమీకరణ చేస్తుంది. ఇథనాల్ డిమాండ్ పెరిగితే అత్యధికంగా లాభపడే కంపెనీల్లో ఇది ముందుంటుంది. ప్రజ్ ఇండస్ట్రీస్ ఇథనాల్ ప్లాంట్ల రూపకల్పన, నిర్మాణంలో నైపుణ్యం. ఏ కంపెనీ కొత్త ప్లాంటు నిర్మించినా ఆర్డర్లు పొందే అవకాశం.రెండో తరం (2జీ) ఇథనాల్ టెక్నాలజీలో కూడా కీలక పాత్ర. దేశ ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం 20 బిలియన్ లీటర్ల నుంచి 30 బిలియన్ లీటర్లకు పెరిగితే ప్రజ్కు భారీ అవకాశాలు ఉండొచ్చు. త్రివేణి ఇంజినీరింగ్చక్కెర. డిస్టిలరీలు, ఇథనాల్ ఈ మూడు రంగాల్లోనూ ఉనికి ఉండడం వల్ల లాభాలు పొందే అవకాశం ఉంది. దాల్మియా భారత్ షుగర్ లిస్టెడ్ షుగర్ కంపెనీల్లో ఇథనాల్‌పై ఎక్కువ దృష్టి పెట్టిన సంస్థల్లో ఒకటి. శ్రీ రేణుక షుగర్స్ చక్కెర, ఇథనాల్ రంగాల్లో బలమైన స్థానం కలిగిన కంపెనీ.మొక్కజొన్న ఆధారిత ఇథనాల్ కంపెనీలు నీటి కొరత కారణంగా భవిష్యత్తులో చెరకు కంటే మొక్కజొన్న (మైజ్) ఆధారిత ఇథనాల్‌కు ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉంది. → గుజరాత్ అంబుజా ఎక్స్‌పోర్ట్స్ – మొక్కజొన్న ప్రాసెసింగ్‌లో బలమైన ఉనికి. → సుఖ్జిత్ స్టార్చ్ అండ్ కెమికల్స్చమురు మార్కెటింగ్ కంపెనీలు: → ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ → భారత్ పెట్రోలియం కార్పొరేషన్→ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ఇవి ఈ 85, ఈ100 ఇథనాల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాయి. ఇథనాల్ నిల్వలు, రవాణా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాయి. అయితే వీటి మొత్తం ఆదయాంలో ఇథనాల్ వాటా తక్కువే కావడం వల్ల ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశముంది.ఆటో మొబైల్ కంపెనీలు → మారుతీ సుజుకీ దేశంలో తొలి ఫ్లెక్స్–ఫ్యూయల్ ప్యాసింజర్ కారును ప్రవేశపెట్టింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ముందుగానే సన్నద్ధమవుతోంది. → హీరో మోటోకార్ప్ భారత్ ప్రధానంగా ద్విచక్ర వాహనాల మార్కెట్ కావడంతో మంచి అవకాశాలు ఉన్నాయి. → బజాజ్ ఆటో భవిష్యత్తులో ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇవన్నీ దీర్ఘకాల పెట్టుబడిదారులకు ఆసక్తికరమైన ఎంపికలే..ఇంకా ఇథనాల్ తయారీదారులతో పాటు డిస్టిలేషన్ పరికరాల తయారీ, నిల్వ ట్యాంకులు, ఇన్ఫ్రా, బయోఫ్యూయెల్, ధాన్యం ప్రాసెసింగ్ కంపెనీలకూ లాభమే. → భారత్‌లో ఈ–20 అమల్లో ఉంది. అంటే మనకు వస్తున్న పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపి విక్రయిస్తున్నారు. → బెజిల్ ఎప్పటి నుంచో ఈ–85. ఈ–100ని విక్రయిస్తోంది. (రమణమూర్తి మంథా) -
మే చివరినాటికి ‘కేఫే-3’ నిబంధనలు
దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని మలుపు తిప్పే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ (కేపే) ఫేజ్-3 నిబంధనల నోటిఫికేషన్‌కు సర్వం సిద్ధమైంది. ఇథనాల్ రోడ్‌మ్యాప్‌కు అనుగుణంగా చివరి నిమిషంలో కొన్ని సాంకేతిక మార్పులు (E25 రీకాలిబ్రేషన్) జరిగినప్పటికీ ఈ నెల చివరి నాటికే తుది నిబంధనలను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) తుది ఫార్ములాను సిద్ధం చేస్తోంది.ప్రధాని కార్యాలయం పర్యవేక్షణ..భారతదేశ ముడిచమురు దిగుమతుల భారాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూల ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా కేంద్రం ఈ అడుగులు వేస్తోంది. ఈ వ్యవహారాన్ని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నేరుగా పర్యవేక్షిస్తుండటం దీని ప్రాధాన్యతను తెలియజేస్తోంది.కేఫే నిబంధనల ఉద్దేశంవాహనాల ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. సరళంగా చెప్పాలంటే ఒక వాహన తయారీ సంస్థ (ఉదాహరణకు మారుతి సుజుకి లేదా టాటా మోటార్స్) ఒక ఆర్థిక సంవత్సరంలో విక్రయించే అన్ని కార్ల సగటు ఇంధన వినియోగం, ఉద్గారాలు ప్రభుత్వం నిర్దేశించిన పరిమితికి లోబడి ఉండాలి.E20 నుంచి E25/E27 వైపు..ఇథనాల్ బ్లెండింగ్‌ను E20 (20% ఇథనాల్) నుంచి E25/E27 (25%-27% ఇథనాల్) స్థాయికి వేగంగా తీసుకెళ్లాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ఫార్ములాను మారుస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మార్పుల కేఫే-3 లక్ష్యాల్లో ఎటువంటి మార్పు ఉండదని కేవలం ఇంధన రసాయన లక్షణాల ఆధారంగా లెక్కించే పద్ధతిని మాత్రమే సవరించినట్లు నిపుణులు స్పష్టం చేశారు. దీనివల్ల ఇథనాల్ వాడకం వల్ల వాహన సామర్థ్య అంచనాలో ఆటోమొబైల్ కంపెనీలకు నష్టం జరగదు. ‘చర్చలన్నీ పూర్తయ్యాయి. ఈ నెలాఖరుకల్లా తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వాహన తయారీదారులు తమ భవిష్యత్తు ఇంజిన్ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడానికి సమయం చాలా తక్కువగా ఉంది’ అని ఈ చర్చల్లో పాల్గొన్న ఒక సీనియర్ ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.ఆటోమొబైల్ కంపెనీలకు 11 నెలల గడువుఈ నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుంచి అమలులోకి రానున్నాయి. మే చివరినాటికి నోటిఫికేషన్ వస్తే వాహన తయారీ కంపెనీలకు సన్నద్ధమవడానికి కేవలం 11 నెలల సమయం మాత్రమే మిగులుతుంది. ఈ నిబంధనల ఆధారంగానే ఈవీలు, హైబ్రిడ్, ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఇచ్చే కంప్లయన్స్ క్రెడిట్లను లెక్కిస్తారు. ఏ సాంకేతికత కలిగిన వాహనాల తయారీ చౌకగా మారుతుందో, ఏవి ఖరీదవుతాయో ఈ నిబంధనలే డిసైడ్ చేయనున్నాయి.స్పష్టత వస్తేనే పెట్టుబడులువాహన తయారీదారులు ఇప్పటికే ఆర్థిక సంవత్సరం 2028కి సంబంధించిన ప్రొడక్ట్ ప్లానింగ్‌లో ఉన్నారు. నిబంధనలపై స్పష్టత వస్తేనే సప్లయర్లతో ఒప్పందాలు, ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం కంపెనీలకు సాధ్యమవుతుంది. రాబోయే దశాబ్ద కాలంలో భారత ఆటోమొబైల్ రంగం ఏ దిశగా సాగాలో నిర్దేశించే ఈ రూల్‌బుక్ కోసం పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.100 కోట్ల వ్యాపారానికి స్వస్తి! -
E20 Petrol: రూ.1.40 లక్షల కోట్లు ఆదా!
ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (ఈ-20 పెట్రోల్) వినియోగించడం వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, దీనివల్ల పెట్రోల్ దిగుమతులు గణనీయంగా తగ్గుతుందని కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఈ చర్య కారణంగా.. రూ. 1.40 లక్షల కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని లోక్‌సభలో వెల్లడించారు.ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వాడకంపై కొందరు ఆందోళనల చెందుతున్నారు. కానీ ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఉపయోగించే కార్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావం కనిపించలేదని, ఇప్పటికే.. దీనికి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.ఈ-20 పెట్రోల్ తక్కువ కాలుష్య కారకాలను విడుదల చేస్తుంది. ఇది పెట్రోల్, డీజిల్ కంటే కూడా ఉత్తమంగా ఉందని గడ్కరీ అన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం వల్ల, ఇథనాల్‌లో ఉపయోగించే ముడి పదార్థాలైన చెరకు, మొక్కజొన్న మొదలైన వాటి వినియోగం పెరుగుతుంది. ఇది రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేస్తుందని ఆయన అన్నారు.ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం అమలు తర్వాత.. గతంలో ముడి చమురు దిగుమతులకు ఖర్చు చేసిన డబ్బు ఇప్పుడు రైతులకు చేరుతోందని, దీంతో అన్నదాతలు.. ఊర్జాదాతలు(Energy Givers)గా మారారని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. గత 11 సంవత్సరాలలో.. ఇథనాల్ వినియోగం, సరఫరా కారణంగా 2014-15 నుంచి 2025 జూలై 2025 వరకు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ.1,40,000 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేశాయని ఆయన అన్నారు.ఇదీ చదవండి: నవంబర్‌లో ఎక్కువమంది కొన్న టాప్-10 కార్లు -
ఈ–20 ప్రణాళికపై స్పష్టతనివ్వండి
ప్రస్తుతం వినియోగిస్తున్న ఈ–20 (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మేళవింపు) ఇంధనానికి సంబంధించి తదుపరి మార్గదర్శ ప్రణాళికను రూపొందించాలని కేంద్రానికి ఇథనాల్ పరిశ్రమ విజ్ఞప్తి చేసింది. అలాగే బయోఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలపై (ఎఫ్ఎఫ్వీ) ట్యాక్స్‌లను తగ్గించాలని కోరింది. ఎఫ్ఎఫ్వీలు, స్మార్ట్ హైబ్రిడ్ వాహనాలపై జీఎస్టీని క్రమబద్ధీకరించాలని, ఫేమ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలకి ఇచ్చినట్లే వినియోగదారులకు కూడా ప్రోత్సాహకాలివ్వాలని భారతీయ చక్కెర, బయో–ఎనర్జీ తయారీదార్ల అసోసియేషన్ (ఐఎస్ఎంఏ), భారతీయ గ్రీన్ ఎనర్జీ సమాఖ్య (ఐఎఫ్జీఈ) కలిసి విన్నవించాయి. అయిదేళ్ల కన్నా ముందుగానే ఈ–20 లక్ష్యాన్ని సాధించేసిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఇథనాల్ లక్ష్యాల సాధనలో చక్కెర పరిశ్రమ గణనీయంగా కృషి చేసిందని, ఈ విప్లవాన్ని ఇలాగే కొనసాగించాలంటే పాలసీలను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని ఐఎస్ఎంఏ డైరెక్టర్ జనరల్ దీపక్ బల్లాని తెలిపారు. అయిల్ మార్కెటింగ్ కంపెనీలు 10.50 బిలియన్ లీటర్లు కోరితే, మిశ్రమ స్థాయిని 27 శాతానికి తీసుకెళ్లేందుకు సరిపడేంతగా పరిశ్రమ 17.76 బిలియన్ లీటర్లు ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. ఏటా 900 కోట్ల లీటర్ల పైగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాలను సాధించేందుకు చక్కెర పరిశ్రమ రూ.40,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని వివరించారు.ఈ–20 తదుపరి స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక లేకపోతే ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదని, పెట్టుబడులు వృధా అవుతాయని ఆయన తెలిపారు. మరోవైపు, స్పష్టమైన లక్ష్యాలతో ప్రభుత్వం జాతీయ ఇథనాల్ మొబిలిటీ రోడ్‌మ్యాప్ 2030ని ప్రకటించాలని ఐఎఫ్జీఈ ప్రెసిడెంట్ ప్రమోద్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 5 శాతమే ఉండగా, వాటితో పోలిస్తే భారీ స్థాయిలో 43 శాతం జీఎస్టీ విధిస్తుండటమనేది ఎఫ్ఎఫ్వీలు, స్మార్ట్ హైబ్రిడ్ల కొనుగోళ్లకు ప్రతికూలంగా ఉంటోందని పేర్కొన్నారు. ఎఫ్ఎఫ్వీలకు సహాయకరంగా ఉండే పాలసీలతో భారత్ వార్షిక చమురు దిగుమతుల బిల్లును రూ.50,000–75,000 కోట్ల మేర తగ్గించుకోవచ్చని తెలిపారు.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
ఈ20 ఫ్యూయెల్ ఎఫెక్ట్.. ఫెరారీ స్టార్ట్ అవ్వడం లేదట!!
భారతదేశంలో ఈ20 పెట్రోల్ వినియోగించాలని కేంద్రమంత్రి 'నితిన్ గడ్కరీ' చెబుతూనే ఉన్నారు. కొందరు నిపుణులు ఇథనాల్ వినియోగం వల్ల వాహనాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయని పేర్కొన్నారు. అయితే చండీగఢ్‌కు చెందిన ఒక వ్యక్తి ఈ20 ఫ్యూయెల్ పెట్రోల్ హై-ఎండ్ వాహనాలపై చూపే ప్రభావాన్ని ఎత్తి చూపాడు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక స్నేహితుడి ఫెరారీ కారుకు ఈ20 పెట్రోల్ ఉపయోగించాడు. అయితే ఆ కారు కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ అవ్వలేదు. కొందరు నిపుణులు ఈ20 ఇంధనం వల్లనే.. ఈ సమస్య వచ్చిందని చెబుతున్నారు. దీనికి గడ్కరీ బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.నిజం ఏమిటంటే.. సూపర్ కార్లు, హై-ఎండ్ వాహనాలు ఈ ఇంధన మిశ్రమం వల్ల ఎక్కువగా ప్రభావితమవుతాయి. కానీ ఎవరూ దాని గురించి మాట్లాడటానికి ధైర్యం చేయరు. ఇథనాల్ గాలి నుంచి తేమను గ్రహిస్తుంది. ఇలా కొన్ని రోజులు జరిగిన తరువాత ఫ్యూయెల్ ట్యాంక్‌లో తేమశాతం పెరుగుతుంది. ఫలితంగా కారు స్టార్ట్ అవ్వడంలో సమస్య ఎదురవుతుందని ఆ వ్యక్తి ఎక్స్ ఖాతాలో వివరించారు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఫెరారీ కారు స్టార్ట్ అవ్వకపోవడానికి ఖచ్చితంగా ఈ20 ఫ్యూయెల్ కారణమా? లేక ఇంకేమైనా సమస్యా? అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే E20 ఇంధనం వల్లే ఈ నష్టం జరిగిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారని అతను ట్వీట్లో పేర్కొన్నాడు. అంతే కాకుండా.. ఇప్పటి వరకు ఇథనాల్ కారణంగానే ఇలాంటి సమస్య వచ్చినట్లు ఇదివరకు కంప్లైంట్స్ రాలేదు.ఇదీ చదవండి: నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్ఇప్పటికే బ్రెజిల్, యూఎస్ఏ, చైనా, ఆస్ట్రేలియా దేశాల్లో ఈ20 ఫ్యూయెల్ ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో దీని వినియోగాన్ని పెంచాలని.. పెట్రోల్ దిగుమతులను తగ్గించాలనే ఉద్దేశ్యంతో నితిన్ గడ్కరీ.. ఈ20 పెట్రోల్‌ను ప్రోత్సహిస్తున్నారు. నిజానికి ఇథనాల్-మిశ్రమ ఇంధనం CO2 ఉద్గారాలను గణనీయంగా తగ్గిస్తుందని.. ఇంజిన్ పనితీరును మెరుగుపరుస్తుందని పేర్కొంటూ ప్రభుత్వం 2023లో భారతదేశంలో ఈ20 పెట్రోల్‌ను ప్రవేశపెట్టింది.ఈ20 పెట్రోల్ కారణంగా వెహికల్ మైలేజీ తగ్గుతుందని, ఇంజిన్ దెబ్బతింటుందనే ఆందోళనలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. దీనిపై గడ్కరీ స్పందిస్తూ.. E20 పెట్రోల్‌తో చెప్పుకోదగ్గ సమస్యలు ఉండవని చెబుతూ.. చెరకు, మొక్కజొన్న రైతులు ఆర్థికంగా లాభపడ్డారని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన వార్షిక SIAM సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.A friend’s Ferrari was filled with E20 petrol, and just a few days later it refused to start. The technicians say the damage is due to the E20 fuel. Now tell me, will Gadkari take responsibility for this? After spending crores on the car, paying road tax, vehicle GST tax, and… pic.twitter.com/4j9MGBjNGS— Rattan Dhillon (@ShivrattanDhil1) September 17, 2025 -
‘నా బ్రెయిన్ విలువ రూ.200 కోట్లు’.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు నెలకు రూ.200కోట్ల ఆదాయం వస్తుంది. ఎవర్ని మోసం చేసి సంపాదించాల్సి ఖర్మ పట్టలేదంటూ నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తగ్గింపుతో పాటు ఇతర ఉపయోగాల్ని దృష్టిలో ఉంచుకుని 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాలు జరపాలంటూ కేంద్రం నిర్ణయించింది. 20శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ అమ్మకాల అంశంలో తన కుటుంబం ఆర్థికంగా లబ్ది పొందుతోందంటూ వచ్చిన ఆరోపణల్ని గడ్కరీ ఖండించారు.నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు. ‘ఈ సందర్భంగా నా బ్రెయిల్ విలువ రూ.200కోట్లు.. నేను మోసంతో కాదు, నిజాయితీతో సంపాదిస్తున్నాను. నా కుమారులు వ్యాపారంలో ఉన్నారు. నేను వారికి సలహాలు ఇస్తాను. కానీ మోసం చేయను. ఇటీవల నా కుమారుడు ఇరాన్ నుంచి 800 కంటైనర్ల యాపిల్స్‌ను దిగుమతి చేశాడు. అలాగే 1000 కంటైనర్ల అరటిపళ్లను ఎగుమతి చేశాడు’అని చెప్పారు.నాకు డబ్బుకు కొదవలేదు. షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిల్లరీ, పవర్ ప్లాంట్ వ్యాపారాలు ఉన్నాయన్న గడ్కరీ.. ఇవన్నీ వ్యక్తిగత లాభం కోసం కాకుండా వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చేస్తున్నానని స్పష్టం చేశారు. కొద్దిరోజుల క్రితం ఓ సందర్భంలో ఈ20 ఇంధనంపై వస్తున్న విమర్శలపై గడ్కరీ స్పందించారు. ‘తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందని, అందుకు పెయిడ్ సోషల్ మీడియా ప్రచారం జరగుతోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు కూడా ఈ20 ఇంధనంపై దాఖలైన పిల్ ను తిరస్కరించిందని గడ్కరీ గుర్తు చేశారు. ఈ విమర్శలన్నీ తనను రాజకీయంగా దెబ్బతీయడానికి పెట్రోల్ లాబీలు చేస్తున్న ప్రయత్నాలని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, రైతులకు మంచి జరిగే వరకు తన ప్రయత్నాలు కొనసాగిస్తానని గడ్కరీ స్పష్టం చేశారు.ఈ ఇంధనం సురక్షితమైనదే. ఇది దిగుమతి ప్రత్యామ్నాయంగా, ఖర్చు తగ్గించే, కాలుష్యాన్ని తగ్గించే, రైతులకు మేలు చేసే విధంగా రూపొందించామన్నారు. అంతేకాక, వాహనాల స్క్రాప్ విధానాన్ని ప్రోత్సహించేందుకు జీఎస్టీ రాయితీ ఇవ్వాలని ఆర్థిక మంత్రికి సూచించానని కూడా గడ్కరీ వెల్లడించారు. -
డీజిల్‌లో ఐసోబుటనాల్: కేంద్రమంత్రి కీలక ప్రకటన
ఇప్పటి వరకు ఈ20 పెట్రోల్ గురించి చెప్పిన నితిన్ గడ్కరీ.. తాజాగా ఐసోబుటనాల్ గురించి పేర్కొన్నారు. డీజిల్‌లో 10 శాతం ఐసోబుటనాల్‌ను కలపడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI) కృషి చేస్తోందని కేంద్ర రవాణా శాఖమంత్రి అన్నారు.ఇండియా షుగర్ అండ్ బయో-ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. డీజిల్‌లో పదో వంతు ఇథనాల్‌ను కలపడంపై జరిగిన ట్రయల్స్ విజయవంతం కాలేదు. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా.. ఐసోబుటనాల్ మిశ్రమం ఉపయోగించాలని అన్నారు. ఐసోబుటనాల్ అనేది మండే లక్షణాలతో కూడిన ఆల్కహాలిక్ సమ్మేళనం. దీనిని డీజిల్‌తో పాటు ఉపయోగించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయని ఆయన అన్నారు.ఈ20 పెట్రోల్‌పై తప్పుడు ప్రచారం..ఈ20 పెట్రోల్ వినియోగంపై వస్తున్న వదంతులు అంతా.. తప్పుడు ప్రచారమని గడ్కరీ అన్నారు. ఇథనాల్ వినియోగం పెరిగితే.. ఇంధన దిగుమతులు తగ్గుతాయి. దీనివల్ల దేశ ఆర్ధిక పరిస్థితి కూడా కొంత పెరుగుతుంది, రైతుల ఆదాయం పెంచడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉపరాష్ట్రపతి జీతం సున్నా.. అయితే ఆదాయం ఎలా?భారతదేశంలో ఇథనాల్ అనేది ఎక్కువగా చెరకు మొలాసిస్ నుంచి ఉత్పత్తి అవుతుంది. మొక్కజొన్న, బియ్యం, దెబ్బతిన్న ఆహార ధాన్యాలు వంటి వనరులను కూడా ఇథనాల్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో మొక్కజొన్న ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతుందని మంత్రి అన్నారు. -
రాజకీయంగా నన్ను టార్గెట్ చేసి.. గడ్కరీ సంచలన వ్యాఖ్యలు
ఇథనాల్ కలిపిన ఇ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో విస్తృత ప్రచారం నడుస్తోంది. ఈ వ్యవహారంపై స్పందిస్తూ కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను లక్ష్యంగా చేసుకునే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. E20 ఫ్యూయల్ విషయంలో ఈ మధ్య సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం నడుస్తోంది. E20 ఫ్యూయల్ వల్ల వాహనాల మైలేజ్ తగ్గుతుందని.. ఇంజిన్‌కు నష్టం కలుగుతుందని పోస్టులు కనిపిస్తున్నాయి. పాత వాహనాలకూ ఇది అనుకూలం కాదు అంటూ గడ్కరీ ఆలోచనను తప్పుబడుతూ విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రచారంపై భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(SIAM ) వార్షిక సమావేశంలో గడ్కరీ స్పందించారు. ఈ ప్రచారం వెనుక పెట్రోల్ లాబీ ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. వాతావరణానికి కలుగుతున్న హానిని తగ్గించడంలో E20 ఫ్యూయల్ కీలక పాత్ర పోషిస్తుంది. SIAM, భారత ఆటోమొబైల్ పరిశోధనా సంఘం(ARAI) లాంటి సంస్థలు E20 ఫ్యూయల్‌ను సురక్షితమైన, సమర్థవంతమైనదిగా పేర్కొన్నాయి. మైలేజ్ తగ్గుదల అంటూ జరుగుతున్న ప్రచారాన్ని పెట్రోలియం మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. పైగా సుప్రీం కోర్టు కూడా E20 ఫ్యూయల్‌పై దాఖలైన PILను తిరస్కరించింది.. సోషల్ మీడియాలో నన్ను రాజకీయంగా లక్ష్యంగా చేసుకునే ప్రచారం జరిగింది. అది చెల్లించిన ప్రచారం(పెయిడ్ క్యాంపెయిన్). అందుకే నేను దానికి ప్రాధాన్యం ఇవ్వను. పెట్రోల్ లాబీ చాలా ధనికం. అది ఎంతో శక్తివంతంగా ఉంది. వాళ్లే ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహిస్తు ఉండొచ్చు అని అభిప్రాయపడ్డారాయన.E20 ఫ్యూయల్ అనేది 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఇంధనం. ఇథనాల్ అనేది.. జొన్న, బియ్యం, పంచదార వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుంచి తయారవుతుంది. ఇది పర్యావరణ హితమైంది. దేశీయంగా తయారయ్యే, దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే ప్రత్యామ్నాయ ఇంధనం. అందుకే గడ్కరీ దీనిని ప్రమోట్ చేస్తున్నారు. E20 ఫ్యూయల్ లక్ష్యం ఏంటంటే.. కార్బన్ ఉద్గారాలను తగ్గించడం. రూ. 22 లక్షల కోట్ల విలువైన ఫాసిల్ ఫ్యూయల్ దిగుమతులను తగ్గించడం అలాగే.. రైతులకు ఆదాయం పెంచడం (ఇథనాల్ తయారీ ద్వారా ₹45,000 కోట్ల లాభం వచ్చినట్లు గడ్కరీ పేర్కొన్నారు). అయితే.. గడ్కరీ ఓ క్లియర్ విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బయోఫ్యూయల్స్, ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ల ఆలోచనతో పాటు పాత వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా రేర్ ఎర్త్ మెటల్స్ పొందడం.. తద్వారా ఈ తరహా ఆలోచనలతో భారత ఆటో పరిశ్రమను ప్రపంచంలో #1 స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఆయన పని చేస్తున్నారు.


