అంతర్జాతీయ మోడల్‌గా హైదరాబాదీ.. ట్రెండింగ్‌లో భవితా మండవ | Model Bhavitha Mandava Special Story Over Chanel Event | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ మోడల్‌గా హైదరాబాదీ.. ట్రెండింగ్‌లో భవితా మండవ

Dec 7 2025 11:14 AM | Updated on Dec 7 2025 2:09 PM

Model Bhavitha Mandava Special Story Over Chanel Event

భవితా మండవ.. హైదరాబాద్‌కు చెందిన ఆమె పేరు ఇప్పుడు మారుమోగుతోంది. అనుకోకుండా మోడలైన ఆమె... ఫ్యాషన్‌ వాక్‌ని అద్భుతంగా ముందుండి నడిపించింది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన భవిత.. మోడల్‌గా మారడం ఆసక్తికరంగా జరిగిపోయింది. ఉరుకుల పరుగుల జీవితం కాస్తా... ప్రముఖ, అంతర్జాతీయ రన్‌వేల్లో నడిచే స్థాయికి చేరింది. భవితా మండవా గురించి విషయాలు ఇలా..

హైదరాబాద్‌కు చెందిన భవితా మండవ జేఎన్‌టీయూహెచ్‌(JNTUH) నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్స్‌ పూర్తిచేసింది. ఇంటరాక్టెడ్‌ డిజైన్‌ అండ్‌ మీడియాలో మాస్టర్స్‌ చదివేందుకు అమెరికా వెళ్లింది. అక్కడ అనుకోని ఒక ఘటన ఆమె జీవితాన్నే ములుపు తిప్పింది. న్యూయార్క్ సబ్‌వేలో ఆమె ట్రైన్ కోసం వేచి ఉన్న సమయంలో ఫ్రెంచ్‌- బెల్జియన్‌ డిజైనర్‌ మాథ్యూ బ్లేజీ.. ఆమె వద్దకు వెళ్లి మోడల్‌గా చేస్తారా? అని అడిగారు. అప్పటి వరకు ఆమె మోడలింగ్‌లో అనుభవం లేకపోయినా.. సరే అని ఒప్పుకుంది. 2024లో మాథ్యూ బ్లేజీ.. తనకు మోడలింగ్‌ అవకాశం ఇవ్వడంతో ఒక్కసారిగా మోడల్‌గా మారిపోయింది. 

కట్‌ చేస్తే రెండు వారాల్లోనే ఇటాలియన్‌ లగ్జరీ ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘బటేగా వనీటా’ స్ప్రింగ్‌/ సమ్మర్‌-2025 ఫ్యాషన్‌ షోలో మోడల్‌గా మెరిసింది. దాదాపు ఆరు అడుగుల ఎత్తు ఉన్న భవిత ర్యాంప్‌ వాక్‌ చేస్తే అందరూ కళ్లప్పగించి చూడాల్సిందేనన్న నమ్మకంతో ఆమెకు షోలో అవకాశం కల్పించారు. ఈ షో కాస్తా షెనెల్‌ ఎంటైర్స్‌ డీఆర్ట్‌ షోకు దారి తీసింది. తొలి షోలోనే మంచి పేరు తెచ్చుకుంది. న్యూయార్క్, పారిస్, మిలాన్, లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌ల్లో డియోర్‌ వంటి ప్రముఖ సంస్థలకు పనిచేసింది. అయితే, తనకు మాత్రం ట్రావెలింగ్‌ అన్నా చదవడమన్నా చాలా ఇష్టమట.

సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌.. 
భవితా మండవ.. తాజాగా న్యూయార్క్‌లో ఫ్రెంచ్‌ లగ్జరీ ఫ్యాషన్‌ సంస్థ ‘షనెల్‌’ ఎంటైర్స్‌ డీఆర్ట్‌-2026 పేరుతో ఫ్యాషన్‌ షో నిర్వహించింది. ఏ ష్యాషన్‌ షో అయినా ఓపెనింగ్‌ వాక్‌ కీలకం. తొలి వాక్‌తోనే అందరి దృష్టిలో పడే అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఓపెనింగ్‌ వాక్‌కి అంత ప్రాధాన్యత ఉంటుంది. పైగా 2018 తరవాత షనెల్‌ తొలిసారిగా న్యూయార్క్‌లో షో చేస్తోంది. అలాంటి ప్రతిష్ఠాత్మక షోలో ఓపెనింగ్‌ భవిత వాక్‌ చేసింది. ఈ అవకాశం అందుకున్న తొలి భారతీయ మోడల్‌ తను. కాబట్టే, ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అంతకుమించి భవిత తెలుగమ్మాయి కూడా కావడంతో ఆ వీడియో కాస్తా వైరలైంది.

అయితే, షనెల్‌తో భవిత.. ఇదివరకే స్ప్రింగ్‌ 2026 షో చేసింది. ఇది రెండో ఫ్యాషన్‌ షో. కాగా, ఓపెనింగ్‌ అవకాశం ఇంత త్వరగా అందుకోవడమే ప్రత్యేకమే అవుతుంది. అందుకే ఇది తనకో సెంటిమెంట్‌ అంటోంది భవిత. ఇదే సమయంలో తను ఉన్నత చదవుతో పాటు ఉద్యోగం కూడా చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఆమె సక్సెస్‌ చూసి అటు పేరెంట్స్‌, స్నేహితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

ఇవి కూడా చదవండి: వందేళ్ల ఫ్యాషన్‌ బ్రాండ్‌ 'షనెల్‌' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..
‘షనెల్‌’ప్యాషన్‌ షోలో ఓపెనింగ్‌ వాక్‌ చేసిన స్టార్స్‌ వీళ్లే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement