కేంద్రానికి ఇథనాల్ పరిశ్రమ వినతి
ప్రస్తుతం వినియోగిస్తున్న ఈ–20 (పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మేళవింపు) ఇంధనానికి సంబంధించి తదుపరి మార్గదర్శ ప్రణాళికను రూపొందించాలని కేంద్రానికి ఇథనాల్ పరిశ్రమ విజ్ఞప్తి చేసింది. అలాగే బయోఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ఫ్లెక్స్–ఫ్యూయల్ వాహనాలపై (ఎఫ్‌ఎఫ్‌వీ) ట్యాక్స్‌లను తగ్గించాలని కోరింది. ఎఫ్‌ఎఫ్‌వీలు, స్మార్ట్ హైబ్రిడ్ వాహనాలపై జీఎస్‌టీని క్రమబద్ధీకరించాలని, ఫేమ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ వాహనాలకి ఇచ్చినట్లే వినియోగదారులకు కూడా ప్రోత్సాహకాలివ్వాలని భారతీయ చక్కెర, బయో–ఎనర్జీ తయారీదార్ల అసోసియేషన్ (ఐఎస్‌ఎంఏ), భారతీయ గ్రీన్ ఎనర్జీ సమాఖ్య (ఐఎఫ్‌జీఈ) కలిసి విన్నవించాయి. అయిదేళ్ల కన్నా ముందుగానే ఈ–20 లక్ష్యాన్ని సాధించేసిన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇథనాల్ లక్ష్యాల సాధనలో చక్కెర పరిశ్రమ గణనీయంగా కృషి చేసిందని, ఈ విప్లవాన్ని ఇలాగే కొనసాగించాలంటే పాలసీలను స్థిరంగా కొనసాగించాల్సిన అవసరం ఉంటుందని ఐఎస్‌ఎంఏ డైరెక్టర్ జనరల్ దీపక్ బల్లాని తెలిపారు. అయిల్ మార్కెటింగ్ కంపెనీలు 10.50 బిలియన్ లీటర్లు కోరితే, మిశ్రమ స్థాయిని 27 శాతానికి తీసుకెళ్లేందుకు సరిపడేంతగా పరిశ్రమ 17.76 బిలియన్ లీటర్లు ఆఫర్ చేసిందని పేర్కొన్నారు. ఏటా 900 కోట్ల లీటర్ల పైగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాలను సాధించేందుకు చక్కెర పరిశ్రమ రూ.40,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని వివరించారు.
ఈ–20 తదుపరి స్పష్టమైన మార్గదర్శ ప్రణాళిక లేకపోతే ఉత్పత్తి సామర్థ్యాలను పూర్తిగా వినియోగించుకునే పరిస్థితి ఉండదని, పెట్టుబడులు వృధా అవుతాయని ఆయన తెలిపారు. మరోవైపు, స్పష్టమైన లక్ష్యాలతో ప్రభుత్వం జాతీయ ఇథనాల్ మొబిలిటీ రోడ్‌మ్యాప్ 2030ని ప్రకటించాలని ఐఎఫ్‌జీఈ ప్రెసిడెంట్ ప్రమోద్ చౌదరి తెలిపారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్‌టీ 5 శాతమే ఉండగా, వాటితో పోలిస్తే భారీ స్థాయిలో 43 శాతం జీఎస్‌టీ విధిస్తుండటమనేది ఎఫ్‌ఎఫ్‌వీలు, స్మార్ట్ హైబ్రిడ్‌ల కొనుగోళ్లకు ప్రతికూలంగా ఉంటోందని పేర్కొన్నారు. ఎఫ్‌ఎఫ్‌వీలకు సహాయకరంగా ఉండే పాలసీలతో భారత్ వార్షిక చమురు దిగుమతుల బిల్లును రూ.50,000–75,000 కోట్ల మేర తగ్గించుకోవచ్చని తెలిపారు.
ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు


